అదేం ఖర్మో గానీ వడ్డీరేట్లు పెంచడానికో, తగ్గించకపోవడానికో ఆర్‌బీఐకి ఎప్పుడూ ఏదో ఓ సాకు దొరుకుతుంది. ఈసారి రీటైల్ ద్రవ్యోల్బణం ఊహించని స్థాయిలో తగ్గినా వడ్డీరేట్లు మాత్రం తగ్గేలా లేవు. దీంతో రేట్ల తగ్గుదలపై ఆశలు పెరుగుతుంటే వాటిపై వరుణ దేవుడు నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు.
ఈ వార్త చూడటానికి ఏదో ఎకనమిక్ న్యూస్‌లా కనిపిస్తుంది కానీ ఇది మనందరి బడ్జెట్‌ను ప్రభావితం చేసే వార్తే ఇది. గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచుతూ వస్తోంది. ఇది మన బడ్జెట్‌ను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం చేస్తూనే వస్తోంది. ప్రతిసారీ ఆర్‌బీఐ చెప్పే కారణం ద్రవ్యోల్బణం తగ్గకపోవడమే. అయితే ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. సెంట్రల్ బ్యాంకు పెట్టుకున్న టార్గెట్ కంటే దిగువకు అంటే 4.7శాతానికి పడిపోయింది. 18నెలల కనిష్ఠానికి చేరింది. ఇక జులై 2020 తర్వాత తొలిసారిగా టోకు ద్రవ్యోల్బణం కూడా నెగెటివ్‌కు వెళ్లిపోయింది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం తర్వాత పెరిగిన ఆయిల్, మెటల్, ఆహార ధరలు ఈ ఏడాది తొలి అర్థభాగంలో దిగివస్తున్న సూచనలు ఆశలు పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా స్థిరపడుతున్న పరిస్థితులు కూడా ద్రవ్యోల్బణ కట్టడిపై సంకేతాలు ఇస్తున్నాయి. ఇన్ని మంచి శకునాలు కనిపిస్తున్నా వడ్డీరేట్లు తగ్గకుండా మరో అపశకునం కనిపిస్తోంది. ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం తగ్గిందంటే అందరూ ముందుగా ఆశించేది వడ్డీరేట్లు తగ్గుతాయా అనే.. నిజానికి అది జరగాలి కూడా.. కానీ ఈసారి వరుణదేవుడు అందుకు అడ్డుపడే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.
సాధారణంగా ప్రతిసారీ ద్రవ్య పరపతి విధానం రూపొందించే సమయంలో ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్యంగా ఆహార పదార్ధ ద్రవ్యోల్బణం కీలకం. కానీ ఇది తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుకు కారణం వాతావరణం. ఈసారి వర్షాలు సాధారణంకంటే తక్కువగా ఉంటుందన్న అంచనాలున్నాయి. గత వారం అమెరికా సంస్థలు కూడా ఎల్‌నినో ఏర్పడుతుందని అంచనా వేశాయి. ఫసిపిక్ సముద్రంలో జలాలు వేడెక్కడం ద్వారా ఏర్పడే పరిణామాలు మన దేశంపై పడతాయి. దేశంలో లోటు వర్షపాతం, కరవుకు ఇదే కారణం. 1950 తర్వాత దేశంలో 16సార్లు లోటు వర్షపాతం నమోదైతే అందుకు 13సార్లు ఎల్‌నినోనే కారణం. ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. మే చివర్లో కేరళలో అడుగు పెట్టాల్సిన రుతుపవనాలు ఈసారి జూన్4న కాస్త ఆలస్యంగా రావొచ్చని భావిస్తున్నారు.
ఏప్రిల్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో లోటు వర్షపాతం కారణంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. తాజా పరిణామాలు దాన్ని నిర్థారిస్తున్నాయి. దేశంలో సగటున 75శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారానే నమోదవుతుంది. అయితే వాటివల్ల తక్కువ వర్షపాతం నమోదైతే దాని ప్రభావం పంటలపై పడుతుంది. ఫలితంగా ఉత్పత్తి తగ్గి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది ఆర్‌బీఐ చేతులు కట్టేస్తుంది. సాధారణంగా దేశంలో ప్రధాన పంటలైన వరి, గోధుమలు వర్షపాతంపై ఆధారపడటం కొంత మేర తగ్గింది. అయితే అది పూర్తిగా వర్షాలు పడకపోయినా పర్లేదనే స్థాయిలో మాత్రం కాదు.
ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంటే అది తగ్గుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న వడ్డీరేట్ల కోత ఆశలపై నీళ్లు చల్లినట్లే. రేట్లు తగ్గించాలని ఆర్‌బీఐ భావించినా… ఈ పరిస్థితుల కారణంగా కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. కొన్ని సంస్థలు ఈ జూన్ పాలసీ రివ్యూలో సెంట్రల్ బ్యాంక్ ఎలాంటి వడ్డీరేట్లు పెంచబోదని అలాగని తగ్గించబోదని చెబుతున్నాయి. అయితే వచ్చే ఏడాది రెండో అర్థబాగానికి ఆర్‌బీఐ రెపోరేటు 50బేసిస్ పాయింట్లు తగ్గించొచ్చన్న అంచనాలున్నాయి. ఎల్‌నినో కొనసాగితే మాత్రం అది కూడా డౌటే. సో మొత్తంగా చూస్తే గృహరుణ వినియోగదారులు వడ్డీరేట్ల కోతలపై ఇప్పుడే ఆశలు పెట్టుకోకపోవడం మంచిది.