Stock Markets: మార్కెట్లపై మోజు తగ్గుతోందా…?

గతంలో ఎంతో ఉత్సాహంగా, ఆశగా మార్కెట్ల వైపు చూసిన ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇప్పుడు బాబోయ్ మాకొద్దీ మార్కెట్లు అంటున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్లకు 38లక్షల మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు దూరమయ్యారంటే ఎంత భయం సృష్టించాయో అర్థం చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - February 26, 2023 / 08:47 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్టర్లు నమ్మకాన్ని కోల్పోతున్నారా..? మార్కెట్ల నుంచి దూరంగా జరుగుతున్నారా..? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి. గతంలో ఎంతో ఉత్సాహంగా, ఆశగా మార్కెట్ల వైపు చూసిన ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇప్పుడు బాబోయ్ మాకొద్దీ మార్కెట్లు అంటున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్లకు 38లక్షల మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు దూరమయ్యారంటే ఎంత భయం సృష్టించాయో అర్థం చేసుకోవచ్చు. వరుస ప్రతికూల అంశాలు మార్కెట్లను కోలుకోకుండా చేయడమే కాకుండా ఇన్వెస్టర్లను కూడా దూరం చేస్తున్నాయి.

ఇటీవలి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం గత ఆరు నెలల కాలంలో 38లక్షలకు పైగా క్లయింట్లు మార్కెట్లను వదిలేశారు. మార్కెట్ల వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని దూరం జరుగుతున్నారు. సాధారణంగా పాతవారు కొందరు దూరమైతే కొత్తవారు వచ్చి చేరుతుంటారు. కానీ కొత్త క్లయింట్లు కూడా పెద్దగా చేరడం లేదు. ఆన్ లైన్ ట్రేడింగ్ ఫ్లాట్ఫామ్ జిరోదాలో గత నెలలో కొత్త ఖాతాల ప్రారంభం దాదాపు 50శాతం పడిపోయింది. ఒక్క జిరోదాలోనే కాదు అన్నింటా ఇదే పరిస్థితి. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

NSE డేటా ప్రకారం గతేడాది జులైలో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 3కోట్ల 77లక్షలు.. కానీ జనవరి నాటికి అది 3కోట్ల 42లక్షలకు చేరింది. అలాగే గత ఆగస్టులో NSE,BSEల్లో రోజువారి డైలీ టర్నోవర్ సగటున 63వేల 592 కోట్లుగా ఉంటే అది జనవరి నాటికి 51వేల 844 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు 12వేల కోట్ల రూపాయల రోజువారీ టర్నోవర్ తగ్గింది. మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్లకు ఉన్న భయాన్ని చెప్పడానికి ఈ లెక్కలు చాలు.

గత ఏడాది డిసెంబర్ లో స్టాక్ మార్కెట్లు లైఫ్ టైం హైను తాకాయి. ఆ తర్వాత నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. హైవాల్యుయేషన్ కారణంగా భారతీయ షేర్లు కాస్త ఖరీదుగా అనిపించాయి. అదే సమయంలో మిగిలిన ఆసియా దేశాల షేర్లు చీప్ గాను, ఆకర్షణీయంగాను కనిపించాయి. ఆ తర్వాత మూడో త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపలేకపోయాయి. ఆ తర్వాత వరుసగా రకరకాల అంశాలు దేశీయ షేర్లను ప్రభావితం చేస్తూ వచ్చాయి. ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ అంచనాల ప్రకారమే ఉన్నప్పటికీ వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుండటం, ఆ వడ్డింపు ఎన్నాళ్లు సాగుతుందో తెలియకపోవడం వంటి కారణాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఇవన్నీ మార్కెట్లకు ఇన్వెస్టర్లను దూరం చేశాయి. ఇక జనవరి చివరలో హిండెన్ బర్గ్ నివేదిక సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు మునిగిపోయారు. తక్కువలో కొని బయటపడ్డ వారు సేఫే అయినా ఎక్కువ రేట్ల వద్ద కొన్నవారు మాత్రం మునిగిపోయారు.

ఒక్క అదానీ గ్రూపు షేర్లే కాదు దేశీయ ఈక్విటీలు భారీగా కోల్పోయాయి. కొన్ని లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైపోయింది. అదానీ షేర్లను వదిలేస్తే దేశంలోని టాప్-10 సంస్థల్లో 9 సంస్థలు ఇటీవలి కాలంలో ఏకంగా ఒక లక్షా 87వేల కోట్ల మేర విలువ తగ్గాయంటే ఏ స్థాయిలో మార్కెట్లు ప్రతికూలంగా చలించాయో అర్థం చేసుకోవచ్చు.. HDFC బ్యాంకు దాదాపు 38వేల కోట్ల రూపాయలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 36వేల 5వందల కోట్ల రూపాయలకు పైగా పడిపోయాయి. TCS, HDFC, ICICI,SBI ఇలా పెద్ద షేర్లన్నీ విలువ తగ్గాయి. ప్రతి 10షేర్లలో దాదాపు 9 షేర్లు 52వారాల కనిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి.

యాక్టివ్ ఇన్వెస్టర్ల సంఖ్య తగ్గడం మార్కెట్ల పట్ల భయాన్ని తెలయచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో ఇన్వెస్టర్లు మార్కెట్లలో అనుసరించాల్సిన వ్యూహాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు. భయంలోనే కొనండి, అత్యాశలో ఉన్నప్పుడే అమ్మండి అన్నది ఓ సూత్రం… దాన్ని పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు విశ్వాసం లేనప్పుడే కొనాలి… అలాగే పరిస్థితులు కాస్త చక్కబడి మరీ ఆశావహంగా ఉన్నప్పుడే అమ్మాలి అన్నట్లుగా మార్చుకోవాలి. అలాగే తమ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ ఫోలియోను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లలో ఇప్పుడున్న పరిస్థితిలు ఎల్లకాలం ఉండవు. రానున్న రోజుల్లో మళ్లీ పరిస్థితులు కుదురుకుంటే ఆశగా మార్కెట్లవైపు పరుగులు పెట్టడం ఖాయం. అంత వరకు యాక్టివ్ ఇన్వెస్టర్లు తెలివిగా తమ పోర్ట్ ఫోలియోలను మేనేజ్ చేసుకుంటే మళ్లీ లాభాలు కళ్ల చూడొచ్చు.

(KK)