Rice Export Ban: అక్కడా దోపిడీయే.. బియ్యం కొరతను క్యాష్ చేసుకుంటున్న విదేశీ వ్యాపారులు!

బియ్యం ఎగుమతులపై నిషేధం ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉండటంతో విదేశాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారతీయుల డిమాండ్‌ను గుర్తించిన అక్కడి వ్యాపారులు బియ్యం ధరల్ని విపరీతంగా పెంచేశారు.

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 04:25 PM IST

Rice Export Ban: బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇండియా నుంచి అమెరికా సహా విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఇండియా నుంచి రావాల్సిన బియ్యం రాకపోవడంతో విదేశాల్లో బియ్యం కొరత ఏర్పడింది. దీంతో బియ్యం ఎక్కువగా తినే భారతీయులు.. ముఖ్యంగా దక్షిణాది వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలుగువాళ‌్లు సైత తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

బియ్యం కోసం అమెరికాలో భారతీయులు స్టోర్లకు పరుగులు తీశారు. అక్కడ ఉన్న కొద్దిపాటి స్టాక్ కూడా అయిపోయింది. భారతీయుల డిమాండ్‌ను గుర్తించిన అక్కడి వ్యాపారులు బియ్యం ధరల్ని విపరీతంగా పెంచేశారు. మార్కెట్లో కొరత ఉన్నప్పుడు వాటిని కొంతకాలం దాచి, ఆ తర్వాత ధరలు పెంచి క్యాష్ చేసుకోవడం మన దగ్గర సాధారణంగా జరిగేదే. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను అమెరికా వ్యాపారులు కూడా ఫాలో అవుతున్నారు. బియ్యానికి డిమాండ్ బాగా ఉండటంతో అక్కడి వ్యాపారులు, స్టోర్ నిర్వాహకులు బియ్యం ధరల్ని భారీగా పెంచేశారు. గతంలో 15 డాలర్లకు దొరికే ఒక రైస్ బ్యాగ్‌ను ఇప్పుడు 35-50 డాలర్లకు అమ్ముతున్నట్లు భారతీయులు చెబుతున్నారు. ఎక్కువ ధర అయినా పర్లేదు.. కొందాం అనుకున్నా చాలా చోట్ల దొరకని పరిస్థితి.

అందుబాటులో ఉంటే కొందరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి, స్టోర్ చేస్తున్నారు. కొన్ని స్టోర్స్ మాత్రం ఒక్కరిక ఒకటి లేదా రెండు బ్యాగులు మాత్రమే ఇస్తున్నాయి. మరికొందరు తెలివైన వాళ్లు మాత్రం ముందు జాగ్రత్తగా పదుల సంఖ్యలో బ్యాగులు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఇంకొందరు వాటిని ఆన్‌లైన్‌లో అధిక ధరలకు తిరిగి విక్రయిస్తున్నారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం ఎగుమతులపై నిషేధం ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉండటంతో విదేశాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికాతోపాటు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా సహా ఇతర దేశాల్లో నివసించే భారతీయులకు ఈ విషయంలో కొంతకాలం ఇబ్బంది తప్పేలా లేదు.

అమెరికా సంగతి తెలిసిన ఇతర దేశాల్లోని భారతీయుల కూడా ముందుగానే బియ్యం కొని జాగ్రత్తగా దాచుకుంటున్నారు. దీంతో వేరే దేశాల్లో కూడా భారతీయులు స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. దీన్ని అక్కడి వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.