Entertainment At 1 Rupee: ఒక్క రూపాయికే వినోదం వెనుక అసలైన వ్యూహం ఇదేనా..!?

ఒకప్పుడు సినిమా థియేటర్లోకి వెళ్లి చూడాలంటే రూ.200 ఉంటే సరిపోయేది. కుటుంబంలోని నలుగురు సభ్యులు కలిసి వినోదాన్ని ఆస్వాధించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏదైనా చిత్రాన్ని కుటుంబ సమేతంగా వెళ్లి తెరపై చూడాలంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఈ డబ్బుతో నెలలో ఒకవారం తిండి జరిగిపోతుందన్నమాట. అలాంటి వినోదం ఇప్పుడు అరగంట పాటూ ఒక్క రూపాయికే అందిస్తే చాలా ఆనందంగా వెళ్లి చూసేస్తారు. అందుకే ఒక్క రూపాయికే వినోదాన్ని అందించేందుకు పివిఆర్ సంస్థ నడుం బిగించింది.

  • Written By:
  • Publish Date - April 23, 2023 / 04:01 PM IST

సినిమా అనగానే ప్రతిఒక్కరికీ గుర్తుకు వచ్చే అంశం వినోదం. ఆ వినోదం సామాన్యునికి అందని ద్రాక్షగా మారిపోయిందన్న నానుడి దశాబ్దకాలం నుంచి బలంగా వినిపిస్తుంది. దీనికి కారణం మల్టీ ప్లెక్స్ థియేటర్స్ ఎరా రావడం. అక్కడి మెయింటినెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ సిస్టం కోసం తెగ ఎగబడిపోతూ ఉంటారు. అందుకే కాస్త ధర ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు పరిస్థితి చాలా అసాధారణంగా మారిపోయింది. అదే ఒక్క రూపాయికి అరగంట వినోదం. అదేంటి ఒక్క రూపాయికి చాక్లెట్ తప్ప ఏమీ రాని రోజులు ఇవి. కానీ మల్టీప్లెక్స్ హాల్లో సినిమా చూడటమా అని మీలో సందేహం కలుగవచ్చు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

ఒక్క రూపాయికే వినోదం..

హైదరాబాద్ మొదలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ విరివిగా విస్తరించాయి. అందులో అరగంట పాటు భవిష్యత్తులో వచ్చే సినిమాల ట్రైలర్స్, టీజర్స్ ను వేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సరికొత్త పరంపరకు తెర తీసింది. సాధారణంగా ప్రేక్షకుడు తన స్మార్ట్ ఫోన్ లేదా టీవీల్లో ట్రైలర్, టీజర్ చూస్తూ ఉంటారు. అలా కాకుండా సినిమా హాల్లో చూస్తే ఈ థ్రిల్లే వేరే లెవెల్లో ఉంటుంది. ఫోన్ లో చూసే క్వాలిటీకి పెద్ద స్క్రీన్ మీద చూసే ఫీలింగ్ కి వ్యత్యాసం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.

ఇక్కడకు వచ్చి ప్రేక్షకుడు సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను సినిమా విడుదల కంటే ముందుగానే డిజిటల్ డాల్బీ సౌండింగ్ లో చూసి సంబరపడతాడు. పైగా వేసవి కాలం వచ్చేసింది. ఒక అరగంట థియేటరల్లో ఏసీలో గడిపేద్దాం అనే ఆలోచనతో కూడా వెళ్లవచ్చు. సౌకర్యవంతంగా దర్జాగా పెద్ద తెరపై సన్నివేశాలను చూస్తుంటే అరచేతిలోని స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టక తప్పదు. ఇలా అలవాటు పడ్డవారు ఇక స్మార్ట్ ఫోన్లో ట్రైలర్, పాటలు చూడాలన్నా వినాలన్నా ఇష్టపడని పరిస్థితికి వెళ్లిపోతాడు. పైగా ఇతను వెచ్చించింది పెద్దగా ఏమీ లేదు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే. కాబట్టి వినోదం మరింత చౌక అని చెప్పాలి.

తెర వెనుక వ్యూహ‌ం..

గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా సినిమా థియేటల్లకు జనాలు పెద్దగా వచ్చి సినిమాలు చూడటం లేదు. దీనికి కారణం కరోనా. అప్పట్లో ఏర్పాటు చేసిన సోషల్ డిస్టెన్స్, సింగల్ సీట్ గ్యాప్ తో సినిమా చూడటం, అడుగడుగునా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అన్నీ కలిసి సినిమా చూసేందుకు వచ్చే వారికి కాస్త అసౌకర్యాన్ని కలిగించాయి. సరదాగా గడిపేందుకు సినిమాకు వస్తే ఇన్ని నియమ నిబంధనలా అంటూ ప్రేక్షకుడు చికాకుకు గురయ్యే వాడు. దీంతో ఫ్యామిలీ ప్రేక్షకులు దాదాపు థియేటర్లకు వచ్చి చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Home Theater

ఇక రెండో కారణం విషయం ఇంట్లోనే చూసేందుకు మక్కువ చూపించడం. డిజిటలైజేషన్ లో భాగంగా కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో హోం థియేటర్లు, 48 ఇంచులు లేదా అంతకు మించిన కర్వ్ టీవీలు ఉన్నాయి. నీటి ప్రవాహానికి దారి గీసినట్లుగా ఈ ఎలక్ట్రానికి డివైస్ లకు ఓటీటీ వేదికలు ఊతం ఇచ్చాయి. ఇక చెప్పేదేముంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, బాలాజీ, హాట్ స్టార్, హెచ్ బీ ఓ, పారామౌంట్ ప్లస్, ఆపిల్ టీవీ వంటి మాథ్యమాలు సరికొత్తగా థియేటర్లలో విడుదలైన సినిమాలను నెల తిరగకుండానే తమ ఛానెళ్లలో ప్రసారం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

దీంతో ప్రేక్షకుడి గుమ్మంలోకి పాలు, నిత్యావసరాలు వచ్చినట్లు టీవీ ఉన్న రూంలోకి వినోదం వచ్చేసింది. అందరూ వీటికి అలవాటు పడ్డారు. ఇలా అయితే భవిష్యత్తులో సినిమా హాళ్లకు పెద్ద ఎత్తులో నష్టం తప్పదని అంచనా వేసిన మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఇలా ఒక్క రూపాయికే వినోదం పేరుతో బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఎందుకంటే హాలులో ట్రైలర్ చూసిన సామాన్యుడు సినిమాను కూడా అంతే లెవెల్లో చూసి మంచి అనుభూతిని పొందాలనుకుంటాడన్న వ్యూహంతో ఇలా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఇది ఏస్థాయిలో విజయవంతం అవుతుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదు.

ఏది ఏమైనా ఒక్క విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోక తప్పదు. మన దేశంలో నివసించే పౌరులు దేనిని అంత తేలిగ్గా తీసుకోరు. ఒక సారి తీసుకుంటే దానిని అంత త్వరగా విడిచి పెట్టరు. కోవిడ్ సమయంలో ఇంట్లోనే ఉండండి.. ఏపని అయినా సరే ఇంటి నుంచే చేయండి అంటే వినిపించుకోలేదు. బయటకు వెళ్లే చేస్తాం అన్నారు. ఎందుకంటే బయట తిరిగిన కాలు ఒక చోట కుదురుగా కూర్చోదు. అలాగే ఇప్పుడు ఆఫీసులకు వచ్చి పనిచేయండి అంటే లేదు ఇంట్లో నుంచే చేస్తాం అంటూ వర్క్ ఫ్రం హోం కావాలని అంటున్నారు. దీనికి కారణం చాలా కాలంగా అతి కష్టంమీద అలవరచుకున్న వాతావరణం. ఈ సినిమా కూడా అంతే ఇంటి థియేటర్లలో అలవాటు పడ్డ వారు రియల్ థియేటర్లలోకి వస్తారా అంటే ఏమో చెప్పలేం. అంత సులువు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

 

T.V.SRIKAR,