RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీరేట్లు యథాతథం.. హోం లోన్ తీసుకోవచ్చా..?

రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ నిర్ణయించింది. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు కూడా 6.75 వద్ద స్థిరంగా ఉంచింది ఆర్బీఐ. ఈ విషయాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు. గత మంగళవారం నుంచి మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరిగింది.

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 03:16 PM IST

RBI: వడ్డీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ నిర్ణయించింది. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు కూడా 6.75 వద్ద స్థిరంగా ఉంచింది ఆర్బీఐ. ఈ విషయాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు. గత మంగళవారం నుంచి మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను ఆయన మీడియాకు వివరించారు. కీలక పాలసీ రేట్లలో మార్పులు చేయకపోవడం ఇది రెండోసారి. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ప్రగతికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని శక్తికాంత దాస్ అన్నారు. దీని ప్రకారం కీలక రేట్లలో మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావించారు. వీరి అంచనాలకు తగ్గట్లుగానే.. రెపో, వడ్డీ రేట్లను మార్చలేదు. అలాగే సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని నిర్ణయించారు. ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంది. భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దేశ ఖజానాలో 595.1 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలున్నాయి.
4 శాతంపైనే ద్రవ్యోల్బణం
ఆర్బీఐ అంచనా ప్రకారం.. దేశంలో కొంతకాలంగా ద్రవ్యోల్బణం 4 శాతానికిపైగానే కొనసాగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాలను 5.2 నుంచి 5.1 శాతానికి తగ్గించింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.6 శాతం, రెండో త్రైమాసికంలో 5.2 శాతం, మూడో త్రైమాసికంలో 5.4 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం ఉండొచ్చని ఆర్బీఐ అంచనా. గత ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయికి.. అంటే 4.7 శాతానికి చేరింది.
స్థిరంగా వృద్ధిరేటు
ఆర్బీఐ అంచనా ప్రకారం.. ఈ ఏడాది దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతుంది. మొదటి త్రైమాసికంలో జీడీపీ 8 శాతం, రెండో త్రైమాసికంలో 6.5 శాతం, మూడో త్రైమాసికంలో 6 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.7 శాతం ఉంటుందని అంచనా వేసింది.
హోం లోన్ తీసుకోవచ్చా?
ఆర్బీఐ తాజా నిర్ణయం బ్యాంక్ వినియోగదారులకు మేలు చేసేదే అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెపో, వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించడం బ్యాంక్ కస్టమర్లకు ఊరటనిచ్చింది. దీంతో వడ్డీ రేట్లు అందుబాటులోనే ఉంటాయ. హోం లోన్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్లకు ఇదే సరైన సమయం అని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అనేక బ్యాంకులు పది శాతం వడ్డీకే రుణాలు అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచితే బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగేవి. కానీ, ఆర్బీఐ రేట్లు పెంచకపోవడంతో సామాన్యులకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాల్ని ఇస్తున్నాయని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.