Tesla: ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా ఉన్న అమెరికాకు చెందిన టెస్లా సంస్థ భారత్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని కార్ లవర్స్ అందరూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే దిగుమతి పన్నులు తగ్గిస్తేనే భారత్‌లో అడుగుపెడతామంటూ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ అప్పట్లో కండిషన్స్ పెట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంది. అమెరికాలోనో, చైనాలోనో టెస్లా కార్లను తయారు చేసి వాటిని మా దేశంలో అమ్ముకోవడం కాదు.. భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరుతోంది. ఎలాన్ మస్క్ అందుకు అంగీకరిస్తే పన్నులో కోత పెట్టడం కూడా ఆలోచిస్తామంటూ తెగేసి చెప్పింది. 2019 నుంచి భారత ప్రభుత్వానికి-టెస్లాకు మధ్య ఈ పీటముడి వీడలేదు. అయితే కొన్ని రోజుల క్రితం ఎవరికంటా పడకుండా టెస్లా ప్రతినిధులు భారత్ వచ్చారు. పీఎంవో అధికారులతో పాటు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు. ఆ తర్వాతే సీన్ మొత్తం మారిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో టెస్లా కార్ల తయారీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు మస్క్ పరోక్షంగా ప్రకటించారు. దీంతో టెస్లా ఇండియా ఎంట్రీ అన్నది ఇక లాంఛనంగా మారిపోయింది.
ఎలాన్ మస్క్ ఇండియా వైపు ఎందుకు చూస్తున్నారు ?
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, వినియోగం ఉన్న భారత్‌లాంటి దేశాల్లో వ్యాపారాన్ని ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు? అయితే మొన్నటి వరకు దిగుమతి పన్నుల విషయంలో మొండిపట్టుతో ఉన్న ఎలాన్ మస్క్ ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారన్నదే అసలు ప్రశ్న. కేంద్రం ఎలాంటి రాయితీలు ఇస్తుంది.. దిగుమతి పన్నులను ఎంతమేరకు తగ్గిస్తుంది వంటి అంశాల జోలికి వెళ్లకుండానే మస్క్ ఇండియా కోసం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో బ్లూ ప్రింట్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. భారత్ దిశగా ఎలాన్ మస్క్ ఆలోచనలు ఇంత సూపర్ ఫాస్ట్‌గా మారడానికి ఒకే ఒక్క కారణం యాపిల్ సంస్థ.
యాపిల్-టెస్లా-ఇండియా.. లింకేంటి..?
భారత శక్తి సామర్థ్యాలను కొంతమంది తక్కువగా అంచనా వేస్తారు. మన దేశంలో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటే.. భారీగా లాభపడొచ్చని తెలిసినా ఒక్కోసారి వెనకడుగు వేస్తూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం వరకు యాపిల్ సంస్థ కూడా అలాగే ఆలోచించింది. ఇండియన్ మార్కెట్‌కున్న పొటెన్షియాలిటీ ఏంటో తెలుసుకోవడానికి యాపిల్‌కు 15ఏళ్లు పట్టింది. 2008లో ఐఫోన్ 3జీ మోడల్‌ను భారత్‌లో అమ్మడం మొదలు పెట్టిన యాపిల్ సంస్థ ఇవాళ భారత్‌లోనే ఐఫోన్లను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది జనవరిలో వంద కోట్ల డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను భారత్ నుంచి ఎగుమతి చేసిన ఏకైక కంపెనీగా చరిత్ర సృష్టించింది. బెంగళూరు, చెన్నైల్లో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్లను పెట్టడమే కాదు.. ఢిల్లీ, ముంబైలో రిటైల్ స్టోర్లను కూడా ఏర్పాటు చేసింది. ఐఫోన్ల తయారీకే కాదు.. ఐఫోన్లకు అతిపెద్ద మార్కెట్‌గా భారత్ మారిపోయింది. మన దేశంలో తయారైన ఐఫోన్లను ప్రపంచం వాడుతుందంటే ఇండియన్ మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెస్లా అధినేత మస్క్ మొండి పట్టు వీడి భారత్ వైపు చూడటానికి కూడా యాపిల్ సక్సెస్ స్టోరీనే కారణం. ఇప్పటికే ప్రపంచంలో ఎలక్ట్రానిక్ కార్ల తయారీలో రారాజుగా ఉన్న మస్క్‌కు ఇండియాలో ఎంట్రీ ఇస్తే కలిగే ప్రయోజనాలేంటో అర్థమైంది. అందుకే పన్నులు, రాయితీలు అంటూ నస పెట్టకుండా ఇండియాలో టెస్లా ప్రొడక్షన్‌ను ఎంత త్వరగా ప్రారంభించాలా అని మస్క్ ప్లాన్ చేస్తున్నారు. భారత్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తే ఇతర ఆటోమొబైల్ పరిశ్రమలకు ఇచ్చినట్టే రాయితీలు ఇస్తామని కేంద్రం భరోసా ఇవ్వడంతో మస్క్ ముందడుగు వేస్తున్నారు. అందుకే అమెరికా వెలుపల చైనా తర్వాత ఎలాన్ మస్క్ చూపులన్నీ భారత్ వైపే ఉన్నాయి.
టెస్లాతో భారత్‌లో విప్లవమే..!
టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారత్‌లో దూసుకెళ్లడం మొదలుపెడితే వివిధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోవడం ఖాయం. ముఖ్యంగా ఆటోమోటివ్ ఇండస్ట్రీతో పాటు ఎనర్జీ సెక్టార్‌లో గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంటుంది. దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా వ్యవస్థను, కాలుష్య రహిత వాతావరణాన్ని సృష్టించేందుకు భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ లక్ష్యాలను అందుకునేందుకు టెస్లా ఉపయోగపడుతుంది. ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేసే టెస్లా.. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌ను డామినేట్ చేసే స్థాయికి ఎదగడమే కాదు.. రవాణా రంగం వల్ల ఏర్పడుతున్న కాలుష్యకారకాలను నియంత్రించడంలోనూ తనదైన పాత్ర పోషిస్తుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు కాలం చెల్లిపోయి.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం పరుగులు పెడుతున్న సమయంలో.. టెస్లా ఎలక్ర్టిక్ వెహికల్స్ ఇండియా గేమ్ చేంజర్‌గా మారబోతున్నాయి.
టెస్లా కార్లు ఎందుకంత ప్రత్యేకం ?
ప్రపంచంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి. కానీ టెస్లా అన్నింటికంటే భిన్నమైంది. టెస్లా కార్లకున్న ఆధునిక సౌకర్యాలు మరే ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు లేవనే చెప్పాలి. వాట్ మేక్స్ టెస్లా సో స్పెషల్ అని మస్క్‌ని అడిగితే ఇవిగో ఇవే స్పెషల్స్ అంటూ పెద్ద లిస్టే చదువుతారు. డిజైన్, బ్యాటరీ ఛార్జింగ్, వైర్‌లెస్ అప్ డేట్స్, ఒక్కటేంటి.. టెస్లా అంటేనే సంథింగ్ స్పెషల్. జీరో యాక్సిడెంట్స్‌కు అవకాశం కల్పించేలా టెస్లా అన్ని ఎలక్ట్రిక్ కార్లు ఆటో పైలెట్ మోడ్‌తో తయారవుతాయి. ఈ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్.. ప్రమాదాల నివారణకు చాలా ఉపయోగపడుతుంది. టెస్లా తయారు చేసే అన్ని కార్లు బయో వెపన్ డిఫెన్స్ మోడ్‌తో వస్తాయి. ప్రమాదకరమైన కెమికల్స్ కారులోకి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇక అడ్వాన్స్ డ్ పార్కింగ్ సెన్సార్లతో పార్కింగ్ చేయడం అన్నది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే టెస్లా కార్ల ముందు మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు పనికిరావానే చెప్పాలి. అందుకే వరల్డ్ వైడ్‌గా టెస్లాకు అంత డిమాండ్ ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో టెస్లా కార్లు తయారవుతాయా ?
ఏమో గుర్రం ఎగరావచ్చు..! టెస్లా కార్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే తయారై దేశ వ్యాప్తంగా దూసుకుపోవచ్చు. దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల కంపెనీ అనంతపురంలో కార్లు తయారీ చేస్తుందని ఎవరైనా ఊహించారా. మేడ్ ఇన్ ఇండియా కాదు.. మేడ్ ఇన్ అనంతపురం కియా కార్లు.. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన దేశంలో అడుగుపెట్టేందుకు టెస్లా ఆలోచిస్తుందని తెలియగానే ముందుగా మస్క్‌కు ఆహ్వానం పంపింది తెలంగాణ ప్రభుత్వమే. భారత్‌లో వ్యాపారం చేసుకోవడానికి తెలంగాణ కేంద్రంగా ఉందని.. తమ రాష్ట్రంలో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ గతేడాది జనవరిలోనే మస్క్‌ను కోరారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు కూడా టెస్లాను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మనదేశంలో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న మస్క్.. ఏరాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకుంటారన్నది చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే మనకు గర్వకారణమే. ఇతర రాష్ట్రాల్లో పెట్టినా.. భారత్‌కు టెస్లా పెద్దవరమే. టెస్లా రాకతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉద్యోగవకాశాలు లక్షల్లో పెరుగుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతారు.