సాధారణంగా బ్యాంకులు కస్టమర్లకు ఈ అవకాశాన్ని ఇవ్వవు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరిచినా.. లేక రెన్యువల్ కార్డైనా సరే.. వీసా, మాస్టర్ , రూపే కార్డుల్లో ఏది ఇవ్వాలన్నది బ్యాంకులే డిసైడ్ చేస్తాయి. ఆయా నెట్‌వర్క్ లు మనకు నచ్చకపోయినా.. వాటిని భరించాల్సిందే. ఇలా బలవంతంగా కార్డు ఇష్యూ చేసే నెట్‌వర్క్ లను కస్టమర్లపైకి రుద్దే విధానానికి చెక్ పెట్టింది ఆర్బీఐ. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, రూపే కార్డు ఏదైనా సరే..తమకు నచ్చిన నెట్‌వర్క్ ను ఎంచుకోవచ్చు.
కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ ఎప్పటి నుంచి ?
అక్టోబర్ 1 , 2023 నుంచి కార్డ్ నెట్ వర్క్ పోర్టబిలిటీ ద్వారా బ్యాంక్ కస్టమర్లు తమకు నచ్చిన నెట్‌వర్క్ ను ఎంచుకోవచ్చు. కార్డు ఇష్యూ చేయడానికంటే ముందే ఇకపై బ్యాంకులు ఏ నెట్‌వర్క్ కావాలో తెలుసుకుంటాయి. కస్టమర్స్ ఏది కోరుకుంటే ఆ నెట్ వర్క్ పేరుతో కార్డులను ఇష్యూ చేస్తాయి. ఇప్పటికే ఒక నెట్‌వర్క్ కార్డును వాడుతున్న వాళ్లు మరో నెట్‌వర్క్ లోకి ఈజీగా మారిపోవచ్చు. ఉదాహరణకు మీ వద్ద ఒక బ్యాంక్ జారీ చేసిన వీసా క్రెడిట్ కార్డు ఉంటే.. మీరు వీసా నుంచి మాస్టర్ కార్డులో మారిపోవచ్చు. ఏ కార్డు నెట్‌వర్క్ నుంచైనా మరో నెట్‌వర్కులోకి వెళ్లిపోవచ్చు.
కార్డు నెట్‌వర్క్ పోర్టబిలిటీ అవసరం ఏంటి ?
డెబిట్, క్రెడిట్ కార్డు నెట్‌వర్క్ పోర్టబిలిటీని తీసుకురావడానికి ఆర్బీఐ అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది. ముందుగా కాంపిటీషన్. అమెరికాకు చెందిన వీసా, మాస్టర్ కార్డు నెట్‌వర్కులు మనదేశంలో 90 శాతానికి పైగా క్రెడిట్ కార్డు ఇష్యూ మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఐదు క్రెడిట్ నెట్‌వర్క్ లు కార్డులను ఇష్యూ చేస్తున్నాయి. వీసా, మాస్టర్ కార్డు, రూపే కార్డు, అమెరికన్ ఎక్స్ ప్రెస్, డైనర్స్ క్లబ్. వీటిలో వీసా, మాస్టర్ కార్డులే కీ రోల్ ప్లే చేస్తున్నాయి. వీసా కార్డు ఇండియన్ మార్కెట్ లో 44శాతం షేర్ కలిగి ఉంటే.. మాస్టర్ కార్డుకు 36 శాతం ఉంది. మెజార్టీ దేశీ, విదేశీ బ్యాంకులు ఈ రెండు సంస్థలతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే కార్డు నెట్ వర్క్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చిన తర్వాత వీటి మార్కెట్ షేర్ పై ప్రభావం పడింది. పైగా వినియోగదారుల నుంచి ఈ నెట్‌వర్కులు అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. బ్యాంకులు అగ్రిమెంట్లు కుదుర్చుకునే సమయంలో కస్టమర్ల కోణంలో ఆలోచించే అవకాశమే ఉండదు. బ్యాంకులు, నెట్ వర్కు సంస్థలకు ఉన్న అవగాహన మేరకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీని వల్ల వినియోగదారులకు చాయిస్ లేకుండా పోయింది.
ఆర్బీఐ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందా ?
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం గ్లోబల్ క్రెడిట్ కార్డు ఇండస్ట్రీలో సమూల మార్పుల దిశగా అడుగులు వేయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇష్యూయర్స్, నెట్‌వర్స్ మధ్యలో జరిగే ఒప్పందాల వల్ల వినియోగదారులపై చాలా ప్రభావం పడుతూ వస్తోంది. ఇకపై కార్డు నెట్‌వర్కులు ఇష్యూయర్లతో ఎలా పడితే అలా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలులేదు. పలానా బ్యాంక్ వాళ్లు పలానా కార్డు నెట్‌వర్క్ కార్డు మాత్రమే జారీ చేయాలనే నిబంధనలకు ఆర్బీఐ చెల్లు చీటి పలికింది. కస్టమర్లు ఏది కోరుకుంటే ఆ నెట్ వర్క్ కార్డు మాత్రమే ఇచ్చేలా బ్యాంకులు ఇకపై ఒప్పందాలు చేసుకోవాలి.
కేక పుట్టిస్తున్న ఇండియన్ క్రెడిట్ కార్డు షేర్
మనదేశంలో గడిచిన కొన్ని సంవత్సరాల్లో క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది. సంవత్సరానికి కనీసం 30 శాతం మేర ఇది పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు బ్యాంకులు 8.65 కోట్ల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. ప్రతి నెలా దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు పేమెంట్లు లక్ష కోట్ల వరకు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగిపోయింది. దీంతో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది కంట్రీ పర్చేజింగ్ పవర్‌ను సూచిస్తుంది. ఇలాంటి సమయంలో కస్టమర్లకు కార్డు నెట్‌వర్క్ ను ఎంచుకునే చాయిస్ ఇవ్వడం వల్ల కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం దేశంలో క్రెడిట్ కార్డు ల్యాండ్ స్కేప్‌ను మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఆర్బీఐ నిర్ణయం వెనుక రూపే వ్యూహం
వీసా నుంచి మాస్టర్ కార్డు వరకు ఇవన్నీ ఇంటర్నేషన్ క్రెడిట్ కార్డు నెట్‌వర్కులే. వీటి ప్రయోజనాలు, లాభాలకు అనుగుణంగానే ఇప్పటి వరకు బ్యాంకులు ఈ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 2014లో రూపే పేరుతో మల్టీ నేషనల్ పేమెంట్ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది. వీసా ,మాస్టర్ కార్డులకు దీటుగా ఇది తన సత్తాను చాటుతోంది. దేశీయ డెబిట్ కార్డు మార్కెట్ షేర్ లో 65 శాతం వాటాను ఇది ఇప్పటికే కైవసం చేసుకుంది. రూపేకు మరింత బలాన్ని ఇచ్చి ప్రోత్సహించాలంటే నెట్ వర్క్ పోర్ట బిలిటీ లాంటి సదుపాయాలు అవసరమని ఆర్బీఐ భావిస్తోంది.