రిలయన్స్ ఇటీవల దేశీయ సాఫ్ట్‌డ్రింక్ బ్రాండ్ కాంపకోలాను (Campa Cola) కొనుగోలు చేసింది. ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన డ్రింక్‌తో ఈ సమ్మర్‌ను కొల్లగొట్టడానికి సిద్ధమయ్యారు ముకేష్ అంబానీ (Mukesh Ambani). అందులో భాగంగా ప్రైస్‌వార్‌కు తెరతీశారు. కోక్ (Coke), పెప్సీతో (Pepsi) పోల్చితే తక్కువ ధరలతో కాంపకోలాను మార్కెట్‌లోకి వదిలారు. రెండు లీటర్ల కాంపకోలా బాటిల్ ధర కేవలం 49రూపాయలు మాత్రమే. లేబుల్ ప్రైస్‌తో పోల్చితే సగం ధరకే అందుబాటులోకి వచ్చింది. ఇదే రెండు లీటర్ల కోక్, థంప్సప్ (thums up), పెప్సీతో పోల్చితే ఇది కనీసం 30రూపాయలు తక్కువ. అదే చిన్నబాటిల్ ధరను 10రూపాయలుగా నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని స్టోర్లలో ప్రతి వంద కోకాకోలా (Coca Cola), పెప్సీ అమ్మకాలకు 30కాంపకోలా బాటిల్స్ అమ్ముడవుతున్నట్లు రిలయన్స్ (Reliance) చెబుతోంది. ఇలా అతి తక్కువ ధరలకే తన డ్రింక్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడం ద్వారా జనానికి వాటిని పరిచయం చేయాలన్నది ముకేష్ వ్యూహం. రేటు కాస్త తక్కువగా ఉండటంతో ఓసారి ట్రై చేసి చూస్తే పోలా అని ఆలోచిస్తారు. పైగా సమ్మర్ కావడంతో సాధారణంగానే కూల్‌డ్రింక్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో తక్కువ రేటుతో ప్రజలకు అందుబాటులో ఉంటే వాటిని కచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాలని చూస్తారు. దీంతో డ్రింక్ జనంలోకి వెళుతుంది. టేస్ట్ నచ్చితే సేల్స్ ఆటోమెటిక్‌గా పెరుగుతాయి.
కోకాకోలా, పెప్సీతో మార్కెట్‌లో తలపడటం అంటే అంత ఈజీ కాదు. గతంలో చాలామంది వీటితో పోటీకి ప్రయత్నించి ఫెయిలయ్యారు. ఆ విషయం అంబానీకి బాగా తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. గతంలో జియోను (Jio) తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించారు ముకేష్ అంబానీ. అప్పటివరకు చాలా ఎక్కువగా ఉన్న డేటా రేట్లను నేలకు దించారు. తక్కువ ధరకే జియో సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్క జీబీ డేటా ధర వంద రూపాయలకు పైగా ఉండేది. కానీ ఇంకొంచెం పెడితే నెలంతా రోజుకో జీబీ డేటాతో పాటు ఫ్రీకాల్స్ అంటూ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది జియో… దేశమంతా దానిపేరు మార్మోగిపోయింది. మిగిలిన ప్లేయర్లు కూడా ధర తగ్గించాల్సి వచ్చింది. అప్పటికే జియో జనంలోకి చొచ్చుకుపోయింది. నెంబర్‌వన్ టెలికం బ్రాండ్‌గా మారిపోయింది. సేమ్ స్ట్రాటజీని కాంపకోలా విషయంలోనూ అనుసరిస్తున్నారు అంబానీ. కాంపాకోలాను తక్కువ ధరకే మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. అంతేకాదు రిలయన్స్‌కు భారీగా రీటైల్ నెట్‌వర్క్ ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకోనుంది. దీనికి దేశవ్యాప్తంగా 2,500 రీటైల్ స్టోర్లున్నాయి. జియోమార్ట్ (Jiomart) పేరుతో యాప్ కూడా ఉంది.
ఏ ప్రొడక్ట్ సక్సెస్ కావాలన్నా ప్రమోషన్ కీలకం. అందుకే పక్కాగా క్యాంపెయిన్ ప్లాన్ చేస్తోంది రిలయన్స్. ఐపీఎల్‌లో (IPL) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు రిలయన్సే ఓనర్… దాన్ని కూడా ప్రమోషన్‌కు వాడుకోనుంది. అవసరమైతే మరికొన్ని జట్లను కూడా కాంపకోలా ప్రమోషన్‌లో భాగం చేయనున్నారు. ప్రస్తుతానికి కాంపకోలాను ఔట్‌సోర్సింగ్ ద్వారా తయారు చేస్తున్నారు. అయితే త్వరలో సొంతంగా లేదా జాయింట్ వెంచర్ ద్వారా కాంపాకోలా తయారీకి సిద్ధమవుతోంది రిలయన్స్. అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా కీలకం. దీనికి తన రీటైల్ నెట్‌వర్క్ అండగా ఉంటుందన్నది దాని అంచనా.
దేశీయంగా సాఫ్ట్‌డ్రింక్ మార్కెట్ విలువ 68వేల కోట్ల రూపాయలకు పైనే.. ఇందులో మేజర్ వాటా కోకాకోలా, పెప్సీదే. కాంపకోలాను కేవలం 22కోట్లకే రిలయన్స్ కొనుగోలు చేసింది. కానీ వచ్చే ఐదేళ్లలో కాంపకోలా సేల్స్ ఏడాదికి కనీసం పది వేల కోట్లకు చేల్చాలన్నది అంబానీ వ్యూహం. కోకాకోలాలో 17ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేసిన టి.కృష్ణకుమార్ ఇప్పుడు క్యాంపకోలా సక్సెస్ బాధ్యతలు తీసుకున్నారు. వాటితో పోల్చితే రిలయన్స్‌కు చాలా అడ్డంకులు ఉన్నాయి. దేశమంతా ప్లాంట్లు, విస్తృతమైన నెట్‌వర్క్, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇప్పటికే పాతుకుపోయి ఉన్నాయి. వీటిని ఢీకొట్టడం అంటే కొండను కొట్టడమే అని తెలుసు.. అయినా తన ప్లాన్స్‌పై అంబానీకి నమ్మకం ఉంది. ఇక రిలయన్స్ స్ట్రాటజీపై కోకాకోలా, పెప్సీ కూడా కన్నేసి ఉంచాయి. రిలయన్స్ స్వదేశీ నినాదాన్ని కూడా ఎత్తుకుంటుందని భావిస్తున్న ఆ సంస్థలు దానికి కౌంటర్ ప్లాన్‌తో రెడీ అవుతున్నాయి.