ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు జనాలను భయపెడుతున్నాయ్. ఎవరు, ఎప్పుడు, ఏ క్షణాన, ఏ సందర్భంలో గుండెపోటుతో చనిపోతారో అంతుపట్టడం లేదు. ఈ వయసువారికే గుండెపోటు ప్రమాదం అనే లెక్కలు కనిపించడం లేదు. 10 ఏళ్లలోపు పిల్లల నుంచి వృద్ధుల వరకూ.. ఎప్పుడు మృత్యువు వెంటాడుతుందో తెలీదు. ఈ క్షణమే మనది, మరుక్షణం ఎలా ఉంటుందో ప్రశ్నార్థకమే ! జగిత్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
అప్పటివరకు షటిల బ్యాడ్మింటన్ ఆడిన వ్యక్తి ఒక్కసారి కుప్పకూలాడు. గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. గంగారాం అనే వ్యక్తికి ఉదయాన్నే స్నేహితులతో బ్యాడ్మింటన్ ఆడడం అలవాటు. ఇప్పుడు కూడా ఆడడానికి వచ్చాడు. ఐతే మరణం.. ఆతనిని గుండెపోటు రూపంలో వెంటాడింది. షటిల్ ఆడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిన గంగారాంకు.. అక్కడ ఉన్న వాళ్లు సీపీఆర్ అందించినా ఫలితం లేకుండాపోయింది.
ఆసుపత్రికి తరలించే మార్గంలోనే గంగారాం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. గుండెపోటు మరణాలు ఈ మధ్య తగ్గినట్లే అనిపించగా.. గంగారాం ఘటనతో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని.. వ్యాయామం, ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. గుండెను పదిలంగా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.