Refurbished Smartphone: దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్లను ఎక్కువగా వాడేస్తున్నారట. రీఫర్బిష్డ్ ఫోన్ల వాడకంలో ప్రపంచంలో ఇండియానే మొదటి స్థానంలో ఉంది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి.
మొత్తంగా ఇండియా ఈ తరహా ఫోన్ల అమ్మకాల్లో 13 శాతం వాటా కలిగి ఉంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఈ ఫోన్ల విక్రయాలు ఐదు శాతం పెరిగాయి. పాత ఫోన్లను లేదా పాడైన ఫోన్లను తిరిగి బాగు చేసి రీఫర్బిష్డ్ ఫోన్లుగా విక్రయిస్తుంటారు. వీటికి కంపెనీలు వారెంటీ కూడా ఇస్తున్నాయి. సర్వీస్ కూడా అందిస్తున్నాయి. పైగా తక్కువ ధరలోనే వస్తుండటంతో వినియోగదారులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు ఇంకా ఎక్కువగా ఉండేవి. గతంలో ఎన్నడూలేనంతగా చైనాలో వీటి విక్రయాలు తగ్గాయి. అందుకే రీఫర్బిష్డ్ ఫోన్ మార్కెట్ వృద్ది కాస్త తగ్గింది.
దేశంలో అమ్ముడవుతున్న రీఫర్బిష్డ్ ఫోన్లలో యాపిల్ వాటానే అత్యధికం. యాపిల్ ఫోన్లు 49 శాతం వాటా కలిగి ఉన్నాయి. యాపిల్ ఫోన్లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని కొనలేరు. అలాంటివాళ్లు సెకండ్ హ్యాండ్‌లో దొరికే రీఫర్బిష్డ్ ఫోన్లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, వీటివల్ల యాపిల్ కొత్త ఫోన్ల అమ్మకాలు దెబ్బతింటున్నాయి. ఎంత ఎక్కువగా రీఫర్బిష్డ్ యాపిల్ ఫోన్లు అమ్ముడవుతున్నా వీటికి ఇంకా డిమాండ్ ఉంది. డిమాండ్‌కు తగ్గట్లు ఐఫోన్లు దొరకడం లేదు. ఐఫోన్ల తర్వాత సామ్‌సంగ్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. 2022లో ఈ ఫోన్ల వాటా 26 శాతం ఉంది. అంతకుముందు ఏడాది వీటి వాటా 28 శాతం ఉంది. యాపిల్, సామ్‌సంగ్ తర్వాత మిగతా ఫోన్ల విక్రయాలున్నాయి. నిజానికి ఈ ఫోన్లకు ఇంకా మంచి డిమాండ్ ఉంది. ఆగ్నేయాసియా, ఇండియా, ఆఫ్రికాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.
ఈ ఫోన్లను ఎక్కువగా అమెరికా, యూరప్, జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ, ఇటీవలి కాలంలో డిమాండ్‌కు అనుగుణంగా సెకండ్ హ్యాండ్ ఫోన్లు దొరకడం లేదు. ప్రజలు వీటివైపు మొగ్గు చూపేందుకు అనేక కారణాలున్నాయి. తక్కువ ధరలోనే వస్తుండటంతోపాటు, వీటికి నాణ్యత గురించి సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు. రీఫర్బిష్డ్ ఫోన్లు వాడుతున్న వాళ్లలో చాలా తక్కువ మంది ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్ వైపు మళ్లుతున్నారు. రీ ఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాల ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగుతుంది.