Jio Space Fiber: జియో నుంచి శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్.. వివరాలు తెలుసుకున్న మోదీ..

దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. జియో స్పేస్ ఫైబర్ పేరుతో ఈ సేవల్ని ప్రారంభించబోతుంది. ఈ సేవలకు సంబంధించి ఉపగ్రహం ఆధారంగా నడిచే గిగాబైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ నమూనాల్ని ప్రదర్శించింది.

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 02:01 PM IST

Jio Space Fiber: టెలికాం రంగంలో అనేక సంచలనాలకు తెరతీసిన రిలయన్స్ జియో.. ఇప్పుడు మరో కొత్త సంచలనానికి సిద్ధమైంది. దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. జియో స్పేస్ ఫైబర్ పేరుతో ఈ సేవల్ని ప్రారంభించబోతుంది. ఈ సేవలకు సంబంధించి ఉపగ్రహం ఆధారంగా నడిచే గిగాబైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ నమూనాల్ని ప్రదర్శించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో శుక్రవారం ఉదయం ఈ సేవలకు సంబంధించిన నమూనాను రిలయన్స్ ప్రదర్శించింది. వీటిని ప్రధాని మోదీ పరిశీలించారు.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ఈ సేవల గురించి ప్రధానికి వివరించారు. దేశంలో ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో జియో స్పేస్ ఫైబర్ సేవల్ని ప్రారంభించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా గిర్ (గుజరాత్), కోర్బా (ఛత్తీస్‌గఢ్), నబ్రంగ్‌పూర్ (ఒడిశా), ఓఎన్‌జీసీ-జోర్హాట్ (అసోం) ప్రాంతాల్లో సేవలను అందుబాటులో ఉంచింది. ఇవన్నీ మారుమూల ప్రాంతాలు కావడం విశేషం. జియో స్పేస్ ఫైబర్ కోసం జియో సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహ సాంకేతికతను ఎస్ఈఎస్‌ సహకారంతో వాడుతోంది. ఈ సాంకేతికత ద్వారా స్పేస్ నుంచి గిగాబిట్, ఫైబర్ లాంటి సేవలను అందించడానికి వీలుంటుంది. దీని ద్వారా ఎస్ఈఎస్‌కు చెందిన ఓ3బీ, ఓ3బీ ఎంపవర్ శాటిలైట్ల నెట్‌వర్క్‌కు యాక్సెస్ లభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి చోటుకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించవచ్చని రిలయన్స్ జియో తెలిపింది. దేశంలో ఇలా శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న మొదటి సంస్థగా జియో నిలవనుంది.

జియో స్పేస్ ఫైబర్.. దేశంలో, ఎవరైనా, ఎక్కడైనా ఇంటర్నెట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ సేవలకు ముందు కంపెనీ తన జియో ఎయిర్ ఫైబర్ సేవలను దేశంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. జియో ఎయిర్ ఫైబర్, జియో స్పేస్ ఫైబర్ ద్వారా కంపెనీ దేశంలో మారుమూల ప్రాంతాల్లో సైతం జియో ట్రూ5జీ సేవలను అందించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఇకపై జియో నుంచి జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్, జియో స్పేస్ ఫైబర్ సేవలను వినియోగదారులు పొందవచ్చు. గిగాబిట్ యాక్సెస్‌తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ సొసైటీలో పూర్తిగా మారేందుకు వీలు కలుగుతుందని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. పైగా ఈ సాంకేతికత దేశంలోని లక్షల మంది గృహాలను, వ్యాపారులను మొదటిసారిగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ పొందేలా చేస్తుందని ఆకాష్ అంబానీ అభిప్రాయపడ్డారు.