స్టాక్‌మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. పూర్తి అవగాహన ఉన్నవారికి కూడా మార్కెట్లు ఓ పట్టాన అర్థం కావు. పైగా గత కొన్ని రోజులుగా మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులను చూస్తే మదుపరులు అసలు మార్కెట్ వైపు చూడాలంటే భయపడుతున్నారు. అలాంటి వారికోసం రకరకాల పెట్టుబడి మార్గాలున్నాయి…
మ్యూచ్‌వల్ ఫండ్స్:
మ్యూచ్‌వల్‌ఫండ్స్‌లో ఒకేసారి పెట్టుబడులు పెట్టొచ్చు… లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడులు ఇస్తాయి. ఇస్తున్నాయి కూడా. కానీ రాబడికి ఎలాంటి గ్యారెంటీ ఉండదు.. గత కొన్నేళ్లుగా చూస్తే మంచి ఫండ్స్.. భారీ రాబడులనే సాధించి పెట్టాయి. కొన్ని అయితే ఏడాదికి 20శాతానికి పైగా రిటర్న్ లు ఇచ్చినవే ఉన్నాయి. అయితే వీటికి నష్టభయం ఉంటుంది. రిస్క్ తీసుకోవాలో వద్దో ఇన్వెస్టర్లే ఆలోచించుకోవాలి. నెలకో వందతో కూడా సిప్ స్టార్ట్ చేయవచ్చు.
కార్పొరేట్ బాండ్స్:
మీకు స్థిరమైన ఆదాయం రావాలంటే కార్పొరేట్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టొచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు వీటిని ట్రై చేయవచ్చు. కొన్ని బాండ్స్ 11శాతం వరకు రాబడిని ఇస్తున్నాయి. ఇది ఫిక్స్్డ్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ. లిస్టెడ్, మంచి రేటింగ్ ఉన్న కార్పొరేట్ బాండ్స్ ఎంచుకుంటే సరిపోతుంది.
ఫిక్స్ డ్ డిపాజిట్:
మనందరికీ తెలిసిన సంప్రదాయ పెట్టుబడి సాధనం ఇది. పెట్టుబడి సురక్షితం.. పక్కా రాబడి.. ఇక సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ వడ్డీరేటు. ఎంత పెట్టుబడి పెడుతున్నా ఎన్నేళ్ల తర్వాత వడ్డీతో కలిపి ఎంత వస్తుందన్నది పక్కాగా ఉంటుంది. అయితే ఇందులో ఉన్న చిక్కల్లా వడ్డీరేట్లు కాస్త తక్కువగా ఉండటం. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేంత రాబడి వీటినుంచి మనం ఆశించలేం. ఇటీవల వడ్డీరేట్లు పెంచడంతో ఇది కాస్త ఆకర్షణీయంగా మారింది. కాస్త అటూ ఇటుగా ఏడున్నరేళ్లకు పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఇక మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్ డ్ డిపాజిట్లను పరిగణలోకి తీసుకుంటే అవి కూడా 7శాతం రాబడిని అందిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్:
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా మంచి రాబడినే ఇస్తాయి. మనం స్థలం కొనడం, అమ్మడం చేయాల్సిన పనిలేదు. డిజిటల్ ఫ్లాట్ఫామ్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇక డిజిటల్ గోల్డ్ ను కూడా ట్రై చేయవచ్చు. ఆన్ లైన్ లోనే బంగారం కొనొచ్చు. కస్టమర్ల తరపున కంపెనీలే బంగారం కొని వాల్టుల్లో భద్రంగా బంగారాన్ని దాస్తాయి. ఒక్క రూపాయితో అయినా బంగారం కొనొచ్చు… ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎంతుంటే అంత కొనుక్కోవచ్చు. గోల్డ్ ఫండ్స్ తో పాటు వెల్త్ బాండ్స్ లోనూ మదుపు చేసే అంశాన్ని పరిశీలించొచ్చు.
పీర్ టు పీర్ లెండింగ్:
ఇటీవల బాగా పాపులర్ అవుతున్న మరో పెట్టుబడి సాధనం పీర్ టు పీర్ లెండింగ్. మీ దగ్గర డబ్బుంది.. వేరొకరికి అవసరం ఉంటుంది. మీ డబ్బును వారికి సమకూరుస్తారు. మీకు ఎఫ్ డీల కంటే ఎక్కువ రాబడి ఇస్తారు. దీనికి సంబంధించి కొన్ని ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్్లు కూడా ఉన్నాయి. ఇది కాస్త రిస్కీ ఆప్షనే…
స్టార్టప్ ఈక్విటీ:
హైరిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే వారికోసం మరో బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ స్టార్టప్ ఈక్విటీ. అంటే అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం. ఇందులో రిస్క్ ఎక్కువ. రివార్డ్ కూడా ఎక్కువ. గతంలో పెద్దపెద్ద సంస్థలు, ఫైనాన్షియర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు తక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టించే మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కనీసం 2లక్షల పెట్టుబడి కూడా పెట్టొచ్చు.. కానీ ముందే చెప్పినట్లు ఇందులో గ్యారెంటీ ఉండదు. కానీ మంచి స్టార్టప్ ను ఎంచుకుంటే మాత్రం పెట్టుబడి కొండంత రాబడిని సంపాదించడం మాత్రం ఖాయం.
ఒకప్పుడు మనకు తెలిసింది పోస్టాఫీసుల్లోనో, బ్యాంకుల్లోనో ఎకౌంట్లలో ఉంచుకోవడం. ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం. లేదా బంగారం కొనడం. కానీ ఇప్పుడు రకరకాల పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. సంప్రదాయ విధానాలకు భిన్నంగా మంచి రాబడిని అందిస్తున్నాయి. కొన్నింటిలో నష్టభయం ఉంటే కొన్నింటిలో రాబడికి గ్యారెంటీ ఉంటుంది. రిస్క్ చేస్తే మాత్రం మంచి రాబడి వస్తుంది. అయితే ఎందులో పెట్టుబడులు పెట్టాలన్నది మనమే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎవరో చెప్పారని కష్టార్జితాన్ని పాడు చేసుకోవద్దు.. తెలివిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి…
(KK)