Mukesh Ambani: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే వారసులను తీర్చిదిద్దాలి. తమ అనుభవాన్ని నవతరానికి నూరిపోసి.. నవతరం ఆలోచనలతో ఉవ్విళ్లూరుతున్న వారి ఉడుకు రక్తానికి పరుగులు నేర్పితే తర్వాతి తరంలో దిగ్గజాలు తయారవడం గ్యారెంటీ. ఇప్పుడు దీన్నే ఫాలో అయిపోతున్నారు ముఖేష్ అంబానీ. తన వారసులను నెక్స్ట్ జన్ నేతలుగా తీర్చిదిద్దుతున్నారు.
యంగ్ రిలయన్స్
దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి సరికొత్త రక్తం వస్తోంది. వ్యాపార విస్తరణలో సరికొత్త ఎత్తులకు చేరుతున్న అంబానీ వారసులు ఇప్పుడు రిలయన్స్ బోర్డులోకి ఎంటర్ అయ్యారు. ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా బోర్డులోకి తీసుకున్నారు ముఖేష్ అంబానీ. వ్యాపార మహావృక్షం మరింతగా ఎదిగేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు రిలయన్స్ అధినేత.
వారసులకు పట్టం
వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాదు.. దాన్ని కాపాడుకోవడమూ కష్టమే. రాకెట్‌లా దూసుకుపోయిన ఎన్నో సంస్థలు వారసులు సరిగా లేకపోవడంతో కుప్పకూలిన సందర్భాలు కోకొల్లలు. ఒక చిన్న తప్పు, ముందుచూపులేని నిర్ణయం మొత్తం తల్లకిందులు చేస్తుంది. దీనికి వేరే ఉదాహరణలు అవసరం లేదు. ఆ కుటుంబంలోనే అనిల్ అంబానీ పరిస్థితేంటో అందరికీ తెలిసిందే. అందుకే తాను వయసులో ఉన్నప్పుడే పిల్లలకు బాధ్యతలు అప్పగించి, వారి తప్పులను సరిదిద్దుతూ, రాటుదేలేలా చేస్తున్నారు ముఖేష్ అంబానీ. చేయి పట్టుకుని నడిపించడం కాకుండా వారు తప్పులు చేసి, ఎదురు దెబ్బలు తిని, దాన్నుంచే నేర్చుకునేలా చేస్తున్నారు. వారు తప్పులు చేసినా దాన్ని సరిదిద్దగలిగే ఓపిక తనలో ఉన్నప్పుడే పిల్లలను సమర్ధులుగా చేయాలని చూస్తున్నారు. ఎవరి సామర్ధ్యానికి తగినట్లుగా వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఏజీఎంలో కీలక నిర్ణయాలు
రిలయన్స్ ఏజీఎంలో ముఖేష్ అంబానీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన భార్య నీతా అంబానీని రిలయన్స్ బోర్డు నుంచి తప్పించారు. ఆవిడ రిలయన్స్ ఫౌండేషన్ బాధ్యతలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇక తన ముగ్గురు పిల్లలు ఇషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు బోర్డు డైరెక్టర్లందరూ ఆమోదం తెలిపినట్లు నియంత్రణ సంస్థలకు తెలిపింది రిలయన్స్ ఇండస్ట్రీస్. తను మరో ఐదేళ్లపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతానన్నారు ముఖేష్ అంబానీ. 2021నుంచే ఇలా నాయకత్వ బదిలీపై ఫోకస్ పెట్టారు రిలయన్స్ అధినేత. అప్పట్నుంచే ఒక్కొక్కటిగా తన బాధ్యతలు వారసులకు అప్పగిస్తూ వస్తున్నారు. దానికి కొనసాగింపే ఈ ముగ్గురినీ రిలయన్స్ బోర్డులో చేర్చడం.
1977లో రిలయన్స్ బోర్డులో చేరారు ముఖేష్ అంబానీ. తన తండ్రి ధీరూబాయ్ అంబానీకి చేదోడువాదోడుగా నిలిచారు. తండ్రి నాయకత్వంలోనే రాటుదేలారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. కింద నుంచి అన్నీ తెలిసుండటంతో ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉందో.. దాన్నెలా ఎదుర్కోవాలో.. తెలుసుకున్నారు. అనిల్ అలా చేయలేదు. ముఖేష్ లోతుల్లోకి వెళితే, అనిల్ పైపై వ్యవహారాలు నడిపారు. దీంతో ఆయన వ్యాపారంలో దెబ్బతిన్నారు. ముఖేష్ నిలబడిపోయారు. తన పిల్లలను కూడా అలాగే తీర్చి దిద్దాలన్నది ముఖేష్ ఆలోచన.
ఇషా అంబానీ
ఇషా.. ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు, పిరామల్ కుటుంబ కోడలు మాత్రమే కాదు. తెలివైన వ్యాపారవేత్త కూడా. నవతరం ఆలోచనలతో తమ సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారు. యేల్ యూనివర్శిటీలో చదివారు ఇషా అంబానీ. 45వ ఏజీఎంలో రిలయన్స్ రిటైల్ బిజినెస్ హెడ్‌గా నియమించారు. జులైలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో నాన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్‌గా ప్రమోట్ చేశారు కూడా. రిలయన్స్ రిటైల్ సరికొత్త పుంతలు తొక్కడానికి కారణం ఇషానే. తర్వాతి తరం సూపర్‌స్టార్స్ 100 పేరుతో టైమ్స్ రూపొందించిన జాబితాలో ఇషాకు చోటు దక్కింది. 2023 ఫోర్బ్స్ ఇండియా జెన్ నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యుర్ అవార్డును గెలుచుకున్నారు.
ఆకాష్ అంబానీ
ముఖేష్ అంబానీ పెద్దకుమారుడు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ సంపాదించారు. గతేడాది జులైలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా నియమించారు. జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు సభ్యుడు కూడా. 5జీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైనా వంటి న్యూఏజ్ టెక్నాలజీలను రిలయన్స్ అందిపుచ్చుకోవడం వెనుక కీలక పాత్ర ఆకాష్ అంబానీదే. 2016లో జియో లాంచైన ఆరునెలలలోపే పదికోట్ల సబ్‌స్క్రైబర్ల మార్కును అందుకుందంటే అందుకు ఆకాష్ నాయకత్వమే కారణం. ప్రస్తుతం జియోకు 45 కోట్ల కస్టమర్లున్నారు. 2014 నుంచి రిలయన్స్ రిటైల్ బోర్డులో ఉన్నారు ఆకాష్ అంబానీ. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వ్యవహారాలు కూడా చూస్తుంటారు. ఇషాలాగానే ఆకాష్ కూడా టైమ్స్ మేగజైన్ టైమ్ 100 నెక్స్ట్ లిస్టులో చోటు సంపాదించారు. ఫార్చ్యూన్ 40 అండర్-40 బిజినెస్ లీడర్స్ జాబితాలోనూ దక్కించుకున్నారు.
అనంత్ అంబానీ
ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు. అనంత్ అంబానీలాగా బ్రౌన్ యూనివర్శిటీ నుంచే డిగ్రీ పొందాడు. 2020 జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నాడు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ సోలార్ ఎనర్జీ బోర్డులోనూ ఉన్నారు. కంపెనీ ఆయువుపట్టు ఇంధనరంగం విస్తరణ బాధ్యతలు చూస్తున్నారు. పునరుత్పాదక, గ్రీన్ ఎనర్జీ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. అతని నాయకత్వంలోనే రిలయన్స్ 2035 నాటికి జీరోకార్బన్ కంపెనీగా అవతరించాలని టార్గెట్ పెట్టుకుంది.