Onion Prices: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. అలాంటి ఉల్లిని కొనేందుకు తల్లి కూడా వందసార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయ్. మొన్నటి వరకు టమాటా.. ఇప్పుడు ఉల్లి ధరలు భారీగా పెరిగాయ్. దీంతో సామాన్యుల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు పండగల సీజన్ కూడా ప్రారంభం కావడం.. అదే సమయంలో ఉల్లి ధరలు ఆకాశం వైపు చూస్తుండటంతో.. గుండె గట్టిగా పట్టుకొని మార్కెట్ వైపు వెళ్తున్నారు జనాలు.
డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో.. ఉల్లి రేట్లు అమాంతం పెరుగుతున్నాయ్. రానున్న రోజుల్లో రేట్లు మరింత భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జూన్, జులై నెలల్లో 20 రూపాయల నుంచి 25 రూపాయలు పలికిన కిలో ఉల్లి గడ్డ.. ఆగస్ట్, సెప్టెంబరులో 35 రూపాయలు పలికింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి 40 నుంచి 60 రూపాయల మధ్య ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలను 60 నుంచి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఉల్లిపాయ కోయకుండానే సామాన్యులతో కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి. రానున్నది దీపావళి సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయ్. దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయ్. దీంతో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో బహిరంగ మార్కెట్‌లో కొరత ఏర్పడింది.
దీంతో ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక వర్షాలు సరిగాలేక కర్నూలు, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగినట్లు ఉల్లి సరఫరా లేదు. డిసెంబర్ చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగే చాన్స్ ఉంది. కిలో ఉల్లి సెంచరీ కొట్టినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయ్.