Reserve Bank Of India: రూ. 2 వేలు కాదండోయ్.. 500 రూ. నోటు కుడా డౌటే..? దీని వెనుక అసలు రహస్యం ఇదే..!

గతంలో నోట్లు అంటే అంతగా పట్టించుకునే వారు కాదు. అవసరమైనప్పుడు ఖర్చు చేసుకునేందుకు మాత్రమే బయటకు తీసేవారు. కానీ గడిచిన ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా ఏ క్షణంలో ఏ ప్రకటన వస్తుందో అన్న భయాందోళనలో ప్రజలు మగ్గిపోతున్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న ఒక సంచలనమే. నోట్ల రద్దు నుంచి లాక్ డౌన్ వరకూ లేడికి లేచిందే పరుగు అన్న విధంగా ప్రభుత్వాలు తమ నిర్ణయాలను తీసుకున్నాయి. దీని వల్ల ఇబ్బందులకు గురైంది మాత్రం సామాన్యులే అని చెప్పాలి. తాజాగా రెండు వేల నోటును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన ఆర్జీఐ త్వరలోనే మరో బాంబు పేల్చేందుకు సిద్దంగా ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. అదే రూ.500 నోటును కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఇలాంటి సంచలనాలకు కేరాఫ‌ అడ్రస్ గా మారుతోంది. పరిపాలనా లోపమా.. నిజంగానే నల్ల ధనాన్ని వెలికితీయడమా అనేది కేంద్రమే పునరాలోచించుకోవాలి.

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 06:19 PM IST

ప్రస్తుతం మార్కెట్లో రూ. 2 వేల నకిలీ నోట్లకు మించి రూ. 500 నకిలీ నోట్లు ఎక్కువ చెలామణి అవుతున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో రూ. 500 నోట్లను కూడా రద్దుచేయటం ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యిందని కొందరి ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. ఎప్పుడైతే రూ. 2 వేల నోట్ల ఉపసంహరించిందో అప్పటినుండే రూ. 500 నకిలీ నోట్లు విరివిగా చెలామణలోకి వచ్చేసిందని బ్యాంకు గుర్తించింది. రూ. 2 వేల నోట్ల రద్దుతో రిజర్వ్ బ్యాంకు ఒకటి అనుకుంటే గ్రౌండ్ లెవల్లో మరోటి జరుగుతోంది. నోట్లను రద్దుచేయగానే మార్కెట్లో ఉన్న మొత్తం రూ. 3.16 లక్షల కోట్ల డబ్బంతా బ్యాంకులకు వచ్చేస్తుందని భావించింది. ప్రస్తుతం జరిగే పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలుస్తుంది అనే నానుడి నిజం అయ్యేలా ఉంది. ఇప్పుడు రూ. 2వేల నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30. అయితే సామాన్యుల వద్ద ఉన్న కొంతో గొప్పో ఎర్రనోట్లన్నీ బ్యాంకుల్లో జమ అయిపోయాయి. కానీ రావల్సినవి కుప్పలు తెప్పలుగా ఉన్నాయట. రూ. 2వేలు బ్యాంకుల్లోనే కాకుండా నగల దుకాణాల్లో, పెట్రోలు పంపుల్లో, వైన్స్ షాపుల్లో ఇచ్చి రూ.500 నోట్లుగా మార్చుకుంటున్నారట.

పెరిగిన డిమాండ్:

ఎప్పుడైతే ఇలా చేయడం మొదలు పెట్టారో దీని ప్రభావం రూ. 500 మీద పడింది. రూ. 2వేలు మరి కొన్ని నెలల్లో రద్దవుతుంది అని గ్రహించి రూ. 500 లోకి మార్చేసుకొని బయటకు తీయకుండా భద్రపరుచుకుంటున్నారు. తద్వారా మార్కెట్లో రూ. 500 నోట్ల కొరత ఏర్పడుతోందని రిజర్వ్ బ్యాంకు గుర్తించింది. దేశవ్యాప్తంగా రోజూ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలా మారిపోతున్నయని రూ. 500 కనిపించకుండా పోతున్నాయన్న విషయాన్ని గ్రహించింది. ఇది ఒక ఎత్తైతే వీటి స్థానంలో నకిలీ నోట్లు కూడా స్థానం కల్పించుకుంటున్నట్లు సమాచారం. రూ. 2 వేలు చెల్లదన్న విషయం తెలియడంతో రూ. 500 లకు డిమాండ్ నాలుగింతలు పెరిగిందట. దీంతో ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నకిలీ రాయుళ్లు సిద్దం అయ్యారు. మంచి వాటిని దాచేసుకున్న వారు కొందరైతే.. రూ. 2 వేలను మార్చుకోవాలన్న వారు మరికొందరు. ఇలా పరస్పరం విరుద్ద చర్యలతో దొంగ నోట్లు మార్కెట్లోకి చలామణిలోకి వచ్చేశాయట. నిజం ఏదో నకిలీ ఏదో సామాన్యులు తెలుసుకోలేనంతగా తయారు చేశారట. సమాజంలో ఉన్న రూ. 500 కొరతను ఇలా పూడ్చేందుకు పావులు కదుపుతున్నారు కొందరు.

నకిలీ నోట్ల సరఫరా

ఈ పరిణామాలన్నింటినీ గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ మరో నిర్ణయం త్వరలోనే తీసుకునే అవకాశం ఉందంటున్నరు ఆర్థిక నిపుణులు. ఈ నకిలీ నోట్ల కుంభకోణానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ ను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ తీర ప్రాంతాల నుంచి భారతదేశంలోకి తరలిస్తున్నరన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ ముద్రించిన నోట్ల కంటే 20 శాతం అధికంగా మార్కెట్లో చలామణి అవుతున్నాయట. దీనివల్ల మొదటికే మోసం వచ్చేలా మారింది నోట్ల రద్దు వ్యవహారం. ఇదే గనుక జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబలైజేషన్లో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కరెన్సీ పై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. ఇలా గనుక జరిగితే ఇండియన్ ఎకానమీ తీవ్రంగా నష్టపోతుంది. దీని ప్రభావం దేశ జీడీపీ పై చూపిస్తుంది.

రద్దు ఇందుకేనా..?

ఇలాంటి పరిణామాలు తలెత్తకుడదనే ఉద్దేశ్యంతో త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోటును కూడా ఉపసంహరించుకుంటుంది అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా.. ఆర్థిక నిపుణుల్లో చాలా మంది రద్దు చేసేయడమే సబబని సూచిస్తున్నారు. ఈ పెద్ద నోట్ల వల్ల బ్లాక్ మనీ మరింత పోగై.. దీని ప్రదేశంలో నకిలీ కరెన్సీ ప్రాణం పోసుకుంటోంది. ఈ సమాచారం ప్రజల్లో తీవ్రంగా విస్తరిస్తే మనీ సర్క్యులేషన్ పెద్దగా జరగదు అంటున్నారు. వీటిని రద్దు చేసేస్తే.. నల్లధనాన్ని గుర్తించడం చాలా తేలిక అవుతుందే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికిప్పుడైతే రూ.2 వేలు బ్యాంకులకు పెద్దగా వచ్చి చేరుకోలేదు. ఉన్న నోట్లు అన్నీ సినిమా థియేటర్లలో, మద్యం షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో, జ్యూవెలరీ షాపుల్లో, షాపింగ్ మాల్స్ లో, వాహనాల విక్రయ దుకాణాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి తిరిగి బ్యాంకులకు చేరేందుకు మరి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తుంది. రూ. 2 వేల ఉపసంహరణ ప్రభావం రూ. 500 మీద పడుతుందా.. ఆర్బీఐ ఏ నిర్ణ‍యం తీసుకుంటుందో తెలీయాలంటే మరి కొన్ని వారాలు వేచి ఉండక తప్పదు.

 

T.V.SRIKAR