Anti Corruption Bureau: అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన ఒక ఉద్యోగిపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు కొరడా ఝుళిపించారు. ఉద్యోగితోపాటు అతడి బంధువుల ఇండ్లలోనూ ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని పరిపాలనా విభాగంలో యెంటి సత్యనారాయణ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. 36 ఏళ్లుగా ఇదే హోదాలో పని చేస్తున్నాడు.
ఉద్యోగిగా తన స్థాయి చిన్నదే అయినా.. ఆదాయం, ఆస్తులు మాత్రం ఎక్కువగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం కాకినాడ రూరల్ ఏరియా, ఇంద్రపాలెంలోని అతడి ఇంటితోపాటు, సోదరులు, బంధువుల ఇండ్లపై దాడులు నిర్వహించారు. ఆరు చోట్ల జరిగిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ప్రభుత్వ విలువ ప్రకారం.. దాదాపు రూ.3 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ ఏఎస్పీ సౌజన్య వెల్లడించిన వివరాల ప్రకారం.. సత్యనారాయణకు మూడు జీ+2 బిల్డింగ్స్, ఐదు ప్లాట్స్, కాకినాడ జిల్లాలో 2.65 ఎకరాల భూమి, సుమారు 392 గ్రాముల బంగారం, 860 గ్రాముల వెండి, బైక్, రూ.41 వేల నగదు దొరికింది. ఆయన సోదరుడి ఇంట్లో రూ.8 లక్షల నగదు, అతడి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లలో రూ.4.8 లక్షల నగదు, సోదరుడి పిల్లల పేరుతో రూ.6.5 లక్షల డిపాజిట్లు, లాకర్‌లో రూ.19 లక్షల నగదు దొరికింది. మరికొన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా దొరికాయి.
వీటిని పరిశీలించాల్సి ఉంది. మొత్తం రూ.38 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, ఆస్తి పత్రాలు దొరికాయి. ఒకే చోట ఏండ్లుగా విధులు నిర్వర్తించడం అతడికి కలిసొచ్చిందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అక్రమ సంపాదనకు తెరతీసి ఉండొచ్చచని అనుమానిస్తున్నారు. అక్రమంగా తన స్థాయికి మించి ఆస్తులు కలిగి ఉండటంతో సత్యనారాయణపై అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. కాగా, ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.