Kokapet: కోకాపేటలో ఎకరం రూ.వంద కోట్లు పలికితే.. బుద్వేల్‌లో అందులో సగమైనా పలుకుతుందని ఎదురు చూసిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఎకరానికి కేవలం రూ.41.25 కోట్లే పలికింది. మరి, ఇంత ధర ఎందుకు పలికిందో తెలుసుకోవడానికి హెచ్ఎండీఏ ప్రయత్నించాలి. వాస్తవానికి కోకాపేట్ కంటే బుద్వేల్ తీసిపోయే ప్రాంతమేమీ కాదు. అక్కడ ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తే.. అచ్చం విదేశీ నగరాల తరహాలో ఆ ఏరియా మొత్తం కనిపిస్తుంది. ఈ విషయం తెలుగు రాష్ట్రాల బిల్డర్లకూ తెలుసు. కొందరు జాతీయ బిల్డర్లు సైతం బుద్వేల్ వేలంలో పాల్గొనేందుకు ప్రయత్నించి చివరి దశలో విరమించారని సమాచారం. ఏదీఏమైనా బుద్వేల్‌లో మొదటి దశలో వంద ఎకరాల్ని వేలం వేస్తే ప్రభుత్వ ఖజానాకు చేరింది కేవలం రూ.3625.73 కోట్లే. అదే, కోకాపేట్‌లో 45.33 ఎకరాలకే రూ.3319.60 కోట్లు వచ్చింది. మరి, బుద్వేల్‌లో అనుకున్న దానికంటే ఎందుకు తక్కువ రేటు పలికిందనే విషయాన్ని హెచ్ఎండీఏ తెలుసుకోవాలి.
బుద్వేల్‌లో ఆకాశహర్మ్యాలకు అనుమతి రాదనే ప్రచారం జోరుగా జరిగింది. 30 నుంచి 50 అంతస్తుల దాకా నిర్మించలేరని, సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి ఆకాశహర్మ్యాల ఎత్తు అనుమతి గురించి హెచ్ఎండీఏ పూర్తి సమాచారాన్ని తెలుసుకోకుండానే వేలం పాటల్ని చేపట్టిందని వార్తలు వినిపించాయి. వేలం వేస్తున్న ప్రాంతంలో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడానికి కనీసం పద్దెనిమిది నెలలు పడుతుంది. పైగా, హైకోర్టులో బుద్వేల్ భూములకు సంబంధించిన కేసు ఉండటం చివరి వరకూ ఏం జరుగుతుందోననే ఉత్కంఠను రేకెత్తించింది. అందుకే, కొందరు బిల్డర్లు వేలంలో పాల్గొనడానికి వెనకడుగు వేశారని తెలిసింది. ఈ వేలం పాటలో పాత బిల్డర్ల కంటే కొత్తవారే ఎక్కువగా పాల్గొన్నారని సమాచారం.