Apple Event: యాపిల్ ఫ్యాన్స్, టెక్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూసే యాపిల్ యానువల్ ఈవెంట్ మంగళవారం జరగబోతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ సంస్థ నుంచి ఏడాదిలో రాబోయే గాడ్జెట్స్, టెక్నాలజీని ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తారు. అందువల్లే యాపిల్ సంస్థ ఎలాంటి ఉత్పత్తుల్ని తీసుకొస్తుంది.. వీటి ఫీచర్స్, ధరలు వంటి వాటిపై ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మంగళవారం అమెరికాలో వండర్‌లస్ట్ పేరుతో యాపిల్ ఈవెంట్ జరగబోతుంది.
యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో భాగంగా త్వరలో ఐఫోన్ 15 విడుదల కానుంది. ఈ సిరీస్ ఫోన్లతోపాటు యాపిల్ వాచ్, వాచ్ అల్ట్రా మోడల్స్‌ను కంపెనీ లాంఛ్ చేయబోతుంది. అలాగే యాపిల్ ఓఎస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ గురించి కూడా కీలక సమాచారాన్ని సంస్థ వెల్లడిస్తుంది. ప్రధానంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సిరీస్ ఫోన్లను కంపెనీ ఈ ఈవెంట్‌లో విడుదల చేయబోతుంది. యాపిల్ అత్యధికమంది ఎదురుచూసేది వీటి గురించే. యాపిల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈసారి ఫోన్లలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయని ఫ్యాన్స్‌లో ఆసక్తి కనిపిస్తోంది. వివిధ దేశాల నిబంధనల ప్రకారం యాపిల్ సంస్థ తమ సొంతమైన లైటెనింగ్ పోర్ట్ బదులు.. కామన్ చార్జింగ్ పోర్ట్‌తో ఫోన్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే యాపిల్ చార్జింగ్ పోర్టులు భిన్నంగా ఉంటాయి. దీనికోసం ప్రత్యేక చార్జర్, కేబుల్ తప్పనిసరిగా కొనాలి. ఇలా ఒక్కో బ్రాండుకు వేర్వేరు చార్జర్ పోర్టులు ఉండటం వల్ల వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోంది. వారిపై అదనపు భారం పడుతోంది. అందువల్ల తమ దేశాల పరిధిలో గాడ్జెట్స్ అమ్మే ప్రతి కంపెనీ ఒకే రకమైన చార్జింగ్ పోర్ట్‌తో రావాలని గతంలోనే యురోపియన్ యూనియన్ సూచించింది. దీనిప్రకారం కామన్ చార్జర్‌ను యాపిల్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా టైప్-సి పోర్టుతోనే ఈసారి ఐఫోన్లు రాబోతున్నాయి. అలాగే అన్ని ఫోన్లకు ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉండనుంది.
ఈ ఫోన్లతోపాటు యాపిల్ ఐఓఎస్ 17, ఐప్యాడ్ ఓఎస్ 17, మ్యాక్ ఓఎస్ 14, టవీఓఎస్ 17, వాచ్ ఓఎస్ 10, మ్యాక్ ఓఎస్ సోనోమా వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సంబంధించిన అప్‌డేట్లు కూడా ఈవెంట్‌లో ఉంటాయి. యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ సిరీస్ 9 అల్ట్రా కూడా ఐఫోన్లతోపాటే విడుదలయ్యే అవకాశం ఉంది. ఎయిర్ పాడ్స్ ప్రో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కూడా టైప్-సి పోర్టుతోనే విడుదలవుతుంది. వీటితోపాటు మ్యాక్ బుక్, యాపిల్ పాడ్స్ కూడా విడుదలవ్వొచ్చు. ఈ ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లో చూడొచ్చు. యాపిల్ యూట్యూబ్ ఛానెల్‌తోపాటు, యాపిల్.కామ్, యాపిల్ టీవీ+, యాపిల్ డెవలపర్ యాప్స్‌లో ఈవెంట్ లైవ్ చూడొచ్చు.