US Debt Ceiling Crisis: అమెరికా దివాళా తీస్తుందా? జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో అగ్రరాజ్యం!

ప్రభుత్వ అప్పు పరిమితి పెంచకుంటే జూన్ నెల నుంచి ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ స్వయంగా చెప్పారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ఇప్పటికే అమెరికా అప్పు గరిష్ట స్థాయికి చేరుకోగా, అప్పు పరిమితిని పెంచాలని జో బైడెన్ (డెమొక్రటిక్) ప్రభుత్వం కోరుతోంది.

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 06:23 PM IST

US Debt Ceiling Crisis: అగ్రరాజ్యం అమెరికా దివాళా అంచున ఉంది. అప్పులు తీసుకుంటే తప్ప ప్రభుత్వం మనుగడ సాగించలేని స్థితికి చేరుకుంది. ప్రభుత్వ అప్పు పరిమితి పెంచకుంటే జూన్ నెల నుంచి ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోతాయని అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ స్వయంగా చెప్పారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ఇప్పటికే అమెరికా అప్పు గరిష్ట స్థాయికి చేరుకోగా, అప్పు పరిమితిని పెంచాలని జో బైడెన్ (డెమొక్రటిక్) ప్రభుత్వం కోరుతోంది. దీనికి రిపబ్లికన్లు అడ్డుపడుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో బైడెన్ ప్రభుత్వం ఉంది.
ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు అప్పులు చేస్తుంటాయి. బాండ్లు విడుదల చేసి వాటి ద్వారా అప్పులు చేస్తుంటాయి. అప్పు చెల్లించేంత వరకు వడ్డీలు చెల్లిస్తుంటాయి. అనేక దేశాల్లాగే అమెరికా కూడా ఇదే చేస్తోంది. తన అవసరాల కోసం వివిధ మార్గాల్లో అప్పులు తీసుకుంది. ఇప్పటికే అప్పులు దేశ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిబంధనల ప్రకారం ఇంకా అప్పు తీసుకోవడానికి వీల్లేదు. అలాగని అమెరికాలో ఇప్పుడు అప్పు తీసుకోకుంటే ప్రభుత్వం నడిచే అవకాశం లేదు. ఇదే అమెరికాను ఇబ్బంది పెడుతోంది. అప్పుల విషయంలో ప్రతి దేశానికీ నిర్దిష్ట నిబంధనలు ఉంటాయి. లేకుంటే ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తుంటే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. అందుకే దేశంలోని నిబంధనల ప్రకారమే అప్పులు తీసుకోవాలి. అప్పుల విషయంలో నిబంధనల్ని అమెరికా వందేళ్ల క్రితమే రూపొందించింది. అయితే, అవసరాల కోసం ఇప్పటివరకు 78 సార్లు ఈ నిబంధనల్ని మార్చుకుంటూ అప్పుల పరిమితి పెంచుకుంటూ వస్తోంది. ఈసారి మాత్రం ఇలా నిబంధనలు మార్చి, అదనంగా అప్పు చేసేందుకు అమెరికా ప్రతినిధుల సభ అంగీకరించడం లేదు. అమెరికా ప్రతినిధుల సభలో అధికార డెమొక్రటిక్ సభ్యుల కంటే ప్రతిపక్ష రిపబ్లిక్ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. వాళ్లు అంగీకరిస్తేనే అదనంగా అప్పు తీసుకోవచ్చు. కానీ, దీనికి రిపబ్లికన్లు ఒప్పుకోవడం లేదు. ఖర్చులు తగ్గించుకోమని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
28.5 ట్రిలియన్ డాలర్ల అప్పు
అమెరికా 2021 నాటికి 28.5 ట్రిలియన్ డాలర్ల అప్పు తీసుకుంది. మొత్తం అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్ డాలర్లు. అంటే ఇంకా మూడు ట్రిలియన్ డాలర్ల అప్పు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంది. కానీ, ఇంకా అప్పు కావాలని జో బైడెన్ భావిస్తున్నాడు. ఇప్పటికి తీసుకున్న అప్పు మొత్తం దేశ జీడీపీ కంటే 24 శాతం ఎక్కువ కావడం విశేషం. అప్పు విషయంపై ఇంకా బైడెన్, రిపబ్లికన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో అమెరికా ఎన్నో సంక్షోభాల్ని ఎదుర్కొన్నా ప్రభుత్వ చెల్లింపులు జరపలేని స్థితి మాత్రం ఎప్పుడూలేదు. ఈ సారి అప్పులు రాకపోతే.. చెల్లింపులు ఆగిపోతే.. ఈ పరిస్థితి అమెరికాకు తొలిసారి అవుతుంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న అమెరికాకు ఇది మరో ఎదురుదెబ్బ అవుతుంది. అన్నింటికీ మంచి బైడెన్ పాలనకు పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే బైడెన్ ప్రభుత్వం మరిన్ని అప్పులు చేసేందుకు అమెరికా ప్రతినిధుల సభ అంగీకరించాలి.