Matryoshka Diamond: ఇండియాలో అరుదైన మాత్రియోష్కా వజ్రం లభ్యం.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటంటే!

గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాలు సేకరించే వీడీ గ్లోబల్ సంస్థకు ఇది దొరికింది. ఇది 0.329 కేరట్ల వజ్రం. దీనికి బీటింగ్ హార్ట్ అనే పేరు పెట్టారు కంపెనీ వాళ్లు. ఎందుకంటే ఈ వజ్రాన్ని చూడగానే వాళ‌్లకు అలా గుండె కొట్టుకుంటున్నట్లు అనిపించిందట.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 04:26 PM IST

Matryoshka Diamond: ఇండియాలో ఒకప్పుడు కోహినూర్ వంటి అరుదైన వజ్రాలు ఉండేవి. అలాంటి వజ్రాలు దొరకడం ఇప్పుడు చాలా అరుదు. అయితే, తాజాగా ఇండియాలో అరుదైన వజ్రం లభించింది. దీన్ని మాత్రియోష్కా డైమండ్‌గా పేర్కొంటున్నారు వజ్రాల తయారీకి చెందిన నిపుణులు.

మాత్రియోష్కా వజ్రం అంటే వజ్రం లోపల ఇంకో వజ్రం ఉండటం. ఇది చాలా అరుదు. గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాలు సేకరించే వీడీ గ్లోబల్ సంస్థకు ఇది దొరికింది. ఇది 0.329 కేరట్ల వజ్రం. దీనికి బీటింగ్ హార్ట్ అనే పేరు పెట్టారు కంపెనీ వాళ్లు. ఎందుకంటే ఈ వజ్రాన్ని చూడగానే వాళ‌్లకు అలా గుండె కొట్టుకుంటున్నట్లు అనిపించిందట. జెమ్ అండ్ జువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈ వజ్రాన్ని అరుదైనదిగా గుర్తించింది. దీన్ని మాత్రియోష్కా డైమండ్‌గా పోల్చింది. రష్యాలో ఇలా వజ్రం లోపల వజ్రం ఉండే డైమండ్స్ దొరుకుతుంటాయి. వాటిని మాత్రియోష్కా డైమండ్‌ అని పిలుస్తారు. దీనికో కారణం ఉంది. అక్కడ కలపతో తయారు చేసిన మాత్రియోష్కా అనే బొమ్మలు దొరుకుతాయి.

ఇవి అనేక సైజుల్లో ఉంటాయి. ఒక మాత్రియోష్కా బొమ్మ లోపల మరో బొమ్మను ఉంచొచ్చు. ఇలా చాలా బొమ్మల్ని ఒకదాని లోపల మరోటి దాచి ఉంచొచ్చు. బొమ్మ లోపల బొమ్మ ఉన్నట్లుగానే.. ఇక్కడ వజ్రం లోపల వజ్రం ఉండటం వల్ల వీటిని మాత్రియోష్కా డైమండ్స్ అంటారు. ఇండియాలో ఈ తరహా వజ్రం దొరకడం ఇదే మొదటిసారి. రష్యాతోపాటు సైబీరియాలో మాత్రమే ఈ తరహా వజ్రాలు దొరికాయి. వీటిని తొలిసారి గుర్తించింది 2019లోనే. మన దేశంలో గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. అలాంటి చోట ఇప్పుడు మాత్రియోష్కా డైమండ్ దొరకడం నిపుణుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇది 2022లోనే దొరికింది.

ఇటీవల ఈ వజ్రాన్ని సానబెడుతుండగా, దాని లోపల మరో వజ్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ వజ్రాన్ని మరింతగా పరీక్షించేందుకు బ్రిటన్ పంపారు. వజ్రాల వ్యాపారంలో ముప్పై ఏళ్లుగా ఉన్నానని, ఇలాంటి వజ్రాన్ని చూడటం చాలా అరుదని డీ బీర్స్ కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.