Indian Techies: టెక్నాలజీయే ఉద్యోగాలను ఊడగొడుతుందా? ఇండియన్ టెక్కీలు ఎందుకు భయపడుతున్నారు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయమని భారతీయ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 01:26 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసిన మన టెక్కీలే కనిపిస్తారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెక్నాలజీ బూమ్‌తో కొన్నేళ్లుగా మనవాళ్లు ఐటీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. బెంగళూరు నుంచి అమెరికా సిలికాన్ వ్యాలీ వరకు ఎక్కడ చూసినా ఇండియన్ టెక్కీల హవానే. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నది కూడా భారతీయులే. అయితే ఏ టెక్నాలజీ ఇండియన్స్ కు విస్తృత అవకాశాలు కల్పించిందో అదే టెక్నాలజీని చూసి భారతీయ టెక్కీలు ఇప్పుడు భయపడుతున్నారు. హైఫై జీతాలు, విదేశాల్లో ఆన్ సైట్ ప్రమోషన్ల వంటి సంగతేమో గానీ.. అసలు టెక్నాలజీయే తమ కొంప కూల్చేస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ తమ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయమని భారతీయ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు. ప్రతి నలుగురు ఇండియన్ టెక్కీల్లో ముగ్గురు ఇదే భయంతో వణికిపోతున్నారు.

టెక్నాలజీతో పాటు పరుగులు పెట్టాల్సిందేనా ?

ఎప్పుడో జమానాలో ఏదో కోర్సు నేర్చుకున్నాను.. దాని ఆధారంగా జీవితాంతం ఉద్యోగం చేస్తానని.. అదొక్కటే నాకు నా కుటుంబానికి తిండిపెడుతుంది అనుకునే రోజులు పోయాయి. ఏఐతో పాటు మిషిన్ లెర్నింగ్ కారణంగా.. వ్యవస్థల స్వరూపమే మారిపోతోంది. మనిషి ఆలోచనలు, మేథస్సుతో సంబంధం లేకుండా చాలా పనులు ఏఐ బాట్స్ చేసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మారుతున్న టెక్నాలజీ వర్క్ ఫోర్సు పై కచ్చితంగా ప్రభావితం చూపిస్తోంది. భారతీయ టెక్కీలు కూడా ఇప్పుడు ఇదే భయంలో ఉన్నారు. తమ స్కిల్స్ ను అప్‌‍డేట్ చేసుకోకపోతే.. ఉన్న ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందంటున్నారు.

భారతీయులు ఏం చెబుతున్నారు ?

దేశవ్యాప్తంగా టైర్ 1, టైర్ 2 సిటీల్లో ఎమిరిటస్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ అనే సంస్థ స్కిల్స్ స్టడీ నిర్వహించింది. 25 ఏళ్ల యువకుల నుంచి రిటైర్మెంట్ ఏజ్‌లో ఉన్న వాళ్ల వరకు అందర్నీ పలకరించింది. మారుతున్న టెక్నాలజీ.. స్కిల్స్ గురించి వాకబు చేసింది. ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు కొత్త టెక్నాలజీ విషయంలో భయంతో ఉన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టు టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే.. ఇక తమ కెరీర్ క్లోజ్ అయినట్టే అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. మాన్‌ఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన నిపుణులు తమ ఉద్యోగాలపై ఆందోళనతో ఉన్నారు. సాఫ్ట్‌వేర్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ లో 93 శాతం మంది, టెక్నాలజీ , ఇన్నోవేషన్ రంగాల్లో 93 శాతం, మాన్‌ఫ్యాక్టరింగ్ సెక్టార్ లో 86 శాతం మంది ఉద్యోగులు కొత్త టెక్నాలజీ టూల్స్ ను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగాలు చేస్తూనే కొత్త కొత్త టెక్నాలజీని ఆకళింపు చేసుకునే పనిలో చాలా మంది ప్రొఫెషనల్స్ తలమునకలై ఉన్నారు.

ఏఐతో పోటీపడకపోతే ఇక అంతే సంగతులు

ప్రపంచంలో ఏ సెక్టార్‌ని తీసుకున్నా.. వాటిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కృత్రిమ మేథస్సు మానవవాళి మనుగడకే సవాల్ విసిరే స్థాయిలో ఎప్పటికే ఎదిగిపోయింది. ఏఐతో ఎంత మేలు ఉందో.. అంతకంటే ఎక్కువ ప్రమాదం కూడా పొంచి ఉంది. చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ వ్యవస్థాకులు ఇప్పటికే ఏఐ చూపించే ప్రతికూల ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆధునిక టెక్నాలజీ వల్ల పొంచి ఉన్న ప్రమాదాల్లో ఉద్యోగాల కోత కూడా ఒకటి. ఈ ఏడాది మల్టీ నేషనల్ కంపెనీలన్నీ లక్షలాది మందికి ఉద్వాసన పలికేశాయి. ఏఐని ఇంటిగ్రేట్ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న టెక్ కంపెనీలు.. అన్ స్కిల్డ్, అప్‌ టు డేట్ లేని ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. అందుకే భారతీయల టెక్కీలు.. స్కిల్స్ పరకంగా తమను తాము అప్‌గ్రేడ్ చేసుకునే పనిలో ఉన్నారు.