Manipur Violence: మణిపూర్‌లో అసలు ప్రభుత్వం ఉందా..? ఈ స్థాయిలో రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యమా..? తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సుప్రీం

మణిపూర్ ప్రభుత్వంపైనా, పోలీసు వ్యవస్థపైనా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించింది. మణిపూర్‌లో కొన్ని నెలలుగా చోటు చేసుకున్న దారుణ ఘటనలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Written By:
  • Updated On - August 1, 2023 / 05:19 PM IST

Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? అక్కడ ప్రభుత్వం ఉందా..? శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు..? రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నాయా..? మణిపూర్ పోలీసులు ఇంత అసమర్థులుగా మారిపోయారా..? ప్రజల మాన, ప్రాణాలకు భరోసా కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా..? ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు.. మణిపూర్ ప్రభుత్వంపైనా, పోలీసు వ్యవస్థపైనా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించింది. మణిపూర్‌లో కొన్ని నెలలుగా చోటు చేసుకున్న దారుణ ఘటనలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మే నుంచి జులై వరకు మూడు నెలల పాటు మణిపూర్‌లో రాజ్యాంగ వ్యవస్థలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని ఘాటుగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో జాప్యంపై రాష్ట్ర పోలీసుల తీరును కడిగిపడేసింది సుప్రీంకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నుంచి.. దర్యాప్తు చేయడం వరకు రాష్ట్ర పోలీసులు అసమర్థులుగా మారిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన యంత్రాంగం ప్రజలను రక్షించలేకపోతే.. వాళ్లకు న్యాయం చేసేది ఎవరంటూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.
విచారణ మీ వల్ల కాదు
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరిలో ఊరేగిస్తుంటే.. పోలీసులు చేష్టలుడిగి చూడటాన్ని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. మే 4న జరిగిన ఘటనపై మణిపూర్ పోలీసులు విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం మణిపూర్ డీజీపీకి సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఎలాంటి నేరాలకు ఎలాంటి ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారో.. సవివరంగా నివేదిక సమర్పించాలని కోరింది. హేయమైన నేరాల విషయంలో దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతుందో తెలపాలంటూ డీజీపీకి శ్రీముఖం పంపింది.
ప్రభుత్వానికి ఇప్పటికైనా సిగ్గొస్తుందా ?
మణిపూర్‌పై విపక్షాలు ప్రశ్నిస్తే.. డబుల్ ఇంజన్ సర్కార్‌ ఆగ్రహంతో ఊగిపోయింది. మీ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదా అంటూ కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు తప్పు పట్టిన తీరు చూస్తే.. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా.. ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. గతంలో విపక్షాలపై ఆగ్రహంతో ఊగిపోయిన స్మృతి ఇరానీ లాంటి నేతలు ఇప్పుడు సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే దమ్ముందా..? మణిపూర్‌పై మౌనం వీడకుండా విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్న ప్రధానమంత్రి సుప్రీం వ్యాఖ్యల తర్వాతైనా.. కనీస మానవత్వంతో స్పందిస్తారా..?
సోమవారం సుప్రీం ఏం చేయబోతోంది ?
న్యాయస్థానాలు లేకపోతే ప్రభుత్వాలు ఒక్కోసారి ప్రజలను బజారుకీడ్చేస్తాయి. మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు ఈ స్థాయిలో స్పందిస్తుందని అక్కడి ప్రభుత్వం, పోలీసులు కూడా ఊహించి ఉండరు. చీఫ్ జస్టిస్ ధర్మాసనం తీరు చూస్తుంటే.. డీజీపీ నుంచి వివరణ తీసుకున్న తర్వాత కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా డబుల్ ఇంజన్ సర్కార్ బాధితుల పక్షాన నిలవకపోతే.. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకు మించిన రాజ్యాంగ వైఫల్యం మరొకటి ఉండదనే చెప్పాలి.