JioCinema: యూజర్లకు షాకిచ్చిన జియో సినిమా.. వార్షిక ప్రీమియమ్ ప్లాన్ ధర ఎంతంటే!

సాధారణ కంటెంట్ ఉండటం వల్ల ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయిన జియో సినిమా ఇప్పుడు అద్భుత కంటెంట్ రెడీ చేస్తోంది. కొత్త కంటెంట్‌తో ప్రీమియమ్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. అయితే, ధరతో మాత్రం యూజర్లకు షాకిచ్చింది. ఏడాది ప్రీమియమ్ ధర ఏకంగా రూ.999గా నిర్ణయించింది.

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 05:19 PM IST

JioCinema: అనుకున్నట్లుగానే జియో సినిమా సరికొత్త కంటెంట్‌తో రెడీ అవుతోంది. ఇప్పటివరకు సాధారణ కంటెంట్ ఉండటం వల్ల ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయిన జియో సినిమా ఇప్పుడు అద్భుత కంటెంట్ రెడీ చేస్తోంది. కొత్త కంటెంట్‌తో ప్రీమియమ్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. అయితే, ధరతో మాత్రం యూజర్లకు షాకిచ్చింది. ఏడాది ప్రీమియమ్ ధర ఏకంగా రూ.999గా నిర్ణయించింది. ఇది ఒక రకంగా షాకే. ఎందుకంటే జియో సినిమా ప్రారంభంలో తక్కువ ధరతో అందుబాటులోకి వస్తుందని చాలా మంది భావించారు. దీనికి కారణం ఉంది.

జియో నెట్‌వర్క్ మొదట ప్రారంభమైనప్పుడు ఉచితంగా మొబైల్ కాల్స్, డేటా అందించిన సంగతి తెలిసిందే. యూజర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో అప్పట్లో కంపెనీ ఇలా చేసింది. తాజాగా రిలయన్స్ నుంచి వచ్చిన క్యాంపా కోలా డ్రింక్ కూడా చాలా తక్కువ ధరకే అందిస్తోంది. మార్కెట్లో ఉన్న ఇతర డ్రింక్స్ కంటే తక్కువగానే ఈ డ్రింక్స్ ధరలున్నాయి. ఇతర కంపెనీలకు పోటీ ఇవ్వడంతోపాటు, వినియోగదారుల్ని ఆకట్టుకునే లక్ష్యంతో ఇలా చేస్తుంటుంది రిలయన్స్. ఈ లెక్కన జియో సినిమా కూడా కొంత కాలం వరకు తక్కువ ధరలోనే వస్తుందని అనుకున్నప్పటికీ, రూ.999గా ధర నిర్ణయించడం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఇదే ధరతో సర్వీస్ అందిస్తున్నాయి. అలాంటిది రిలయన్స్ కూడా ఎక్కువ ధరతో ప్రీమియమ్ సర్వీస్ ఇవ్వడం షాక్ కలిగిస్తోందంటున్నారు నెటిజన్లు. పైగా ఇప్పటికైతే అందులో అంత గొప్ప కంటెంట్ అయితే ఏమీ లేదు. కానీ, తాజాగా హెచ్‌బీవో, వార్నర్స్ బ్రదర్స్ సంస్థలకు చెందిన హాలీవుడ్ కంటెంట్ మాత్రం అందుబాటులోకి తెచ్చింది.

ఈ సినిమాల్ని ఇష్టపడేవాళ్లు ఈజీగా జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అయితే, డబ్బింగ్ కంటెంట్ ఎంతవరకు అందుబాటులో ఉందో చూడాలి. కానీ, త్వరలో మరింత డబ్బింగ్ కంటెంట్ తీసుకొచ్చేందుకు జియో సినిమా ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ భాషల్లో సినిమాలు, సిరీస్‌లు అందుబాటులోకి తేవాలనుకుంటోంది. అప్పుడే అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. ఇక రూ.999 ప్లాన్‌తో ఒకేసారి నాలుగు డివైజ్‌లపై కంటెంట్ చూడొచ్చు. అది కూడా హై క్వాలిటీ వీడియో, ఆడియోతో.. అని చెబుతోంది సంస్థ. ఈ నెలలో ఐపీఎల్ ముగియనున్న నేపథ్యంలో ఆలోపు బోలెడంత కంటెంట్ జియో సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తోంది. ప్రాంతీయ భాషా చిత్రాల్ని కూడా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం జియో సినిమాలో హెచ్‌బీవో, వార్నర్స్ బ్రదర్స్ సంస్థలకు చెందిన గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌజ్ ఆఫ్ ది డ్రాగన్, బ్యాట్‌మ్యాన్ బిగిన్స్, చెర్నోబిల్, విన్నింగ్ టైమ్ వంటి కంటెంట్ రెడీగా ఉంది.

మొన్నటివరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉన్న కంటెంట్ ఇప్పుడు జియో సినిమాలో కనిపిస్తోంది. ప్రస్తుతానికి వార్షిక ప్లాన్ మాత్రమే తీసుకొచ్చినప్పటికీ త్వరలో నెలవారీ ప్లాన్లతోపాటు, త్రైమాసిక ప్లాన్లు, మొబైల్ ప్లాన్లు కూడా తీసుకొచ్చే పనిలో ఉంది. మరి జియో సినిమా ఇతర ఓటీటీలకు ఏమేరకు పోటీనిస్తుందో.. ఇది ఎంతవరకు వినియోగదారుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.