London Murder Case: మర్డర్ కి లండన్ నుంచి డైరెక్షన్ చేసి హైదరాబాద్ లో స్క్రీన్ ప్లే నడిపించిన భర్త క్లైమాక్స్ లో పోలీసులకు చిక్కాడు..

సాధారణంగా మర్డర్ లు ఎందుకు జరుగుతాయి. తమను వ్యతిరేకిస్తున్నారన్న భావనతోనో.. లేకుంటే తమకు గిట్టనిపని చేస్తున్నారన్న పరిస్థితుల మధ్య జరుగుతుంది. ఏ క్రైం అయినా తన స్వార్థం తోనే ప్రారంభం అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అయితే దీనికి బీజం మాత్రం లండన్ లో పడింది.

  • Written By:
  • Updated On - August 20, 2023 / 11:29 AM IST

అజిత్, శిరీషలు ఇద్దరూ లండన్ లో జీవిస్తున్నారు. కొన్ని విభేదాల కారణంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇది సహించలేక పోయిన భర్త సింపుల్ గా తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు పన్నాగం పన్నాడు. సింపుల్ గా తినే పదార్థాలను శాంపిల్ ప్యాకెట్ల రూపంలో వారి ఇంటికి చేర్చి ప్రాణాలు తీయాలనుకున్నాడు.

గొడవల కారణంగా వేర్వేరు జీవనం

భర్త అజిత్, భార్య శిరీషలు హైదరాబాద్ వాసులే. 2018లో శిరీషను అజిత్ వివాహం చేసుకున్నాడు. ఈమె డాక్టర్ వృత్తి చేస్తున్నారు. ఇలా ఇద్దరూ కలిసి లండన్ లోనే స్థిరపడ్డారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఆతరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీని కారణంగా ఒకే దేశంలో ఉంటున్నా వేర్వేరు ఇండ్లలో నివాసం ఉంటున్నారు. తాజాగా శిరీష సోదరుడి వివాహం ఉన్న కారణంగా ఆమె హైదరాబాద్ వచ్చారు. ఇదే సరైన సమయం అని భావించిన భర్త అజిత్ కుమార్ తన భార్యతో సహా కుటుంబ సభ్యులందరీనీ పొట్టన పెట్టుకోవాలని ప్లాన్ వేశాడు.

మర్డర్ కి  అదిరిపోయే ప్లాన్

ఈ మర్డర్ ప్లాన్ లో భాగంగా ముందుగా శిరీష అపార్ట్ మెంట్ వాచ్ మెన్ కొడుకుని మంచి చేసుకున్నాడు. అలాగే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న మరో వ్యక్తినితో పరిచయం పెంచుకున్నాడు. తద్వారా శిరీష కుటుంబ సభ్యుల కదలికల్ని నిత్యం అడిగి తెలుసుకునే వాడు. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో రకరకాల మర్డర్ ప్లాన్లను రచించి ఒక్కొక్కటిగా ఆచరణలోకి పెట్టాడు. ముందుగా కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ముసుగులో విషాన్ని ఇచ్చేందుకు మనుషులను పంపాడు. ఆ వ్యూహం బెడిసి కొట్టింది. తర్వాత అపార్ట్ మెంట్ లో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులతో అన్నంలో తినే పొడులలో పాయిజన్ కలిపి శాంపిల్ పొడిగా ఆ కుటుంబ సభ్యులకు చేరవేశాడు. వాటిని తిన్న తరువాత శిరీష ఇంట్లోని వారందరూ తవ్ర అస్వస్థతకు గురయ్యారు. వయస్సు పై బడటంతో బామ్మ చనిపోయారు. ఈ సంఘటన అందరినీ కలిచివేసింది. ఒకవైపు పెళ్లి, మరో వైపు ఈ మరణం. తీవ్ర విచారంలో నిండిపోయారు.

అదుపులోకి నిందితులు

ఇక ఆసుపత్రిలో పరీక్షలు జరిపించడంతో అందులో విషప్రయోగం జరిగినట్లు తేలింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చారు. దీనికి కారణం అయిన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు నిజం చెప్పేశారు. దీంతో తన భర్త లండన్ లో ఉండి పక్కాగా వేసిన మర్డర్ స్కెచ్ పై పోలీసులే ఆశ్చర్యపోయారు. లండన్ లో ఉన్న అజిత్ కుమార్ ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చేతికి మట్టి అంటుకోకుండా తీసిన గుంతలో చివరకు తానే పడ్డాడు అనే సామెత ఈ ఘటన ద్వారా మరో సారి నిజం అయింది.

T.V.SRIKAR