Senseless driving: రెండేళ్ల చిన్నారిని చంపేసిన నిర్లక్ష్యం! ఒక్కసారిగా కారు డోర్ తీసిన డ్రైవర్‌!

వెనుక నుంచి ఎవరు వస్తున్నారో చూడకుండా కారు డోర్ ఓపెన్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలిగొంది.

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 03:36 PM IST

వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తమ రెండేళ్ల పాపతో ఎంతో హ్యాపీగా బతుకుతున్నారు.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా షీకారుకు వెళ్తుంటారు.. ఏదైనా షాపింగ్‌ చేయాలన్నా కలిసే బయటకు వెళ్తారు. అయితే వారి జీవితాలను అల్లకల్లోలం చేయడానికి నిర్లక్ష్యం కాచుకొని కూర్చుంది. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది..!

ఒక్కసారిగా కారు డోర్ తీసిన డ్రైవర్:
‘వెనుక ఎవరు వస్తున్నారో చూడకుండా కారు డోరు తెరవద్దు’.. ఇది బెసిక్‌ సెన్స్‌ ఉన్నా ఏ ఒక్కరికైనా తెలిసే పాయింట్.. నిజానికి చిన్నారులకు, విద్యార్థులకు ఇలాంటి విషయాలపై అవగాహన ఉండకపోతే పెద్దలే కారు డోర్ అలా తెరవద్దని చెబుతుంటారు. అందులో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తే ఈ విషయాన్ని కారు దిగేటప్పుడు నలుగురికి గుర్తు చేస్తుంటాడు. అయితే ఆ కారు డ్రైవర్‌ మాత్రం తన బెసిక్‌ డ్రైవింగ్‌ పాఠాన్నే మర్చినట్టున్నాడు. చూసుకోకుండా కారు డోర్ తెరిచాడు. రెండేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలిగొన్నాడు.

రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్‌లో ఈ విషాదకర ఘటన వెలుగుచూసింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డుపై కారు డోర్‌ను డ్రైవర్ ఓపెన్ చేయడంతో బైక్‌కు తగిలి తల్లి శశిరేఖ, కుమార్తె ధనలక్ష్మి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మన్సూరాబాద్ నుంచి ఎల్‌బినగర్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కారు డ్రైవర్ నిర్లక్ష్యం అందులో క్లియర్‌ కట్‌గా కనిపిస్తుంది. రోడ్డుపై అడ్డంగా కారు ఆపడమే కాకుండా.. వెనుక వచ్చే వాహనాన్ని గమనించకుండా డోర్ తీయడమే ప్రమాదానికి ప్రధాన కారణం.చిన్నారి ధనలక్ష్మి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ పాప ఇక లేదని తెలిసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

బైక్‌ వెళ్తున్న దంపతులు ఓవర్‌ స్పీడ్‌తో ఏమీ లేరు. నార్మల్ స్పిడ్‌లోనే వెళ్తున్నారు.. అప్పటివరకు కారులో నుంచి ఎవరూ దిగలేదు కూడా. అయితే ఉన్నట్టుండి కారు డోర్ ఓపెన్ చేశారు. అప్పటికే బైక్‌ కారు వద్దకు వచ్చేసింది. చిన్నారి కాలు ఆ కారు డోర్‌ని తాకింది. వెంటనే బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదాన్ని ఊహించని వెనక కూర్చున్న తల్లి, బిడ్డ ఒక్కసారిగా పడిపోయారు. చిన్నారి ధనలక్ష్మి స్పాట్‌లోనే చనిపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. కనీసం కింద పడిన వాళ్లకి సాయం చేయలన్న బుద్ధి కూడా అతనికి పుట్టలేదు. చేసిన తప్పు నుంచి చట్టానికి దొరకకుండా పారిపోయాడే కానీ.. ఆ కుటుంబం నడిరోడ్డుపై రక్తంలో పడి ఉంటే కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు నిందితుడు. నిజానికి మిర్రర్‌లో నుంచి చూసినా వెనక ఎవరూ వస్తున్నారో కనిపిస్తుంది.. చాలా మంది కారు డోర్ తీసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసి మరి ఓపెన్‌ చేస్తారు. కానీ అతను మాత్రం అసలు మిర్రర్‌లో నుంచి కానీ..తల తిప్పి వెనక్కి కానీ చూడకపోవడం నిండు నిర్లక్ష్యానికి నిదర్శనం.