Jammu Road Accident: జమ్మూ కశ్మీర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడటంతో 36 మంది చనిపోయారు. కిష్త్వాఢ్ నుంచి జమ్మూ (Jammu Kashmir) వెళ్తున్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో 19మంది గాయపడ్డారు. వీళ్ళల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జమ్మూలోని డోడా జిల్లాలో బటోత్-కిష్త్వాఢ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. 55 మందికి పైగా ప్రయాణికులతో ఉదయం కిష్త్వాఢ్ నుంచి బస్సు బయలుదేరింది. తృంగాల్-అస్సార్ ప్రాంతానికి చేరుకోగానే దాదాపు 300 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల కుటుంబాలకు పరిహారం: ప్రధాని మోడీ
డోడాలో బస్సు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియో (Exgratia) ప్రకటించారు.