Metro Retail: గేట్లు తెరిచిన రిలయన్స్.. మెట్రోకు ఎవరైనా వెళ్లొచ్చు…!

మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్ గురించి తెలిసిందే. ఇంతవరకు బిజినెస్ టు బిజినెస్ కస్టమర్లకు మాత్రమే ఇందులోకి ఎంట్రీ ఉండేది. వ్యాపారం చేస్తున్నట్లు గుర్తింపు కార్డు ఉంటేనే ఇందులోకి ప్రవేశం ఉండేది.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 07:44 PM IST

Metro Retail: మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థను సొంతం చేసుకున్న రిలయన్స్‌.. కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బిజినెస్ టు బిజినెస్ కస్టమర్లకు మాత్రమే ఎంట్రీ ఉండగా.. ఇప్పుడు ఓపెన్ ఫర్ ఆల్ అంటోంది. రిటైల్ రంగంలో మరింత వాటాపై కన్నేసిన రిలయన్స్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్ గురించి తెలిసిందే. ఇంతవరకు బిజినెస్ టు బిజినెస్ కస్టమర్లకు మాత్రమే ఇందులోకి ఎంట్రీ ఉండేది.

వ్యాపారం చేస్తున్నట్లు గుర్తింపు కార్డు ఉంటేనే ఇందులోకి ప్రవేశం ఉండేది. అయితే ఇటీవల జర్మనీకి చెందిన మెట్రో ఏజీ నుంచి భారత్‌లో మెట్రో వ్యాపారాన్ని రిలయన్స్ సొంతం చేసుకుంది. రూ.2,850 కోట్లతో ఆ వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. 2003 నుంచి దేశంలో మెట్రో స్టోర్స్ నిర్వహణలో ఉన్నాయి. దేశంలో రిటైల్ రంగంలో తన పట్టు మరింత పెంచుకునేందుకు వీలుగా రిలయన్స్ వీటిని కొనుగోలు చేసింది. దేశంలో 31హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్స్ సెంటర్లు రిలయన్స్ పరమయ్యాయి.
మెట్రో స్టోర్స్‌ నుంచి చిరు వ్యాపారులు, కిరాణాషాపుల యజమానులు ఎక్కువగా కొనుగోలు చేసేవారు. హోల్‌సేల్‌ ధరలకే ఇందులో అమ్మకాలు జరిగేవి. ఎక్కువ మొత్తంలో కొంటే ఎక్కువ డిస్కౌంట్ దక్కేది. ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలు బీ2బీ కస్టమర్లకు తప్ప సాధారణ కస్టమర్లకు ఇందులో అమ్మకాలు చేయడానికి వీల్లేదు. మెట్రో ఏజీ తన వ్యాపారాన్ని అమ్ముకోవడానికి ఇదో కారణం. అయితే దేశీయ సంస్థగా రిలయన్స్‌కు ఆ ఇబ్బందులు లేవు.

ఇప్పుడు అందరు కస్టమర్లకు ఇందులోకి ప్రవేశం కల్పించాలని రిలయన్స్ నిర్ణయించింది. అంటే ఎవరైనా వెళ్లి తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అయితే ఇదే సమయంలో బీ2బీ కస్టమర్లను కోల్పోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే ఇప్పటివరకు ఇస్తున్న డిస్కౌంట్ కాకుండా అదనంగా మరింత ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఎంత ఎక్కువ కొంటే అంత ఎక్కువ లాభమన్నమాట. దీనివల్ల బీ2బీ కస్టమర్లను కోల్పోకుండా జాగ్రత్తపడుతోంది. మరో రెండేళ్ల పాటు మెట్రో బ్రాండ్‌తోనే వ్యాపారం నిర్వహించాలన్నది రిలయన్స్ ఆలోచన.
మెట్రో కొనుగోలు రిలయన్స్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. టైర్‌ 1, 2 నగరాల్లో మెట్రో ఆస్తులు రిలయన్స్‌ వ్యాపార విస్తరణకు కలసి రానున్నాయి. దేశంలో ప్రస్తుతం రిటైల్ రంగం వ్యవస్థీకృతంగా లేదు. ఇందులో ఉన్న లాభాలను గుర్తించిన రిలయన్స్.. ఆ రంగంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జియోమార్ట్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌ ఇలా రకరకాల పేర్లతో వ్యాపారం నిర్వహిస్తున్న రిలయన్స్ రిటైల్‌ను మెట్రో మరింత బలోపేతం చేయనుంది. రిలయన్స్‌ 2022 మార్చిలో 900 ఫ్యూచర్ రిటైల్‌ స్టోర్స్‌ను సొంతం చేసుకుంది. వాటిని రిలయన్స్‌ అవుట్‌లెట్లుగా మార్చింది. ప్రస్తుతం దేశంలో ఆర్గనైజ్డ్ రిటైలర్స్‌లో నెంబర్‌ వన్‌ రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ. రానున్న రోజుల్లో మరింత దూకుడుగా వెళ్లాలని రిలయన్స్‌ ప్లాన్ చేస్తోంది.