Petrol Price: గ్యాస్‌ సిలిండర్ తగ్గింది సరే.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయా..?

గ్యాస్‌ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగిరావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి వాహన ఇంధన ధరలు కూడా తగ్గిస్తే.. అన్ని నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యులు కూడా ఇదే ఆశిస్తున్నారు. అయితే, ఇవన్నీ నిజమయ్యే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్‌ అంచనా వేసింది.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 07:33 PM IST

Petrol Price: ఎన్నికల వేళ.. జనాలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రాఖీ పండగకు ఒకరోజు ముందే ఫెస్టివల్‌ గిఫ్ట్ ఇచ్చింది. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించింది. దీంతో ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌ సంగతేంటి అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా తగ్గుముఖం పట్టొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. వరుస ఎన్నికలతో కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా రియాక్ట్ అయ్యే చాన్స్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గ్యాస్‌ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగిరావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి వాహన ఇంధన ధరలు కూడా తగ్గిస్తే.. అన్ని నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యులు కూడా ఇదే ఆశిస్తున్నారు. అయితే, ఇవన్నీ నిజమయ్యే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. రాబోయే పండగల సీజన్‌తో పాటు వరుస ఎన్నికల సమయం కావడంతో.. కేంద్రం పెట్రో ధరల తగ్గింపుపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. వంట గ్యాస్‌ ధర తగ్గించాలన్న కేంద్ర నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్‌ పాయింట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మధ్య టమాటాల ధరలు దిగి వచ్చాయి. దీంతో సెప్టెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు వచ్చే అవకాశం ఉంది. జులైలో 15 నెలల గరిష్ఠానికి చేరిన నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పట్టేందుకు కేంద్రం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెప్పారు. తాజాగా గ్యాస్‌ ధర తగ్గించడం అందులో భాగమేనని వివరించారు.

మరోవైపు ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించారు. ఈ చర్యలకు పెట్రో ధరల తగ్గింపు కూడా జత అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఏడాది చివరలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, మిజోరం సహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. దీంతో నిత్యావసరాల ధరల తగ్గుదల దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదిగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు ఉన్నాయి. మన దగ్గర మాత్రం దాదాపు సంవత్సరం నుంచి పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం ద్వారా ధరల్ని సవరించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.