Jeera Prices: వంటలో తాళింపు పెట్టాలంటే జీలకర్ర ఉండాల్సిందే. నూనెలో వేగిన జీలకర్ర వాసన, రుచి వంటికు మరింత రుచిని అందిస్తాయి. అయితే, కొంతకాలం ఈ జీలకర్రను మర్చిపోవాల్సిందే. జీరా లేకుండానే తాళింపు పెట్టుకోవాల్సిందే. కారణం జీరా ధరలు భారీగా పెరగడమే.
దేశంలో నిత్యావసరాలు సామాన్యిడిని వణికేలా చేస్తున్నాయి. ఇప్పటికే రోజువారీ వినియోగించే టమాటా, పచ్చిమిర్చి ధరలు కొండెక్కగా.. ఇప్పుడు జీలకర్ర ధరలు అమాంతం పెరిగాయి. గతంలో కేజీ రూ.250 వరకు పలికిన జీరా.. ఇప్పుడు కేజీ రూ.1000 వరకు పలుకుతోంది. ఇటీవలి కాలంలో 300 శాతం ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సామాన్యుడు మరింత బెంబేలెత్తిపోతున్నాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా టమాటా ధర కొన్ని చోట్ల కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. పచ్చిమిర్చి ధర కూడా దాదాపు రూ.150 వరకు ఉంది. అలాగే అల్లం ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
జీరా ధరలు పెరగడానికి కారణాలు
జీలకర్ర ధరలు భారీగా పెరిగేందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. ఏడాది కాలంగా జీలకర్ర ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దేశంలో జీరాను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం. అలాగే అక్కడ గత మార్చిలో అకాల వర్షాలు భారీ స్థాయిలో కురవడంతో జీరా పంటకు తీవ్ర నష్టం వాటిల్లి, దిగుబడి తగ్గింది. ఈ వర్షాకాలం కూడా ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది. కారణం.. జీరా పంటకు వర్షాకాలం అనుకూలం కాదు. అంటే సీజన్ ముగిసే వరకు జీరా దిగుబడి పెరగదు.
దీంతో మరికొంత కాలం జీరా ధరలు ఎక్కువగానే ఉండబోతున్నాయి. కిలో జీరా వెయ్యి రూపాయలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా జీరా ఉత్పత్తి జరగాల్సి ఉన్నా గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇండ్లలో జీరా లేకుండానే సామాన్యులు వంట చేస్తున్నారు. టమాటా, పచ్చిమిర్చి, అల్లంతోపాటు, జీలకర్ర కూడా ఇప్పుడు వంటింట్లో కనిపించడం లేదు. ఇవి లేకుండానే వంటలకు సిద్ధమైపోతున్నారు సామాన్యులు. ఇక రెస్టారెంట్లలోనూ వీటి వాడకాన్ని తగ్గిస్తుండగా, కొన్నిచోట్ల ధరలు పెంచుతున్నారు.