Tupperware: టప్పర్‌వేర్ ఇక కనిపించదా? దివాళా అంచున కంపెనీ.. కారణమేంటి?

ఏడు దశాబ్దాలకుపైగా మార్కెట్లో తన హవా సాగించిన టప్పర్‌వేర్ సంస్థ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది. తీవ్ర నష్టాలతో కంపెనీ దివాళా తీసే పరిస్థితిలో ఉంది. టప్పర్‌వేర్ ఉత్పత్తుల విక్రయాలు పడిపోయాయి. కంపెనీ షేర్లు పతనమయ్యాయి.

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 07:06 PM IST

Tupperware: ఇంట్లో వాడే ప్లాస్టిక్ కంటైనర్స్, లంచ్ బాక్స్‌లు వంటి వాటిలో టాప్ బ్రాండ్ ఏదీ అంటే అందరూ టక్కున చెప్పే సమాధానం టప్పర్‌వేర్. ఆఫీసులకు లంచ్ బాక్సులు పట్టుకెళ్లే వాళ్లలో ఎక్కువ మంది ఫేవరెట్ బ్రాండ్ కూడా ఇదే.ఏడు దశాబ్దాలకుపైగా మార్కెట్లో తన హవా సాగించిన టప్పర్‌వేర్ సంస్థ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది. తీవ్ర నష్టాలతో కంపెనీ దివాళా తీసే పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టప్పర్‌వేర్ పరిస్థితి నిజమేనా? దీనికి కారణాలేంటి? తెలుసుకుందాం..
ఇంటింటికీ తిరిగి విక్రయం
అమెరికాకు చెందిన కంపెనీ టప్పర్‌వేర్. ఎర్ట్ టప్పర్ అనే వ్యక్తి ఈ కంపెనీని స్థాపించారు. అయితే, బ్రౌనీ వైస్ అనే మహిళ ఈ కంపెనీ విక్రయాలు పెంచి, ఇది విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. టప్పర్‌వేర్ సంస్థ ప్లాస్టిక్ కంటైనర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వంటి ఉత్పత్తుల తయారీలో 1950వ దశకం నుంచి ఉంది. 1950, 60ల నుంచే మంచి ఆదరణ దక్కించుకుంది. ఎయిర్ టైట్, వాటర్ టైట్ ఉత్పత్తుల్ని తయారు చేసేది. నాణ్యత పాటించేది. గాలి చొరబడకపోవడం వల్ల వీటిలో దాచి ఉంచిన ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేవి. లీకేజీ సమస్యలూ ఉండేవి కావు. ప్రారంభంలో ఇంటింటికీ తిరిగి ఉత్పత్తుల్ని విక్రయించేది. తర్వాత నెమ్మదిగా ఈ పద్ధతిని ఆపేసింది. మొదట్లో ఉన్నత వర్గాల వారికే చేరువైన ఈ బ్రాండ్ తర్వాత అన్ని వర్గాల వారికి అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో కొత్త రకం ఉత్పత్తుల్ని అందుబాటులోకి తెస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంది. కొన్నేళ్లక్రితం టప్పర్‌వేర్ ఉత్పత్తుల్ని మిరాకిల్ ఉత్పత్తులుగా చూసేవాళ్లు.


కాలానుగుణంగా మారని సంస్థ
కాలానుగుణగా మారడంలో టప్పర్‌వేర్ విఫలమైందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఉత్పత్తుల్ని నేరుగా విక్రయించే విషయంలో సంస్థ అనుసరిస్తున్న విధానం ఇప్పుడు సత్ఫలితాల్నివ్వడం లేదు. ఫలితంగా కొంతకాలం నుంచి విక్రయాలు పడిపోయాయి. అయితే, వినియోగదారుల్ని తిరిగి ఆకట్టుకోవడం కోసం సంస్థ కొత్త పద్ధతుల్ని అనుసరించింది. ఇతర వేదికల ద్వారా ఉత్పత్తుల్ని అమ్మడం ప్రారంభించింది. అలాగే కొత్త మోడల్స్ తీసుకొచ్చింది. కానీ, ఇవి చాలా ఆలస్యంగా మొదలుపెట్టింది. ఒక దశాబ్దం ముందుగా ఈ పని చేసుంటే కంపెనీ ప్రస్తుతం మంచి స్థితిలో ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు.

కోవిడ్ తర్వాతి పరిణామాల వల్ల కంపెనీ కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ, అది తాత్కాలికంగా మాత్రమే. ఆ తర్వాత నుంచి మళ్లీ టప్పర్‌వేర్ విక్రయాలు పడిపోయాయి. వ్యాపార విధానాల్లోనూ, ప్రోడక్టుల్లోనూ 10-20 ఏళ్లుగా కొత్తదనం చూపించకపోవడం కూడా కంపెనీ పతనానికి ఒక కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. అలాగే వినియోగదారులు కూడా ప్లాస్టిక్ బదులు పర్యావరణహితమైన ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతుండటం కూడా దీనికి ఒక కారణం. పోటీ కంపెనీలు కొత్త ఉత్పత్తులతో వినియోగదారులకు చేరవవుతున్నాయి. ఇతర సంస్థల ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తుండటంతో వినియోగదారులు అటువైపే మొగ్గుచూపుతున్నారు.
నిధులు సమకూరితేనే!
ప్రస్తుతం కంపెనీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. టప్పర్‌వేర్ ఉత్పత్తుల విక్రయాలు పడిపోయాయి. కంపెనీ షేర్లు పతనమయ్యాయి. నిధులు సమకూరకపోతే వ్యాపారం నుంచి తప్పుకొంటామని, కంపెనీ మూసేస్తామని టప్పర్‌వేర్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడాలంటే భారీగా నిధులు అవసరం. రుణాలు లేదా పెట్టుబడులు కావాల్సి ఉంది. అవసరమైనన్ని నిధులు అందితే కంపెనీ ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంది. లేదంటే ఏడు దశాబ్దాల టప్పర్‌వేర్ చరిత్ర కనుమరుగవుతుంది.