Crude Oil Prices: పెట్రోల్ ధరలు మరింత పెరగనున్నాయా?

గత కొన్నినెలలుగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా పెట్రోలియం కంపెనీలు మాత్రం ధరలు తగ్గించలేదు.

  • Written By:
  • Publish Date - April 3, 2023 / 11:50 AM IST

గత కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీలు  (Oil Companies) మన దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) రేట్లు పెంచలేదు. మరి ఎంతకాలం ధరలు పెంచకుండా ఉంటాయి అంటే మాత్రం ఎన్నాళ్లో కాదనే చెప్పాలి. ఎందుకంటే త్వరలో ముడిచమురు (Crude Oil) మండబోతోంది. చమురు ఉత్పత్తి దేశాలు తమ ఉత్పత్తిలో కోత పెట్టాలని నిర్ణయించుకున్నాయి…

గత కొన్నినెలలుగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా పెట్రోలియం కంపెనీలు మాత్రం ధరలు తగ్గించలేదు. గత నష్టాలను, భారాన్ని దించుకునే పనిలో పడ్డాయి. అటు రష్యా (Russia) నుంచి తక్కువకు ముడిచమురు కొనుగోలు చేయడంతో పాటు ఇటు మిగిలిన దేశాల నుంచి కూడా తక్కువకే చమురును కొంటున్నాయి. వినియోగదారుడికి మాత్రం ఆ ఊరట కల్పించలేదు. వాహనదారులు కూడా పెంచకుండా ఉంటే చాలు అని అంతటితో తృప్తిపడ్డారు. అయితే త్వరలోనే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధరల తగ్గుదలకు బ్రేక్ వేసేందుకు ఒపెక్ (OPEC), ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. సౌదీ అరేబియా (Saudi Arabia) నుంచి ఇరాన్ (Iran) వరకు 12 దేశాలు ఉత్పత్తి కోతకు మొగ్గుచూపాయి. ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో ఇరాక్ (Iraq) మే నుంచి రోజుకు 2లక్షల 11వేల బ్యారెళ్ల మేర ప్రొడక్షన్ తగ్గించనుంది. ఈ ఏడాది చివరి వరకు కోతను కొనసాగించాలని నిర్ణయించింది. కువైట్ (Kuwait), సౌదీ అరేబియా, అల్జీరియా (Algeria) కూడా కోతకే మొగ్గు చూపాయి. సౌదీ ఏకంగా 5లక్షల బ్యారెళ్లను తగ్గించనుంది. ఒపెక్ ప్లస్ దేశాలు కూడా రోజుకు 10లక్షల బ్యారెళ్ల మేర ముడి చమురు ఉత్పత్తికి కోట పెట్టనున్నాయి. గత అక్టోబర్‌లో తీసుకున్న కోతలకు ఇది అదనం. మొత్తంగా చూస్తే రోజుకు 36లక్షల బ్యారెళ్ల ఉత్పత్తికి కోత పడనుంది. గ్లోబల్ డిమాండ్‌లో ఇది 3.7శాతానికి సమానం. ఎవరూ ఊహించని ఈ కోతలతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో బ్యారెల్ ధర కనీసం 10 డాలర్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ డిమాండ్ తగ్గుతుందన్న భయంతోనే తాము ఉత్పత్తిలో కోత పెడుతున్నామని ఒపెక్ దేశాలు చెబుతున్నా వాస్తవం మాత్రం వేరు. ధరలు మరింత పడిపోతే వాటి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలతాయి. ఆ పరిస్థితి రాకుండా ఉత్పత్తిని తగ్గిస్తే ధర పెరుగుతుందన్న సూత్రాన్ని అవి ఫాలో అవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగితే మాత్రం కంపెనీలు మళ్లీ బాదుడు మొదలు పెట్టడం ఖాయం. రష్యా నుంచి మన దిగుమతులు గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్నాయి. అయితే అది మన అవసరాల్లో కొంతమేర మాత్రమే. మిగిలిన చమురును ఇతర దేశాల నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి కొనాల్సిందే. రష్యా నుంచి తక్కువకే ముడిచమురు వస్తున్నా కంపెనీలు మాత్రం ఇప్పటివరకు ఆ లాభాన్ని మనకు పంచలేదు. ఇప్పుడు ధరలు పెరిగితే మాత్రం ఆ భారాన్ని మనపై వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఐదారు నెలల క్రితం వరకు వంద డాలర్లకు పైగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర గత నెలలో 70డాలర్ల స్థాయికి పడిపోయింది. బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావంతో ధర తగ్గింది. తర్వాత 80 డాలర్లకు కోలుకుంది. ప్రస్తుత నిర్ణయంతో అది 90డాలర్లకు పైకి ఎగబాకొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ 10డాలర్ల భారాన్ని చమురు కంపెనీలు వినియోగదారులపై మోపుతాయి. మొత్తంగా చూస్తే మన బడ్జెట్‌కు బొక్క పడటం ఖాయంగా కనిపిస్తోంది.