Jio IPL Business: జియో ఐపీఎల్ బిజినెస్ ప్లాన్ అదుర్స్..!

వ్యాపారం తెలివిగా ఎలా చేయాలి అంటే ముకేశ్ అంబానీనే అడగాలి... ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు... ప్రతి అడుగులోనూ అవకాశాన్ని చూస్తారు... ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల విషయంలోనూ జియో బిగ్ బిజినెస్ కోసం ప్లాన్ చేసింది. ప్రత్యక్ష ప్రసారాలు ఫ్రీ ఫ్రీ అంటోంది. కానీ ఆ ఫ్రీ వెనక బిగ్ బిజినెస్ ప్లాన్ ఉంది.

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 12:00 PM IST

వ్యాపారం తెలివిగా ఎలా చేయాలి అంటే ముకేశ్ అంబానీనే అడగాలి… ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు… ప్రతి అడుగులోనూ అవకాశాన్ని చూస్తారు… ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల విషయంలోనూ జియో బిగ్ బిజినెస్ కోసం ప్లాన్ చేసింది. ప్రత్యక్ష ప్రసారాలు ఫ్రీ ఫ్రీ అంటోంది. కానీ ఆ ఫ్రీ వెనక బిగ్ బిజినెస్ ప్లాన్ ఉంది.

గతంలో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారాలు జరిగేవి. ఈసారి హాట్‌స్టార్‌తో పాటు జియో సినిమాలో కూడా మ్యాచ్‌లు లైవ్ వస్తాయి. తమ కస్టమర్లకు ఫ్రీ అంటోంది జియో. ఏ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు… నేరుగా చూసేయండి అంటోంది. కానీ ఇక్కడ జియో తెలివిగా వ్యవహరించింది. ఇప్పటికే దేశం నలుమూలలకు చేరిన జియోకు ఇది మరింత ప్రమోషన్ అవకాశమే కాదు వ్యాపారాన్ని మరింత పెంచుకునే వ్యూహం కూడా… జియో సినిమాలో ఫ్రీగా మ్యాచ్ చూడాలంటే కచ్చితంగా జియో కస్టమర్లు అయి ఉండాలి. ప్రస్తుతమున్న వారితో పాటు కొత్తగా కూడా కొంతమంది జియోకు మళ్లే అవకాశం ఉంది. అలా వచ్చిన వారిని జియో నిలబెట్టుకుంటే చాలు. అది ఓ వ్యాపార అవకాశం.

ఇక ఫ్రీగా చూడండి అన్న ఆఫర్ బాగానే ఉంది. కానీ చూడాలంటే డేటా ఊరికే రాదు కదా… రోజువారీ డేటాతో కాసేపు చూడొచ్చు కానీ మొత్తం మ్యాచ్ చూడలేం. అలా చూడాలంటే ఉన్న ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి లేదా కొత్తగా డేటా కొనుక్కోవాలి. ప్రస్తుతం డేటా రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. ఓ మ్యాచ్ చూడాలంటే ఎంత డేటా కావాలో తెలుసా… తక్కువ రిజల్యూషన్‌లో అయినా కనీసం 2జీబీ కావాలి. 4కే రిజల్యూషన్‌లో ఒక మ్యాచ్ చూడాలంటే 25జీబీ అవసరం… అదే ఫుల్ హెచ్‌డీలో చూడాలంటే 12జీబీ.. , తక్కువలో తక్కువగా ఓ మ్యాచ్ చూడాలంటే 2జీబీ డేటా కావాలి. ఒక్క జీబీ డేటా కోసం ప్లాన్‌ను బట్టి రూ.10 నుంచి రూ.14 వరకు పెట్టాల్సి ఉంటుంది. ఆ రకంగా కనీసం పది మ్యాచ్‌లు జియో సినిమాలో చూడాలన్నా అదనంగా రూ.150 వరకు డేటా తీసుకోవాలి. ఈ లెక్కన కొన్ని లక్షల మంది కస్టమర్లు ఇలా అదనపు డేటా తీసుకుంటే ఎంత బిజినెస్ జరుగుతుందో ఊహించండి… ప్రతి ఒక్కరూ డేటా అదనంగా తీసుకోవాల్సిన పనిలేదు. కొంతమంది తీసుకుంటే చాలు.

హాట్ స్టార్ వినియోగించినప్పుడు కూడా డేటా వినియోగం ఉంటుంది. అయితే దానికి ఆపరేటర్‌తో సంబంధం లేదు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇలా ఆపరేటర్ ఎవరైనా ఓకే. కానీ జియో సినిమాలో ఫ్రీగా మ్యాచ్ చూడాలంటే ఆ డేటా జియోదే అయ్యిండాలి. అంటే ఏ స్థాయిలో డేటా వినియోగం జరుగుతుందో, జియోకు ఎంత లాభమో ఊహించండి…

అవకాశాలను అందిపుచ్చుకోవడం మంచి వ్యాపారి లక్షణం… ప్రతి అడుగు వెనక వ్యూహం ఉండాలి. అవకాశం లేకపోతే సృష్టించుకోవాలి. వ్యూహం లేకపోతే బిజినెస్‌లో భవిష్యత్ ఉండదన్నది అందరికీ తెలిసిందే. దాన్ని నరనరానా జీర్ణించుకున్నారు ముఖేష్ అంబానీ… అందుకే వొడా, ఎయిర్‌టెల్ వంటి బడా సంస్థలను అతి స్వల్పకాలంలోనే వెనక్కునెట్టి దేశంలోనే నెంబర్-1 ఆపరేటర్‌గా జియోను నిలబెట్టగలిగారు. ఇప్పుడు అది మరింతగా పాతుకుపోయేలా న్యూఏజ్ టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఐపీఎల్ రూపంలో కొత్త అవకాశం దొరికింది. దాన్ని తెలివిగా వాడుకుంటున్నారు.