Budvel Auction: బుద్వేల్ వేలం హిట్టా.. ఫట్టా..? ఆ వివరాలు రహస్యమెందుకు..?

తెలంగాణ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి భూములు అమ్మేస్తోంది. ఇటీవల కోకాపేట నియోపొలిస్‌లో రెండో దశ అమ్మకం పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా బుద్వేల్‌లో వంద ఎకరాలను వేలం వేసింది. రెండు సెషన్స్‌లో జరిగిన ఈ వేలంలో ప్రభుత్వానికి రూ.3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే సగటున ఎకరం రూ.36.25 కోట్లు పలికిందన్నమా

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 11:04 AM IST

Budvel Auction: హెచ్ఎండీఏ బుద్వేల్‌లో నిర్వహించిన వేలం అనుకున్న స్థాయిలో విజయవంతమైందా..? లేదా..? ప్రభుత్వం ఆశించిందెంత.. వచ్చిందెంత..? కోకాపేట స్థాయిలో బుద్వేల్‌ భూములకు రేటు రాలేదెందుకు..? దీని వెనుక ఏమైనా గాంబ్లింగ్ ఉందా..?
తెలంగాణ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి భూములు అమ్మేస్తోంది. ఇటీవల కోకాపేట నియోపొలిస్‌లో రెండో దశ అమ్మకం పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా బుద్వేల్‌లో వంద ఎకరాలను వేలం వేసింది. రెండు సెషన్స్‌లో జరిగిన ఈ వేలంలో ప్రభుత్వానికి రూ.3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే సగటున ఎకరం రూ.36.25 కోట్లు పలికిందన్నమాట.
కోకాపేటలో అలా.. బుద్వేల్‌లో ఇలా..!
కోకాపేట నియోపొలిస్‌లో ఒక ఎకరం వంద కోట్ల రూపాయలకు పైనే పలికింది. మిగిలిన భూములు కూడా ఎకరం రూ.70-80 కోట్లు పలికాయి. బుద్వేల్ భూములు కూడా భారీ రేట్లు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కనీసం ఎకరా రూ.50-60కోట్ల వరకు పలకొచ్చని భావించింది. కానీ సగటున పలికింది రూ.36కోట్లే.. అత్యధికంగా ఎకరా రూ.41.75 కోట్లకు అమ్ముడు పోయింది. సగటున ఎకరం రూ.50-55 పలికినా కాస్త అటూ ఇటుగా ఐదున్నర వేల కోట్ల వరకూ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ వచ్చింది రూ.3,625కోట్లు మాత్రమే. అంటే ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే రెండువేల కోట్లు తక్కువ వచ్చాయి.
ఎందుకంత తక్కువ రేట్..?
కోకాపేట రేటు చూశాక ఎవరైనా బుద్వేల్ భూములపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ తక్కువ పలకడానికి పలు కారణాలున్నట్లు చెబుతున్నారు. అందులో మొదటిది కోకాపేట భూములను అభివృద్ధి చేసిన స్థాయిలో ఇక్కడ చేయలేదంటున్నారు. కోకాపేటతో పోల్చితే ఈ భూములు కాస్త దూరంగా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డర్లు కోకాపేటలో భూములు కొనేశారు. దీంతో వెంటనే బుద్వెల్‌పై ఫోకస్ పెట్టలేదని మరికొందరు చెబుతున్నారు. కానీ మిగిలిన బిల్డర్లు ఎందుకు దానిపై అంత దృష్టి పెట్టలేదన్నది పెద్ద ప్రశ్న. హైదరాబాద్‌లో మెగా బిల్డర్లంటే ఆ ఐదారుగురే కాదు కదా..?
ఆ వివరాలు ఎందుకు భయటపెట్టడం లేదు…?
బుద్వేల్ భూముల అమ్మకంపై ప్రభుత్వం లక్ష్యం నెరవేరిందన్న అనుమానాలు మరికొందరు బిల్డర్లు వ్యక్తం చేస్తున్నారు. అయిన వారికి తక్కువ రేట్లకే భూములు కట్టబెట్టారన్న టాక్ మొదలైంది. బుద్వేల్‌లో భూములు కొన్నవారి వివరాలు ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆ వివరాలు తర్వాత వెల్లడి చేస్తామంటున్నారు. ఇది కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎక్కువ మంది పోటీకి రాకుండా చూసి తాము అనుకున్నవారికి భూములు దక్కేలా ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. పేరుకు ఈ-ఆక్షన్ అయినా ఎక్కువ మంది పోటీకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరం రూ.40-50కోట్లు అంటే పరుగులు తీసే బిల్డర్లున్నారు. మరి వారంతా ఏమైపోయారు..? పోనీ ప్లాటు సైజు పెద్దది కాదా అనుకుంటే.. నలుగురైదుగురు కలిసి కొనుక్కోవచ్చు. కానీ వారంతా దీనిపై అంత ఆసక్తి చూపకపోవడం వెనక కథేంటన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. మొత్తానికి బుద్వేల్ భూములపై ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు వచ్చింది. ఇటు తమవారికి భూములు దక్కాయి. మరి త్వరలో రాజేంద్రనగర్‌లో వేలం వేసే భూములు కూడా ఇవే ధర పలుకుతాయా..?