H‌‌yderabad: ట్యాంక్ బండ్ పై దూసుకెళ్లిన కారు.. తృటిలో తప్పిన ముప్పు

హైదరాబాద్ లో తరచూ ఏవో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దీనిపై ఎన్ని సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వాహన చోదకులు వేగాన్ని మాత్రం అదుపు చేయడం లేదు. తాజాగా ట్యాంక్ బండ్ సమీపంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిగా అదుపు తప్పి ఉంటే హూసేన్ సాగర్ నీటిలో పడిపోయేది.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 01:29 PM IST

గతంలో కారు నడపడం పెద్ద వింత అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కార్లు కొనడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అరకొరగా 30 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకొని తమ సొంత కార్లతో నేరుగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. వీరి పైత్యం సామాన్యులకు శాపంగా మారుతుంది. తాజాగా ఎన్టీఆర్ గార్డెన్ వద్ద జరిగిన కారు ప్రమాద ఘటన దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఉదయం ట్యాంక్ బండ్ పై వేగంగా దూసుకొచ్చిన కారు హూస్సేన్ సాగర్ సైడ్ పుట్ పాత్ పైకి ఎక్కి అక్కడి గ్రిల్స్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఢీ కొట్టిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో వారికి ప్రమాదం తప్పింది.

ప్రమాదానికి గురైనది కొత్త కారుగా తెలుస్తుంది. ఇంకా రవాణా శాఖ అధికారుల నుంచి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అవ్వలేదు. కారుకు వెనుక భాగంలో పసుపు రంగులోని తాత్కాలిక నంబర్ ప్లేట్ ఉంది. అలాగే గ్రిల్స్ ను తాకి అక్కడికక్కడే ఆగిపోవడంతో కారుతోపాటూ అందులోని వ్యక్తులు నీటిలోపడే ముప్పు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి ఇద్దరూ పారిపోయారు. ఆ తరువాత అక్కడకి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో ఆ వాహనాన్ని పక్కకు తీశారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్బాప్తు చేపట్టారు.

T.V.SRIKAR