Unclaimed Deposits: దేశీయ బ్యాంకుల్లో అన్ క్లెయిమ్ డిపాజిట్లు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అలా మిగిలిపోయిన డబ్బుల్ని డిపాజిట్ దారులకు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. అన్ క్లెయిమ్ డిపాజిట్లు అంటే చాలా మంది ఖాతాదారులు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి మర్చిపోవడమో, మరణించడమో జరిగితే ఆ డబ్బులు అలాగే ఉండిపోతాయి. కొందరు డబ్బుల్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే, ఇంకొందరు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచి వదిలేస్తుంటారు. అంటే బ్యాంక్ ఖాతా తెరిచి, అందులో కొంత నగదు జమ చేసి తర్వాత మర్చిపోతుంటారు. ఇలా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో మిగిలిపోయిన నగదును అన్ క్లెయిమ్ డిపాజిట్లు అంటారు.
అలా మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో రూ.35 వేల కోట్ల డిపాజిట్లు మిగిలిపోయాయని కేంద్రం తెలిపింది. ఇటీవల దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జరిపిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై కేంద్ర మంత్రి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు ఖాతాదారులకు, డిపాజిట్ దారులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశించినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ అజయ్ సేథ్ వెల్లడించారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బ్యాంకులను ఆదేశించారు. పదేళ్ల క్రితం వరకు వాడకంలో లేని డిపాజిట్లను ఈ పద్ధతిలో అందజేస్తారు. ఈ డబ్బును జూన్ 1 నుంచి అర్హులకు అందజేసేలా చూడాలని కేంద్రం సూచించింది. 100 రోజులపాటు ప్రత్యేక ప్రణాళిక ద్వారా డబ్బు అందజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం వంద రోజులు.. వంద శాతం చెల్లింపులు పేరుతో ఆర్బీఐ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఎలా తెలుసుకోవాలి?
బ్యాంకుల్లో అన్ క్లెయిమ్ డిపాజిట్ల గురించి లబ్ధిదారులకు ఎలా తెలుస్తుంది అనే సందేహం రావొచ్చు. ఎవరైనా తాము డబ్బు దాచి మర్చిపోయాం అనిపించినా.. లేక తమ కుటుంబ సభ్యులు డిపాజిట్ చేసి మర్చిపోయారేమో అనే అనుమానం వచ్చినా ఆయా బ్యాంకులను సంప్రదించవచ్చు. దీనికోసం బ్యాంకులు ప్రత్యేక విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‍సీ బ్యాంకుకు సంబందించి https://leads.hdfcbank.com/applications/webforms/apply/HDFC_Inoperative_acc/ HDFC_Inoperative_acc.aspx అనే లింకుపై క్లిక్ చేసి ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మిగతా బ్యాంకుల్ని కూడా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్స్‌లోని డబ్బు క్లెయిమ్ చేసుకోవాలంటే దీనికి అనుగుణమైన డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఐడీ కార్డులు, అడ్రస్ ప్రూఫ్స్ వంటివి సమర్పించి ఆ డబ్బు తీసుకోవచ్చు. అలాగే ఇంతకాలం డబ్బు క్లెయిమ్ చేసుకోకపోవడానికి కారణాల్ని కూడా వివరించాల్సి ఉంటుంది. వినియోగదారుల అభ్యర్థనను పరిశీలించిన తర్వాత బ్యాంకు సిబ్బంది ఆ నగదును అందజేస్తారు.