Pasta Crisis: పాస్తా ధరలు పైపైకి.. ఉక్కిరిబిక్కిరవుతున్న ఇటలీ!

మనకు రైస్‌లో ఎన్ని వెరైటీలు ఉంటాయో.. అక్కడ పాస్తాలో అన్ని వెరైటీలు ఉంటాయి. లజాన్యా (lasagna), స్పగెట్టి (spaghetti), రవీయోలి (ravioli), లింగ్వీని, పకేరి, పెన్నె, టెర్టోల్లేనె వంటి రకాల పాస్తాను ఇటాలియన్లు తింటారు. అయితే, ఇప్పుడు పాస్తా ధరలు ఇటాలియన్లను బెంబేలెత్తిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 06:12 PM IST

Pasta Crisis: ఇటలీ దేశస్థుల ఫేవరెట్ ఫుడ్ పాస్తా. ఇటాలియన్ల ప్రధాన ఆహారమిది. మనం రైస్ ఎలా తింటామో.. వాళ్లు పాస్తా అలా తింటారు. మనకు రైస్‌లో ఎన్ని వెరైటీలు ఉంటాయో.. అక్కడ పాస్తాలో అన్ని వెరైటీలు ఉంటాయి. లజాన్యా (lasagna), స్పగెట్టి (spaghetti), రవీయోలి (ravioli), లింగ్వీని, పకేరి, పెన్నె, టెర్టోల్లేనె వంటి రకాల పాస్తాను ఇటాలియన్లు తింటారు. అయితే, ఇప్పుడు పాస్తా ధరలు ఇటాలియన్లను బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని నెలలుగా పాస్తా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరల పెరుగుదలకు కారణాలేంటి?
పాస్తా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అక్కడ చమురు ధరలు పెరగడమే. చమురు ధరల పెరుగుదల పాస్తా ఉత్పత్తిపై ప్రభావం చూపింది. దీంతో పాస్తా ధరలు పెరిగాయి. మరోవైపు పాస్తా తయారీలో వాడే గోధుమల ఉత్పత్తి కూడా తగ్గింది. దాదాపు 30 శాతం గోధుమల ఉత్పత్తి తగ్గింది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదల కూడా మరో కారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ద్రవ్యోల్బణం ప్రభావం పాస్తా ఉత్పత్తిపై పడింది. గత నెలలో ఇటలీలో ద్రవ్యోల్బణం మార్చి కంటే ఒక శాతం వరకు ఎక్కువగా పెరిగింది. దీంతో ధరలూ పెరిగాయి. అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు పెరిగినా, పాస్తా ధరలు ఇంకా ఎక్కువగా పెరిగాయి. దీంతో ఇటలీలోని సామాన్యులు పాస్తా కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. పాస్తా ధరల ప్రభావం ఎంతగా ఉందంటే.. అక్కడి ప్రభుత్వం గురువారం దీనిపై సమీక్ష నిర్వహించబోతుంది.

పాస్తా ధరల్ని తగ్గించేందుకు ఏం చేయాలా అని ప్రభుత్వం ఆలోచిస్తుందంటే దీని ప్రభావం ప్రజలపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాస్తా ధరల్ని అదుపులోకి తెచ్చి, సామాన్యులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటలీలోనే కాదు.. అమెరికాలో కూడా పాస్తా ధరలు పెరిగాయి. అమెరికా కూడా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి సమస్యల్ని ఎదుర్కుంటోంది. అందువల్ల అక్కడ కూడా ధరల పెరుగుదల సమస్య ఉంది. ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలు ధరల పెరుగదలతో సతమతమవుతున్నాయి. ఈ కారణంగా అక్కడ గత డిసెంబర్‌లో చాలా మంది క్రిస్మస్ కూడా సరిగ్గా జరుపుకోలేకపోయారని అక్కడి మీడియా వ్యాఖ్యానిస్తోంది.