Al Anchor Lisa: ఆమధ్య వరకూ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యూస్ యాంకర్లను విదేశాల్లోనే చూశాం. ఈమధ్య ఇండియాలోనూ దేశీయ AI యాంకర్లు వస్తున్నారు. ఇప్పటికే న్యూస్ 18 తెలుగు, CNBC, ఇండియా టుడే ఇలాంటి యాంకర్లను తెచ్చాయి. తాజాగా.. ఒడిశాలోని ప్రైవేట్ ఛానెల్.. భారతీయ AI న్యూస్ యాంకర్‌ను ప్రవేశపెట్టింది.
ఒడిశా సంప్రదాయ చేనేత చీర ధరించిన ఒక మహిళ అవతారంలో.. న్యూస్ యాంకర్లా కనిపిస్తూ వార్తలు చదువుతోంది. ఆ AI ప్రెజెంటర్ పేరు లిసా. ఒడియా, ఇంగ్లీషులో వార్తలు చదివే లిసా.. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రధాన యాంకర్గా వ్యవహరిస్తుందని కంపెనీ తెలిపింది. టీవీ బ్రాడ్కాస్టింగ్, జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న లీసా, ఒడిశా మొదటి AI న్యూస్ యాంకర్‌గా నిలిచింది. లిసా అనేక భాషలను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం లీసా న్యూస్ రీడింగ్ ఒడియా, ఇంగ్లీషులో ఉంటుంది. ఒడియా టెలివిజన్ మీడియాలో లిసా ప్రదర్శన ఆసక్తిగా మారింది. లిసా పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు కూడా ప్రారంభించింది ఆ ఛానెల్. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ పేజీలు లిసా పేరు మీద ఉన్నాయి. చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని ఛానెళ్లు కూడా ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.