Twitter: ట్విట్టర్‌లో ఇకపై సినిమా చూడొచ్చు.. రెండు గంటల వీడియో అప్‌లోడ్ చేసే ఛాన్స్.. నెటిజన్ల ఆగ్రహం

ట్విట్టర్‌లో రెండు గంటల వీడియోకు అనుమతివ్వడం అంటే దీన్ని ఇకపై పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాంగా కూడా మార్చినట్లే. తాజాగా మస్క్ ఈ విషయం గురించి వెల్లడిస్తూ రెండు గంటలు లేదా 8 జీబీ వీడియోను ట్విట్టర్‌లో అప్‪లోడ్ చేయొచ్చని ఎలాన్ మస్క్ చెప్పారు.

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 05:46 PM IST

Twitter: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చాక ఆ సంస్థ పరిస్థితి ఎవరికీ అర్థం కాకుండా ఉంది. మస్క్ తీసుకుంటున్న గందరగోళ నిర్ణయాలే ఇందుకు కారణం. ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీచర్, లాంగ్ ట్వీట్స్, యాడ్స్.. ఇలా ఏవేవో కొత్త మార్పులు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఏదోలా నడిచింది కానీ.. మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్‌లో రెండు గంటల వీడియోను అప్‪లోడ్ చేసేలా కొత్త అప్‌డేట్ తీసుకురావడమే నెటిజన్ల ఆగ్రహానికి కారణం.
ఓటీటీగా మారుస్తారా?
ట్విట్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాం కాదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం. యూజర్లు తమ అభిప్రాయాలు, సమాచారం చేరేవేసేందుకే ఎక్కువగా వాడుతారు. అయితే, అందులో వినోదం కూడా ఉండొచ్చు. కానీ, ట్విట్టర్‌లో రెండు గంటల వీడియోకు అనుమతివ్వడం అంటే దీన్ని ఇకపై పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాంగా కూడా మార్చినట్లే. తాజాగా మస్క్ ఈ విషయం గురించి వెల్లడిస్తూ రెండు గంటలు లేదా 8 జీబీ వీడియోను ట్విట్టర్‌లో అప్‪లోడ్ చేయొచ్చని చెప్పారు. గతంలో ఇది రెండు నిమిషాల ఇరవై సెకండ్లు మాత్రమే ఉండేది. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లకు వీడియో నిడివి గంటకు పెంచారు. ఇప్పుడు దీన్నే రెండు గంటలకు పెంచారు. అయితే, ట్విట్టర్‌లో ఇలా రెండు గంటల వీడియో పెట్టేలా మార్చడం నెటిజన్లకు నచ్చడం లేదు.

రెండు గంటల వీడియో అంటే చాలా సినిమాల్ని కూడా అప్‪లోడ్ చేయొచ్చు. వెబ్ సిరీస్‌ ఎపిసోడ్లు కూడా పెట్టొచ్చు. దీనివల్ల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్, ఓటీటీల్లో చూసే కంటెంట్‌ను ఇక్కడే చూసేస్తారు. దీంతో పైరసీ కూడా పెరిగిపోతుంది. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఫలితంగా అనేక అకౌంట్లు బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా మస్క్ ఇలా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ట్విట్టర్‌ను ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ మస్క్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంతగా పైరసీకి కారణమవుతుంది అనేందుకు ఒక ట్విట్టర్ యూజర్ హాలీవుడ్ మూవీని పైరసీ చేసి అప్‌లోడ్ చేయడమే ఉదాహరణ. చాలా మంది ఈ ఫీచర్‌ను వ్యతిరేకిస్తున్నారు. కొందరు మాత్రం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. క్లౌడ్ స్టోరేజ్ కొనుక్కునే బదులు ఇలా ట్విట్టర్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తే చాలు అంటున్నారు ఇంకొందరు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.