Cyber Crime: దేశంలో 80 శాతం సైబర్ క్రైమ్స్‌కు ఆ 9 జిల్లాలే అడ్డా.. హర్యానా, జార్ఖండ్ డేంజర్ బెల్స్..

దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 80 శాతం నేరాలు 10 జిల్లాల నుంచే జరుగుతున్నాయని ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్‌ క్రైమ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌(ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌) అనే స్టార్టప్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఆశ్చర్యకరంగా ఈ పది జిల్లాలన్నీ ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 08:27 PM IST

Cyber Crime: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వాటి బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో మన దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలతో ముడిపడిన ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 80 శాతం నేరాలు 10 జిల్లాల నుంచే జరుగుతున్నాయని ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్‌ క్రైమ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌(ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌) అనే స్టార్టప్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఆశ్చర్యకరంగా ఈ పది జిల్లాలన్నీ ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి. వీటిలో 5 జిల్లాలు జార్ఖండ్‌లో, చెరో రెండు జిల్లాలు హర్యానా, రాజస్థాన్‌లలో ఉన్నాయి. దీన్నిబట్టి అక్కడ సైబర్ క్రైమ్ మాఫియా ఏ రేంజ్‌లో వేళ్లూనుకుందో అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలవారీగా చిట్టా..
సైబర్ క్రైమ్‌కు అడ్డాలుగా మారిన ఆ పది జిల్లాల లిస్టును పరిశీలిస్తే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్‌లో 18 శాతం ఈ చిన్న పట్టణం నుంచే జరుగుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లోని మధుర సెకండ్ ప్లేస్‌లో ఉంది. దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్‌లో 12 శాతం ఈ పట్టణం నుంచి ఆపరేట్ అవుతున్నాయి. హర్యానాలోని నూహ్ (11 శాతం), జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ (10 శాతం), జార్ఖండ్‌లోని జాంతారా (9.6 శాతం), హర్యానాలోని గురుగ్రామ్ (8.1 శాతం), రాజస్థాన్‌లోని అళ్వార్ (5.1 శాతం), జార్ఖండ్‌లోని బొకారో (2.4 శాతం), జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కార్మా‌టాండ్ (2.4 శాతం), జార్ఖండ్‌‌లోని గిరిధ్ (2.3 శాతం) జిల్లాల్లో అధికంగా సైబర్ క్రైమ్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ లెక్కలను బట్టి దేశంలోనే సైబర్ నేరగాళ్లు ఎక్కడ తిష్ట వేసి కూర్చున్నారో స్పష్టంగా తెలిసిపోతోంది.
వామ్మో.. కేటుగాళ్లు
డిజిటల్ విప్లవం పుణ్యమా అని దేశ ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీలను పెంచారు. దీన్ని సైబర్ నేరగాళ్లు అదునుగా భావించి.. రకరకాల పద్ధతుల ద్వారా లావాదేవీల్లోకి చొరబడి డబ్బులు దొంగిలిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. ఫేక్ కస్టమర్ కేర్ ఆఫీసర్ల అవతారమెత్తి జనం నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. పిషింగ్ మెయిల్స్, వైరస్‌తో కూడిన మెసేజ్‌లు పంపి బ్యాంకు ఖాతాల హ్యాకింగ్‌కు తెగబడుతున్నారు. అంతటితో ఆగకుండా.. యూట్యూబ్ చానెల్‌ సబ్‌స్క్రైబ్ చేసి, లైక్‌లు కొడితే డబ్బులు ఇస్తామంటూ నిరుద్యోగుల్ని ముంచుతున్నారు. సబ్‌స్క్రైబ్‌లు, లైక్‌లు కొట్టిన తర్వాత బ్యాంకు అకౌంట్ వివరాలను తీసుకొని హ్యాకింగ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఐఐటీ కాన్పూర్‌.. సైబర్ క్రైమ్‌కు స్థావరాలుగా మారిన 10 జిల్లాల బండారాన్ని బట్టబయలు చేసింది. ప్రజల్లో సైబర్ అక్షరాస్యతతో అప్రమత్తత పెరిగితే.. ఇలాంటి సైబర్ కేటుగాళ్ల ఆగడాలు సాగబోవని ఐఐటీ కాన్పూర్ నివేదిక అభిప్రాయపడింది.