Income Tax: మేం పన్నులెందుకు కట్టాలి…?

మన దేశంలో పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా ...? ఖచ్చితంగా లేవు... పన్ను కడుతున్నావు కాబట్టి నీకు వస్తువులు తక్కువ ధరకు ఇస్తున్నారా...? లేదు... అందరికీ ఒకటే ధర... అన్నింటికీ ఒకటే ధర.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 08:45 PM IST

ఏపీ, తెలంగాణల్లో ఈ మధ్య ట్యాక్స్ స్కామ్ అంటూ ఓ అంశం తెగ ట్రెండింగ్‌లో ఉంది. కట్టిన ట్యాక్స్‌ను చాలామంది ఇల్లీగల్‌గా వెనక్కు తీసుకున్నారనే దానిపై ఐటీశాఖ విచారణ ప్రారంభించింది. మంచిదే.. తప్పు చేస్తే వదలకూడదు… నేరం నేరమే… అయితే ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ మౌలికంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిజానికి అవి అందరు పన్ను చెల్లింపు దారుల్లో ఉన్న ప్రశ్నలే….

మేం పన్ను ఎందుకు కట్టాలి…?
మా పన్నులతో మాకు సౌకర్యాలు కల్పించనప్పుడు మేం ఎందుకు నిజాయితీగా పన్నులు చెల్లించాలి…?
మా దగ్గర ముక్కుపిండి వసూలు చేసి ఎవరెవరికో పంచేయడమేంటి…?
పంచుతున్న సొమ్ముతో నిజంగా ప్రయోజనం లేనప్పుడు మేం ఎందుకు ప్రశ్నించకూడదు…?
సరైన విద్య, అందరికీ ఉచిత వైద్యం కల్పించలేనప్పుడు పన్నులెందుకు వసూలు చేయడం…?
పన్ను చెల్లింపుదారులకు అదనంగా కల్పించే ప్రయోజనాలేంటి…?
పన్ను ఎగవేతదారులు దర్జాగా తిరుగుతున్నప్పుడు మేం ఎందుకు కట్టాలి…?
జీఎస్టీ పేరుతో దోచుకుంటున్నప్పుడు మళ్లీ ఈ పన్నులేంటి…?

ఈ ప్రశ్నలు అడిగితే ఇదేదో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్లుగా విమర్శలు వచ్చేస్తాయి. కానీ పన్ను చెల్లింపుదారుల ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సిందే. రాత్రింబవళ్లు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న దాన్ని పన్నుగా కట్టే పౌరులకు తమ పన్నుల సొమ్ము ఏమవుతుందో తెలుసుకునే హక్కు ఉంది. తెలుసుకోవాల్సిన అవసరమూ ఉంది.

ట్యాక్స్‌పేయర్స్ లేవనెత్తుతున్న మొదటి ప్రశ్న… కష్టపడి సంపాదించుకుని మేమెందుకు పన్ను కట్టాలి…? చూడటానికి సిల్లీగా ఉన్నా చాలా పెద్ద ప్రశ్న ఇది. ప్రభుత్వానికి పన్నులే అతి పెద్ద ఆదాయ వనరు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర్నుంచి వారి సంపాదనను బట్టి పన్నులు వసూలు చేస్తాయి. పన్నుపీకుడు వెనకున్న అసలు అంతరార్ధం ఇదే. కానీ దీనికీ ట్యాక్స్ పేయర్స్ నుంచి మరో పెద్ద ప్రశ్న వస్తోంది. జీఎస్టీ పేరుతో మా దగ్గర ఉప్పు నుంచి పప్పు వరకు ప్రతి వస్తువుకూ పన్నుబాదేస్తున్నారుగా అని.

మనం తినే ఉప్పు, పప్పు, బియ్యం, బట్టలు, వస్తువులు ఇలా అన్నింటికీ మనం పన్నులు కడుతూనే ఉన్నాం. ప్రతిదానికి జీఎస్టీ తప్పనిసరి. ఖరీదైన వస్తువు కొంటే కాస్త ఎక్కువ పన్ను…. తక్కువ ధర వస్తువులు కొంటే తక్కువ పన్ను.. ప్రతిదానికీ పన్ను మాత్రం బాదేస్తూ ఉన్నారు. అందుకే ప్రతి నెలా లక్షా 60వేల కోట్లకు పైనే జీఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నారు కదా… పెట్రోల్, డీజీల్ సెస్ పేరుతో దాని అసలు ధరను మించిపోయేలా పన్నులు బాదేస్తున్నారా కదా…! మరి అలాంటప్పుడు మళ్లీ ఆదాయ పన్ను పేరుతో మళ్లీ బాదుడు ఎందుకు…? ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు వస్తువులు కొంటుంటారు…. దానికి తగ్గట్లుగా పన్ను వేస్తున్నారు. డబ్బున్నోడు ఖరీదైన వస్తువు కొంటే దానికి తగ్గట్లే పన్ను వాయించేస్తున్నారు. అలాంటప్పుడు మళ్లీ ప్రత్యేకంగా ఆదాయపన్ను అని ప్రత్యేకంగా ఎందుకు వసూలు చేస్తున్నట్లు…..? పోనీ వసూలు చేస్తున్నారు సరే… కానీ ఉద్యోగుల్ని పక్కనపెడితే నిజాయితీగా పన్ను కట్టేది ఎంతమంది…? ఉద్యోగులకంటే జీతభత్యాల లెక్కలు పక్కాగా ఉంటాయి కాబట్టి క్లారిటీ ఉంటుంది. కానీ ఎంతమంది వ్యాపారవేత్తలు పక్కాగా పన్ను చెల్లిస్తున్నారు….? బడా బాబులు ఎంతమంది పక్కాగా ఉన్నారో చెప్పగలరా…?..

మన దేశంలో పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా …? ఖచ్చితంగా లేవు… పన్ను కడుతున్నావు కాబట్టి నీకు వస్తువులు తక్కువ ధరకు ఇస్తున్నారా…? లేదు… అందరికీ ఒకటే ధర… అన్నింటికీ ఒకటే ధర. అదీ జీఎస్టీ కట్టాల్సిందే. పేదవాడికైనా, మధ్య తరగతి వాడికైనా, కోట్లు మూలుగుతున్న వాడికైనా ఒకటే ధర. ప్రజాప్రతినిధులమంటూ ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజల నెత్తికెక్కి… కోట్లకు కోట్లు దండుకునే ఏ రాజకీయ నాయకుడైనా ట్యాక్స్ కడుతున్నాడా…? పోనీ పన్ను కట్టేవారికి ఏమైనా ఉచితంగా వైద్య సౌకర్యం అందుతోందా…? వాళ్ల పిల్లలకు ఏమైనా నాణ్యమైన విద్య ఉచితంగా ఇస్తున్నారా….? గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు… వాటి సొగసు తెలిసిన వారెవరైనా సరే వాటి జోలికి వెళ్లరు కదా…!

ఇక ట్యాక్స్ పేయర్స్ నుంచి వస్తున్న మరో పెద్ద ప్రశ్న… మా డబ్బుతో మాకు సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు వాటిని పప్పుబెల్లాల్లా పంచడమేంటని….? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం రాదు. సమాజంలో అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలన్న లక్ష్యంతో వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకే ఇలా చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకుంటాయి. మంచిదే… కానీ మరి ఆ లక్ష్యం నెరవేరుతోందా…? 60 ఏళ్లుగా ఇలా చేస్తూనే ఉన్నారుగా …? మరి మార్పు వచ్చిందా…? ఈపాటికి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి కదా …? మరి తొలగిపోయాయా…? అంటే జీవితకాలం పన్నులు కడుతూనే ఉండాలి…. ప్రభుత్వాలు వాటిని పేదల కోసం ఖర్చు పెడుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చి తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ ఉంటాయా…?

పన్ను పన్ను పన్ను అంటూ కొందరిని బాదేసి… ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అంటూ మరికొందరికి పంచేస్తే ఏంటి ఉపయోగం… ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పన్ను చెల్లింపుదారులను బాగా వేధిస్తున్న సమస్య ఇదే. నిజానికి పన్నులు వసూలు చేయడంలో తప్పులేదు. వాటితో మౌలిక సదుపాయాలు కల్పించడంలో తప్పు లేదు. నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడంలో తప్పులేదు. కానీ అవేమీ లేకుండా వాటిని ఉచితంగా పంచేయడం ఎంతవరకు కరెక్ట్….? అన్నీ ఉచితాల రూపంలో ఇచ్చేస్తే వారికి శ్రమ విలువ పెరుగుతుందా…? భరోసా ఇవ్వడంలో తప్పులేదు కానీ బద్దకిస్టును చేయడం కరెక్టేనా…? ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం, మంచిరోడ్లు, తాగునీరు, మంచి జీవన ప్రమాణాలు ఇంతకు మించి ఎవరైనా కోరుకుంటారా….? ఉపాధి హామీ పథకంతో రైతు దెబ్బతిన్నాడన్నది వాస్తవం కాదా…? కూలీలు దొరక్క, దొరికినా భారీగా చెల్లించలేక రైతు సతమతమవుతున్నాడు కదా…!

ఇదేదో ప్రభుత్వాన్ని విమర్శించడానికో లేక పన్నులు చెల్లించవద్దని చెప్పడానికో రాస్తున్నది కాదు…. కొంతమంది పన్ను చెల్లింపుదారుల ఆవేదన ఇది. ఇందులో కొన్ని తప్పులుండవచ్చు. కానీ వారి ఆవేదనలో మాత్రం అర్థముంది. ప్రతి ఒక్కరూ మనసుతో ఆలోచించాల్సిన అవసరమూ ఉంది.