అమెరికాలోని దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకుల ఎఫెక్ట్ యూరోపియన్ దేశాల్లో అధిక లావాదేవీలు నిర్వహించే క్రెడిట్ స్వీస్ పై పడింది. ఈ బ్యాంకు స్విట్జర్లాండ్ కేంద్రంగా లావాదేవీలను జరుపుతూ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద 8వ బ్యాంకింగ్ దిగ్గజంగా పేరొంది అసెట్ మేనేజ్మెంట్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. అలాంటిది తాజాగా తన బ్యాంకు షేర్లను పాతాళానికి పడిపోయే పరిస్థితికి దిగజారి పోయింది. దాదాపు 26 శాతానికిపైగా షేర్ విలువ పడిపోయినట్లు విశ్లేషకులు తాజాగా వెల్లడించారు. గత దశాబ్థకాలంగా గణించిన లాభాలన్నీ ఒక్కదెబ్బతో పతనమైయ్యాయి. గత రెండు సంవత్సరాలకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లో చాలా వరకూ తప్పులు నమోదైనట్లు క్రెడిట్ స్విస్ ప్రకటించి అందరిలో ఆందోళనకు గురిచేసింది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ ప్రభావం బీఎన్‌పీ పారిబా, కామర్జ్‌బ్యాంక్, యూబీఎస్, సొసైటి జనరల్, హెచ్‌ఎస్‌బీసీ, జేపీ మోర్గాన్, డాయిష్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీబ్యాంక్ వంటి అనేక వాటిపై తీవ్ర ప్రభావం చూపింది. యూఎస్ కు చెందిన రెండు బ్యాంకులు కుప్పకూలిపోవడం యావత్ ప్రపంచదేశాల బ్యాంకింగ్ రంగాన్నే వణికిస్తోందని చెప్పాలి. గతంలో మార్కెట్ విశ్లేషకులు చెప్పిన విధంగానే ఇలా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిచడానికి కారణాలు చాలా ఉన్నాయి.ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ఆడిటింగ్ లో విఫలం, దీని కారణంగా గణాంకాల్లో వెలువడిన తప్పులు త్వరగా గుర్తించకపోవడం. చాలా వరకూ ఆర్థిక కుంభకోణాలతో పాటూ చాలా రకాలైన నిర్వహణాల లోపాలు, తద్వారా తలెత్తిన వివాదాలు, అలాగే ఉన్నత అధికారుల, డైరెక్టర్ల మార్పు ఇవన్నీ వెరసి దీని పతనానికి కారణమయ్యాయి.
గడిచిన మూడు నెలల కాల వ్యవధిలో దాదాపు 150 బిలియన్ డాలర్ల నిధులు సంస్థ నుంచి బయటకు వెల్లడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. గత ఏడాది చివరి త్రైమాసికంలో అంటే అక్టోబర్-డిశంబర్ మధ్య జరిగిన నగదు లావాదేవీలే దీని కొంప ముంచినట్లుగా రికార్డుల్లో నమోదైన వివరాలు సూచిస్తున్నాయి. ఇన్వెస్టర్లు, అకౌంట్ హోల్డర్స్ కలిసి దాదాపు 110 బిలియన్ స్విస్ ఫ్రాంకుల్ని విత్ డ్రా చేసుకున్నారు. అంటే దీని విలువ 118 బిలియన్ డాలర్లకు సమానంగా ఉంటుంది. ఈ క్రెడిట్ స్విస్ ఆస్తుల విషయానికొస్తే 2021 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 1.6 ట్రిలియన్ల స్విస్ ఫ్రాంకులు గా ఉండేది. దీని విలువ 12.50 ట్రిలియన్ డాలర్లకు సమానంగా ఉండేది. అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వరల్డ్ వెల్త్ మేనేజ్మెంట్ కి సంబంధించిన విస్తృత స్థాయి సేవలను కూడా అందించేది. అప్పట్లో దాదాపు 50వేల పైచిలుకు ఉద్యోగులతో స్విట్జర్లాండ్లో వాణిజ్య బ్యాంకిగ్ రంగంలో అత్యున్నతమైన పేరును గణించింది.
ఇప్పటి వరకూ ఒక వైపే చూశాం. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ సంస్థల మరో కోణాన్ని తెలుసుకుందాం. సాధారణంగా స్విట్జర్లాండ్ బ్యాంకులు అంటేనే నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. మన భారతీయులు కూడా తమ బ్లాక్ మనీని దాచిపెట్టేందుకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాను తెరుస్తూ ఉంటారనే మాటలు తరచూ వింటూ ఉంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. 2002 సంవత్సరం ఫిబ్రవరిలో గార్డియన్ అనే ఒక పత్రిక కీలకమైన విషయాలను ప్రచురించింది. ఆ కథనంలో వచ్చిన వివరాలు అందరినీ ఒకింత షాక్ కి గురిచేశాయి. ఈ క్రెడిట్ స్విస్ బ్యాంకుల్లో నగదును దాచుకున్న వారిలో 30వేల మందికి పైగా నేర ప్రవృత్తి కలిగిన వారని దీని సారాంశం. ఇంకా వివరంగా చెప్పాలంటే అవినీతి, ఆక్రమణలు, మాదకద్రవ్యాలు, మనీ లాండరింగ్, అనేక తీవ్రమైన హింసలకు గురిచేసి సంపాధించిన నగదును అక్కడ భద్రపరుచుకునే వారు. అలా దాచిపెట్టిన నగదు విలువ సుమారు 100 మిలియన్ డాలర్లకు పైమాటే అని ప్రచురించింది. గతంలో చాలా కారణాలుగా గుడ్ విల్ ను కోల్పోతూ వచ్చిన ఈ క్రెడిట్ స్విస్ బ్యాంకు ఈ ఒక్క వార్తతో పూర్తి స్థాయి పెట్టుబడులు ఖాతాదారులు ఉపసంహరించుకోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.
T.V.SRIKAR