Sugar Price: పండుగల వేళ చేదెక్కిన చక్కెర.. అమాంతం పెరిగిన ధర!

ఈసారి పండుగల వేళ చక్కెర చేదెక్కింది. దాని రిటైల్ రేటు అమాంతం పెరిగి కేజీకి రూ.48 దాకా పెరిగిపోయింది. జులైలో రూ.43 ఉన్న చక్కెర రేటు ఏకంగా కేజీకి రూ.5 దాకా పెరిగిపోయింది. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో కిలో చక్కెర రేటు రూ.42 దగ్గరే ఉంది.

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 03:02 PM IST

Sugar Price: శ్రావణ మాసం అంటేనే పండుగల సీజన్. ఇంకొన్ని రోజుల్లో వినాయక చవితి, దేవి నవరాత్రులు, దీపావళి పండుగలు రానున్నాయి. పండుగల వేళలో ముందుగా గుర్తుకు వచ్చేవి స్వీట్స్. ఈసారి పండుగల వేళ చక్కెర చేదెక్కింది. దాని రిటైల్ రేటు అమాంతం పెరిగి కేజీకి రూ.48 దాకా పెరిగిపోయింది. జులైలో రూ.43 ఉన్న చక్కెర రేటు ఏకంగా కేజీకి రూ.5 దాకా పెరిగిపోయింది. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో కిలో చక్కెర రేటు రూ.42 దగ్గరే ఉంది. నిశితంగా పరిశీలిస్తే.. గత రెండు నెలల వ్యవధిలోనే చక్కెర రేటు కేజీకి ఆరు రూపాయల దాకా జంప్ అయ్యింది. ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చక్కెర ధర చేరుకుంది. ఈ ఎఫెక్ట్‌కు తోడుగా పండుగల సీజన్ కూడా ఉండటంతో రానున్న రోజుల్లో స్వీట్లు, చాక్లెట్లు, కూల్‌ డ్రింక్స్ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. మొన్నటి వరకు టమాటా మంట, నిన్నటి వరకు ఉల్లి మంటతో బాధపడిన ప్రజలకు ఇప్పుడు చక్కెర ధరల మంట పండుగ సంతోషం ఆవిరయ్యేలా చేస్తోంది. మరో రెండు, మూడు నెలల పాటు చక్కెర ధరలు ప్రస్తుత రేంజ్‌లోనే కొనసాగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వర్షాభావం ఎఫెక్ట్..
చక్కెర ధరల మంట ఇంతగా రాజుకోవడానికి ప్రధాన కారణం.. వర్షాలు కురవకపోవడంవల్ల చెరుకు పంటకు వాటిల్లిన నష్టమే. ఈ ఏడాది ఆగస్టు నెలలో చెరకు ఎక్కువగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు పంట మార్చే అవకాశం లేకుండాపోయింది. ఈ విధంగా చెరుకు సాగు పడిపోవడంతో చక్కెర ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా పంచదార ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా మంగళవారం చక్కెర ధర మెట్రిక్ టన్నుకు రూ.37,760కు పెరిగింది. 2017 అక్టోబర్ తర్వాత చక్కెర ధరలు ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశాలకు గోధుమలు, బియ్యం ఎగుమతులను నిలిపివేసింది. రానున్న రోజుల్లో ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు చక్కెర ఎగుమతిపైనా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.
ఇథనాల్ ఉత్పత్తి ఎఫెక్ట్..
ఇథనాల్ ఉత్పత్తి పెరగడం కూడా చక్కెర ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తోంది. పెట్రోలులో ఇథనాల్ కలిపేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2025 నాటికి పెట్రోలులో 20 శాతం వరకు ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 45 లక్షల టన్నుల చెరకు రసాన్ని ఇథనాల్ కోసం తరలిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చక్కెర దిగుబడి తగ్గడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణమని అంటున్నాయి. అయితే దీనిపై చక్కెర పరిశ్రమ వర్గాల వాదన మరోలా ఉంది. ‘‘చాలావరకు చక్కెర ఉత్పత్తిలో భాగంగా వచ్చే వ్యర్థ పదార్థాలనే ఇథనాల్ కోసం ఉపయోగిస్తారు. నేరుగా చెరకు రసాన్ని తరలించేది తక్కువే’’ అని చక్కెర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొన్ని చక్కెర మిల్స్ తమ ఫోకస్‌ను ఇప్పుడు ఇథనాల్ ఉత్పత్తిపై పెట్టాయని, అందుకే ఈ ఏడాది పంచదార ఉత్పత్తి తగ్గిందని వివరిస్తున్నాయి.