RuPay Card: సీవీవీ లేకుండానే రూపే కార్డుతో చెల్లింపులు.. ఎలాగంటే..

రూపే కార్డులను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఈ కార్డు ఉపయోగించి నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సదుపాయం కల్పించింది కేంద్రం. అలాగే విదేశాల్లోనూ కార్డు వినియోగించేలా ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది.

RuPay Card: నిన్నటివరకు వీసా, మాస్టర్ కార్డుకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులే కనిపించేవి. కానీ, ఇప్పుడు రూపే కార్డులకు కూడా ఆదరణ దక్కుతోంది. అయినప్పటికీ వాటితో పోలిస్తే ఈ కార్డుల వినియోగం తక్కువగా ఉంది. అందుకే ఈ కార్డులను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఈ కార్డు ఉపయోగించి నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సదుపాయం కల్పించింది కేంద్రం. అలాగే విదేశాల్లోనూ కార్డు వినియోగించేలా ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటికే డిస్కవర్ ఆఫ్ ది యూఎస్, డైనర్స్ క్లబ్, జపాన్‌కు చెందిన జేసీబీ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పుడు వినియోగదారులకు మరో మంచి అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. అదే సీవీవీ లేకుండానే చెల్లింపులు చేయడం. సాధారణంగా ఆన్‌లైన్‌లో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఎలాంటి చెల్లింపులు జరపాలన్నా ప్రతిసారీ సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ లావాదేవీ పూర్తవుతుంది. కానీ, రూపే కార్డులకు సీవీవీతో పని లేకుండానే లావాదేవీ జరిగేలా సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. అలాగని ఇది అందరు వినియోగదారులకు అందుబాటులో ఉండదు. సీవీవీ లెస్ పేమెంట్ వాడుకోవాలంటే టోకనైజేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. ఆన్‌లైన్‌ యాప్స్, ఇతర ప్లాట్‌ఫామ్స్, సర్వీసుల్లో టోకనైజేషన్ చేసుకుంటే సీవీవీ లేకుండా చెల్లింపులు చేయవచ్చు. డైరెక్ట్‌గా కార్డ్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. టోకనైజేషన్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌ చెల్లింపుల యుగమే. షాపింగ్, పేమెంట్స్ వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ డీటైల్స్ ఎంటర్ చేయాలి.

వీటిని ఆయా యాప్‌కు సంబంధించిన సర్వర్స్ సేవ్ చేసుకుంటాయి. ఇలా సేవ్ అయిన సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండటంతో కేంద్రం టోకనైజేషన్ తీసుకొచ్చింది. అంటే ఈ పద్ధతిలో కార్డు, సీవీవీ, ఇతర వివరాలు ఎంటర్ చేసినప్పుడు అవి వాటి సర్వర్లలో సేవ్ కావు. ఒక టోకెన్ క్రియేట్ అవుతుంది. ఈ టోకెన్ ఆధారంగా సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేసి చెల్లింపులు చేయొచ్చు. టోకనైజేషన్ కోసం ఆయా యాప్స్‌కు వినియోగదారులు అంగీకరిస్తేనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. లేదంటే లావాదేవి అవసరమైన ప్రతిసారీ కార్డు వివరాలు పూర్తిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీసా, మాస్టర్ కార్డులకు సంబంధించి టోకనైజేషన్ పూర్తైనప్పటికీ ట్రాన్సాక్షన్ చేయాలంటే సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేయాలి. కానీ, రూపే కార్డులకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానంలో సీవీవీతో పని లేకుండా ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు. లావాదేవీ పూర్తవుతుంది. రూపే కార్డు దేశీయంగా అభివృద్ధి చేసిన కార్డు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కార్డులను అందుబాటులోకి తెచ్చింది.