గృహరుణ వినియోగదారులారా… బీ అలర్ట్.. మీకో బ్యాడ్ న్యూస్… ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లు పెంచబోతోంది. మీ బడ్జెట్‌కు బొక్క పెట్టబోతోంది… ఇంతకీ రిజర్వ్ బ్యాంక్ ఎంత మేర వడ్డీ రేట్లు పెంచబోతోంది…? మీ ఈఎంఐ ఎంత మేర పెరగబోతోంది…?
రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఏప్రిల్ 3,5,6 తారీకుల్లో సమావేశం కాబోతోంది. ఈసారి కూడా వడ్డీరేట్లు మరో పావుశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 25బేసిస్ పాయింట్లు పెంచొచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం 6శాతం కంటే అధికంగా ఉండటంతో దాని కట్టడికే కేంద్ర బ్యాంకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ సంక్షోభం ఉన్నా అమెరికా ఫెడ్ ఇటీవలే పావుశాతం రేటు పెంచింది. మన రిజర్వ్ బ్యాంక్ కూడా దాన్నే ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా ఇటీవల వడ్డీరేట్ల పెంపునకే మొగ్గు చూపింది. ఏప్రిల్ 6న ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను కేంద్ర బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వివరిస్తారు. అయితే కనీసం పావుశాతం వడ్డీ పెంపునకు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలని నిపుణులు చెబుతున్నారు.
కరోనా తర్వాత ద్రవ్యోల్బణం అంచనాలను మించి ఉంటోంది. కాస్త తగ్గుతున్నా రిజర్వ్ బ్యాంక్ బెంచ్‌మార్క్ 6శాతానికంటే ఎక్కువగానే ఉంటోంది. కాబట్టే వడ్డీరేట్ల పెంపునకే మొగ్గు చూపుతోంది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే దాని ప్రభావం ఎక్కువగా పడేది గృహరుణ వినియోగదారులపైనే.. బ్యాంకులు పావుశాతం వడ్డీరేట్లు పెంచినా దాని ప్రభావం భారీగానే ఉంటుంది. గత ఏడాది కాలంగా బ్యాంకులు ఏ స్థాయిలో వడ్డీరేట్లు పెంచాయో తెలిసిందే. 2022 మేకు ముందు రెపోరేటు 4శాతంగా ఉంది. మే4న దాన్ని 40 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇక అప్పట్నుంచి పెరుగుతూనే ఉన్నాయి. మొన్న జనవరిలో పెంపుతో కలిపి అది ఆరున్నర శాతానికి చేరింది. అంటే 11 నెలల్లో రెండున్నర శాతం వడ్డీరేటు పెరిగింది. 2022ఏప్రిల్ సమయంలో 25లక్షల గృహరుణం 7శాతం వడ్డీకి తీసుకుని ఉంటే ఇప్పుడది 9 నుంచి 10శాతం మధ్యలో ఉంది. దాదాపు రెండున్నర శాతం వడ్డీరేటు పెంపు అంటే మాటలు కాదు. తక్కువ మొత్తం గృహరుణం తీసుకున్నవారే కనీసం నెలకు ఐదారువేల మేర అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కాస్త ఎక్కువ రుణం తీసుకున్న వారి సంగతి చెప్పాల్సిన పనిలేదు.
రిజర్వ్ బ్యాంక్ ఇంకెంతకాలం వడ్డీరేట్లు పెంచుతూ పోతుందన్న ప్రశ్నకు ఇప్పటికైతే సమాధానం దొరకడం లేదు. అయితే నిపుణులు మాత్రం ఫెడ్ సూచనలను బట్టి మన రిజర్వ్ బ్యాంకు కూడా మరో ఒకటి, రెండుసార్లు పావుశాతం మేర పెంచి ఆ తర్వాత వడ్డీ బాదుడుకు బ్రేక్ వేయవచ్చని చెబుతున్నారు. ఇంకొంతమంది అయితే ఇది చివరి పెంపు కావొచ్చని గట్టిగా నమ్ముతున్నారు అంతకు మించి వెళితే దాని ప్రభావం ఆర్దిక వ్యవస్థపై భారీగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గత మానిటరీ పాలసీ సమావేశంలోనే ఇద్దరు సభ్యులు రేట్ల పెంపును వ్యతిరేకించారు. ఈసారి వారికి మరికొందరు తోడయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్నంత వరకే ఈ అంచనాలన్నీ. అది ఏ మాత్రం కట్టుతప్పినా వడ్డీ భారం పెరిగిపోవడం మాత్రం తప్పదు.