ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకున్న క్రెడిబిలిటీ అలాంటిది. అలాంటి గొప్ప సంస్థలో లంచావతారాలు చొరబడ్డారు. సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా డబ్బులకు కక్కుర్తి పడ్డారు. టాటా గ్రూప్‌లో అంతర్భాగంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ టీసీఎస్‌లో వెలుగులోకి వచ్చిన క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
టీసీఎస్‌లో అసలేం జరిగింది ?
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ అండ్ కన్సల్టింగ్ కంపెనీగా టీసీఎస్‌కు మంచి పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాల్లో 150 లొకేషన్లలో టీసీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న అతి తక్కువ ఇన్నోవేటివ్ కంపెనీల్లో టీసీఎస్ మొదటి స్థానంలో ఉంటుంది. టీసీఎస్‌కు 6 లక్షల మంది ఉద్యోగులున్నారు. కెరీర్ ప్రారంభంలో చాలా మంది టీసీఎస్‌లో జాబ్ వస్తే ఇక లైఫ్ సెటిల్ అయిపోయింది అని భావిస్తారు. ఇలాంటి సంస్థలో పనిచేస్తున్న కొంతమంది.. డబ్బులకు కక్కుర్తి పడి ఉద్యోగాలను అమ్మడం మొదలు పెట్టారు. కొంతమంది వ్యక్తుల నుంచి సంస్థల నుంచి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలు కల్పించినట్టు సంస్థ విచారణలో వెలుగులోకి వచ్చింది. విలువలకు, సిద్ధాంతాలకు పెట్టింది పేరైన టాటా గ్రూప్‌లో ఇలా కూడా జరుగుతుందా అంటూ ప్రపంచం ముక్కున వేలేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు దారి తప్పిన ఉద్యోగులు.
లంచాల వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది ?
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో టీసీఎస్ ఉన్నతాధికారులకు రెండు ఫిర్యాదులు అందాయి. సంస్థ నియమ నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఉద్యోగులు అడ్డదారిలో సంపాదిస్తున్నారని… టీసీఎస్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు భారీగా ముడుపులు తీసుకుంటున్నారన్నది ఆ ఫిర్యాదుల సారాంశం. కంప్లైంట్ చేసిన వాళ్లు కూడా బయట వ్యక్తులు కాదు. టీసీఎస్‌లో పనిచేస్తున్న వాళ్లే. అన్నం పెట్టిన సంస్థకే సున్నం రాసే వాళ్ల భరతం పట్టేందుకు కొంతమంది విజిల్ బ్లోవర్ గా మారి అవినీతిపరుల నిర్వాహకాలను పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన టీసీఎస్ బృందం… షాకింగ్ నిజాలను బయటపెట్టింది. కొన్ని బిజినెస్ అసోసియేట్ సంస్థలకు ప్రయోజనం కల్గించేలా… ఆరుగురు ఉద్యోగులు ముడుపులు తీసుకున్నట్టు నిర్ధారించింది.
ఆ ఆరుగురు అవినీతి ఉద్యోగులు అసలేం చేశారు ?
టాటా కన్సెల్టెన్సీ సర్వీస్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు అందిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీ. ఇప్పటికే ఆరు లక్షల మంది ఉద్యోగులు ఉన్నా… ప్రాజెక్టులను , టాస్క్ లను పూర్తి చేసేందుకు టీసీఎస్‌కు పెద్ద సంఖ్యలో మ్యాన్ పవర్ అవసరమవుతుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ నేరుగా ఉద్యోగులను నియమించుకోవడం టీసీఎస్‌కు సాధ్యపడదు. ఒక్కోసారి కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద కూడా ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి అవసరాలను తీర్చేందుకు టీసీఎస్ ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా రిక్రూటింగ్ సంస్థలతో పనిచేస్తోంది. వీటినే బిజినెస్ అసోసియేట్స్ అంటారు. ఇలాంటి ఆరు బిజినెస్ అసోసియేట్స్ తో ఉద్యోగాల విషయంలో ఒప్పందం చేసుకునేందుకు ఆరుగురు టీసీఎస్ సిబ్బంది బేరరాసాలు కుదుర్చుకున్నారు. ఆ సంస్థలకే కాంట్రాక్ట్ వచ్చేలా భారీగా ముడుపులు అందుకున్నారు. అంటే సంస్థ నిబంధనలకు విరుద్ధంగా… తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని బిజినెస్ అసోసియేట్స్ తో డబ్బులు తీసుకుని మరీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇది ముమ్మాటికీ సంస్థను మోసం చేయడమే. ఇక్కడ అదే జరిగింది.
అవినీతి ఉద్యోగులపై టీసీఎస్ ఏమంటోంది ?
ఇంత జరిగిన తర్వాత టీసీఎస్ మేనేజ్‌మెంట్ మౌనంగా ఉండే అవకాశం లేదు. ఉద్యోగాల కుంభకోణానికి పాల్పడిన ఆరుగురు ఉద్యోగులపైన టీసీఎస్ యాజమాన్యం బ్యాన్ విధించింది. వాళ్లు ముడుపులు తీసుకున్న ఆరు సంస్థలపైనా నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఆర్డర్ పాసే చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఉద్యోగులపైనా అంతర్గతంగా విచారణ చేపట్టింది. వాళ్ల పాత్ర ఉన్నట్టు తేలితే వాళ్లపైనా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.
వివరణ ఇచ్చుకున్న చంద్రశేఖరన్
టీసీఎస్‌లో జరిగిన ఉద్యోగుల స్కామ్‌పై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ షేర్ హోల్టర్స్‌కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఉద్యోగుల అవినీతి వ్యవహారం తనతో పాటు మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా కలిచి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ అంటే లాభాలు కాదని.. నైతిక నియమావళి అని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని షేర్ హోల్టర్స్ కు హామీ ఇచ్చారు.