అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లు పెంచింది. పెంచింది 0.25శాతమే అయినా దాని ఎఫెక్ట్ మనపై ఉండకపోదు… బ్యాంకులు మునిగిపోతున్నా ఫెడ్ మరోసారి రేట్ల పెంపునకే ఎందుకు మొగ్గు చూపింది.. ఇక్కడితో అయినా వడ్డింపుకు విరామం ఇస్తుందా…?
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పావుశాతం ( 0.25జ్%) పెంచింది. అంచనాలను మించి వడ్డీరేట్లు పెరిగే అవకాశముందని ప్రకటించిన ఫెడ్… ఇలా స్వల్పంగా పెంచడానికి కారణం మాత్రం అమెరికా బ్యాంకింగ్ సంక్షోభమే… లేకపోతే ద్రవ్యోల్బణం కట్టడి పేరుతో వడ్డీరేట్లు మరింత పెంచేవారు… ఫెడ్ ఫండ్స్ రేటు 4.75-5శాతానికి చేరింది. త్వరలో మరోసారి రేట్ల పెంపు ఉంటుందని ఆ తర్వాత ఫెడ్ దూకుడుకు బ్రేక్ పడుతుందని అంచనా వేస్తున్నారు.
నిజానికి బ్యాంకింగ్ సంక్షోభంతోనే ఫెడ్ వడ్డీరేట్లపై కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చింది. వడ్డీరేట్ల పెంపుదలే బ్యాంకులను ముంచేశాయి. సింపుల్‌గా, సాంకేతికంగా వెళ్లకుండా అందరికీ అర్థమయ్యేలా మూడు ముక్కల్లో బ్యాంకింగ్ సంక్షోభానికి కారణాన్ని చెప్పుకుందాం. ఏడాది క్రితం వరకు బ్యాంకుల్లో వడ్డీరేట్లు తక్కువ ఉండేవి. గవర్నమెంట్ బాండ్ రేట్లపై ఎక్కువ రాబడి వచ్చేది. దీంతో బ్యాంకులన్నీ గవర్నమెంట్ బాండ్స్‌లోకి నిధులు మళ్లించాయి. ఇప్పుడు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లు.. బాండ్ల కంటే భారీగా పెరిగాయి. దీంతో బ్యాంకులు లబోదిబోమంటున్నాయి. డిపాజిటర్లకేమో కొత్త వడ్డీ కట్టాలి. తమకు బాండ్స్‌పై వచ్చేది తక్కువ. ఇదే బ్యాంకుల కొంపముంచింది. 2022 ఫిబ్రవరిలో ఫండ్స్ రేటు 0-0.25శాతమే… ఇప్పుడది దాదాపు 5శాతానికి చేరింది. అంటే ఏ స్థాయిలో వడ్డీరేట్లు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు మన మార్కెట్లపై కూడా ఒత్తిళ్లు పెంచుతోంది. అక్కడ రేట్లు పెరగడంతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లకు దూరమవుతున్నారు.
సరే అక్కడ పెరిగాయి మన సంగతేంటి అంటారా.. ! ఆర్‌బీఐ కూడా వడ్డీరేట్లు పెంచే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్పంగా అయినా సరే వడ్డించక మానేలా లేదు. ఇటీవల అలాంటి సంకేతాలే ఇచ్చింది. దీంతో మరోసారి ఈఎంఐలు ఎక్కడ పెరుగుతాయో అని జనం వణికిపోతున్నారు. ఏడాది క్రితం వరకు 6.5-7శాతం వరకు ఉన్న గృహరుణ వడ్డీరేట్లు ఇప్పుడు దాదాపు 10శాతానికి చేరాయి. తక్కువ వడ్డీ ఉన్న సమయంలో అప్పు తీసుకుని ఇల్లు సమకూర్చుకున్న వారు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.
మన రిజర్వ్‌బ్యాంక్ కొన్ని విషయాల్లో ఫెడ్‌నే ఫాలో అవుతోంది. ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్లు పెంచడాన్నే మార్గంగా ఎంచుకుంది. ఫెడ్ ఏడాది కాలంలో దాదాపు నాలుగున్నర నుంచి ఐదు శాతానికి పెంచితే మన దగ్గర కూడా రెండు శాతానికి పైగా పెరిగింది. 2022మే వరకు రెపోరేటు 4శాతం ఉండేది. ఇప్పుడది 6.25శాతానికి చేరింది. ఆర్‌బీఐ రెపోరేటు పెంచగానే బ్యాంకులు రోజుల వ్యవధిలోనే గృహరుణ వినియోగదారులను బాదేస్తున్నాయి. ఇటీవలి రిజర్వ్‌బ్యాంక్ రిపోర్ట్ ఎంతోకొంత వడ్డీరేట్లు పెంచక తప్పదన్న సంకేతాలు ఇచ్చింది. ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉందని ప్రకటించింది. దీంతో త్వరలో మరోసారి వడ్డింపు ఉండొచ్చు. అయితే అది ఫెడ్‌లా స్వల్పంగా పెంచుతుందా లేక భారీగానే వడ్డిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
ఫెడ్ ఈ ఏడాది మరోసారి వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తే రేట్లకోతపై ఆలోచిస్తామని తెలిపింది. మన దగ్గర కూడా అదే పరిస్థితి ఉండొచ్చు… ఆ లెక్కన చూస్తే మరో ఒకటి రెండుసార్లు వడ్డీరేట్లు పెరుగుతాయి. ఆ తర్వాత అక్కడే ఆగొచ్చు లేదా తగ్గొచ్చు… కాబట్టి ప్రస్తుతానికైతే మరోసారి ఐఎంఐ వడ్డింపుకు సిద్ధం కండి.