Jio AirFiber: టెక్ ప్రియులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న జియో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పుణె, కోల్‌కతా, చెన్నై నగరాల్లో మాత్రమే జియో ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. గత నెలలో జరిగిన రిలయన్స్ 46వ వార్షిక సమావేశంలోనే జియో ఎయిర్ ఫైబర్‌పై ప్రకటన చేశారు. వినాయకచవితి నుంచి ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించినట్లుగానే సోమవారం నుంచి సర్వీసెస్ ప్రారంభమయ్యాయి.
ఎయిర్ ఫైబర్ అంటే
జియో తీసుకొచ్చిన ఎయిర్ ఫైబర్.. వైర్‌లెస్ 5జీ వైఫై సర్వీస్. వైఫై అందించే బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ గురించి తెలిసిందే. ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ఇండ్లు, ఆఫీసులకు వైఫై అందుతుంది. అయితే, జియో ఎయిర్ ఫైబర్ ద్వారా వైర్లు, కేబుల్స్‌తో పని లేకుండా వైఫై సౌకర్యం అందుతుంది. జియో ఎయిర్ ఫైబర్ డివైజ్.. దగ్గర్లోని సెల్ టవర్ నుంచి ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా సిగ్నల్స్ అందుకుని ఇంటర్నెట్ అందిస్తుంది. అంటే ఇదొక వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్. ఇది బ్రాడ్‌బ్యాండ్ కంటే వేగంగా ఇంటర్నెట్ అందించగలదు. దీని ద్వారా ఇండ్లు, ఆఫీసుల్లోని ఎన్ని డివైజులకైనా కనెక్ట్ చేసుకోవచ్చు. జియో ఫైబర్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తే.. జియో ఎయిర్ ఫైబర్ కేబుల్స్ లేకుండానే ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుంది. దీని ద్వారా కేబుల్స్ కట్ అవ్వడం వంటి సమస్యలుండవు.
ఫీచర్లు, ప్లాన్లు ఇవే..
జియో ఎయిర్ ఫైబర్ గరిష్టంగా 1జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందిస్తుంది. అలాగే వైఫై 6 సపోర్ట్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను కూడా అందిస్తుంది. సెక్యూరిటీ ఫైర్‌వాల్ కూడా ఉంది. జియో ఎయిర్ ఫైబర్ యాప్ ద్వారా ఈ సర్వీసెస్‌ను యాక్సెస్ చేయొచ్చు. యాప్ నుంచే వెబ్‌సైట్లను బ్లాక్, అన్‌బ్లాక్ చేయొచ్చు. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ కూడా చాలా సులభం. టెక్నీషియన్స్ అవసరం కూడా ఉండదు. డివైజ్ తెచ్చుకుని, ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఇంటర్నెట్ పొందొచ్చు. పవర్ ఉంటే చాలు.. ఇంటర్నెట్ ఉన్నట్లే. జియో ఎయిర్ ఫైబర్ మరియు జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ పేరుతో రెండు ప్లాన్‌లను కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.399 నుంచి 30 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుతుంది. రూ.599 ప్లాన్‌తో ఓటీటీ 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా అందుతాయి. రూ.899, రూ.1,199, రూ.1,499, రూ.2,499, రూ.3,999తో ప్లాన్స్ ఉన్నాయి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ వంటి ఓటీటీ యాప్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. మొత్తం 550 కంటే ఎక్కువ డిజిటల్ ఛానెల్‌లు, 14 ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లను కస్టమర్లు పొందుతారు.
జియో ఎయిర్ ఫైబర్ సేవల కోసం ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా www.jio.comని సందర్శించడం ద్వారా బుకింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. జియో ఎయిర్ ఫైబర్‌ను జియో స్టోర్స్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.