TRAI New Rules: స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లతో సతమతమవుతున్న మొబైల్ ఫోన్ యూజర్లకు ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఉపశమనం కలిగించనుంది. వీటిని అరికట్టేలా మే 1 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి కాల్స్, మెసేజెస్ నిరోధించడానికి ఇకపై ఏఐ ఫిల్టర్ టెక్నాలజీని టెలికాం సంస్థలు తప్పనిసరిగా వాడాలని ట్రాయ్ గతంలో సూచించింది. దీంతో తమ నెట్‌వర్క్‌లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తామని జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలు ప్రకటించాయి. ట్రాయ్ ఆదేశాల ప్రకారం మే 1, సోమవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
అనవసరమైన కాల్స్, మెసేజెస్ మొబైల్ వినియోగదారుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నకిలీ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల వల్ల వినియోగదారులు చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు వీటి ఆధారంగా దోపిడీకి పాల్పడుతున్నారు. యూజర్లను నమ్మించి వేలు, లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడం కూడా కష్టమవుతోంది. అందుకే కొంతకాలంగా ఈ అంశంపై ట్రాయ్ సీరియస్‌గా దృష్టి పెట్టింది. వీటిని నిరోధించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ కాల్స్, మెసేజెస్ అరికట్టే ఏఐ ఫిల్టర్ టెక్నాలజీ వాడాల్సిందిగా కంపెనీలకు సూచించింది. ఈ టెక్నాలజీ ద్వారా ఒరిజినల్ కాలర్ ఎవరో తెలుసుకునే వీలుంటుంది. ఫేక్ కాల్స్, మెసేజెస్‌ను అరికట్టే ఛాన్స్ ఉంది. దీని కోసం పూర్తి స్థాయిలో కాలర్ ఐడీ ఫీచర్ తీసుకురావాలని కూడా ట్రాయ్ సూచించింది.
దీని ప్రకారం కాలర్‌కు సంబంధించిన పేరు, ఫొటోలు వాటికవే మొబైల్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. దీంతో వినియోగదారులు తమకు ఎవరు ఫోన్ చేశారు అని సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ సర్వీసు ఉన్నప్పటికీ ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారానే సాధ్యమవుతుంది. అయితే, ఈ యాప్స్ చూపించే వాటిలో కొన్ని ఫేక్ ఐడెంటిటీలు కూడా ఉంటున్నాయి. కానీ, ట్రాయ్ తెచ్చిన కొత్త నిబంధన అమల్లోకి వస్తే మొబైల్ నెంబర్ ఒరిజినల్‌గా ఎవరు తీసుకున్నారో.. వారికి సంబంధించిన డీటైల్స్ మాత్రమే కనిపిస్తాయి. దీనిలో మోసానికి తావుండదు. దీంతో వినియోగదారులకు మేలు కలుగుతుంది. అలాగే పది అంకెల మొబైల్ నెంబర్‌ను ప్రమోషనల్ కాల్స్, బిజినెస్ కాల్స్ వంటి అవసరాలకు వినియోగించకుండా చూడాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ఈ నెంబర్లను ఇకపై వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వాడే వీలుంటుంది.
వ్యతిరేకిస్తున్న సంస్థలు
ట్రాయ్ నిర్ణయం యూజర్లకు కచ్చితంగా మేలు చేసేదే. కానీ, కాలర్ ఐడీ నిర్ణయాన్ని టెలికాం సంస్థలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని టెలికాం కంపెనీలు అంటున్నాయి. దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి తెస్తాయా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కానీ, ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ట్రూ కాలర్ వంటి యాప్స్ సహాయం లేకుండానే కాల్ చేసింది ఎవరో తెలుసుకోవచ్చు. దీనిపై ట్రూ కాలర్ యాప్‌తో ఎయిర్టెల్, జియో వంటి సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. ట్రాయ్ నిర్ణయానికి టెలికాం సంస్థలు తలొగ్గితే ఈ ఫీచర్ ప్రారంభమవుతుంది.