THEFT PLAN: దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది అనే సామెత విన్నారా..? అదే సామెత అనంతపురం జిల్లాలో నిజమైంది. అనంతపురంలోని శ్రీకంఠం సెంటర్‌లో ఓ చోరీ జరిగింది. ఓ వ్యక్తి కళ్లలో కారం కొట్టి.. కాళ్లు చేతులు కట్టేసి డబ్బు దోచుకున్నారు దొంగలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. చివరకు బాధితుడినే కటకటాల్లోకి నెట్టారు. అనంతపురంలోని ఎర్రనేలకొట్టాలకు చెందిన పోతుల రాజు సీఎంఎస్ ఇన్ఫో సిస్టం లిమిటెడ్ కంపెనీలో ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ కంపెనీ కాంట్రాక్టు ప్రకారం.. నగరంలోని చోళ మండలం ఫైనాన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఎల్ఐసీ లాంటి బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల నుంచి నగదును కలెక్ట్ చేసి.. వారి అకౌంట్ ఉన్న బ్యాంక్‌లో డిపాజిట్ చేయడమే పోతుల రాజు పని.
YSRCP: అలీకి వైసీపీ టిక్కెట్.. ఎక్కడినుంచంటే..
అలాగే.. క్యాష్‌ని ఏటీఎంలలో లోడ్ చేయడం కూడా రాజు చేయాల్సిన పని. ఇలా రోజూ లక్షలు అతడి చేతుల్లోకి వచ్చి పోతుంటాయి. ఆ డబ్బుపై రాజు ఫ్రెండ్స్ ఖలీల్ భాషా, సయ్యద్ జబీవుల్లా కన్ను పడింది. రాజు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకెళ్లే డబ్బును చోరీ చేయాలనుకున్నారు. ఓ ప్లాన్ రెడీ చేసి అదే ప్లాన్ రాజుకు చెప్పారు. రాజు డబ్బులు తెస్తున్నప్పుడు ఖలీల్, సయ్యద్ అతనిపై దాడి చేసి డబ్బు దోచుకెళ్లాలి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా ఇబ్బంది ఉండదు. ఈప్లాన్ విన్నాక అప్పటివరకు ఎలాంటి దురుద్దేశం లేని రాజుకు.. వాళ్ల మాటలు విన్నాక డబ్బుపై ఆశ పుట్టింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వాళ్ల ప్లాన్‌కు ఓకే చెప్పాడు. వాళ్ల ప్లాన్ ప్రకారం అనంతపురంలోని సుభాష్ రోడ్‌లో ఉన్న ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్ళి రూ.46 లక్షలు నగదు తీసుకున్నాడు రాజు. భాషా, జబీవుల్లాలకు ఫోన్ చేశాడు. వారికి తెలియకుండా బోయగేరికి చెందిన తన స్నేహితుడు బొల్లం వెంకటరామారావుకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. అతను మార్గమధ్యంలోకి రాగా వెంకటరామారావుకు రూ.23 లక్షల నగదు ఇచ్చాడు.
SALAAR: ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా.. ఆఫ్‌లైన్‌లో సలార్ టిక్కెట్లా..?
అందులో రూ.3 లక్షలు ఉంచుకుని మిగతా రూ.20 లక్షలు తాను అడిగినప్పుడు తనకు వెనక్కి ఇవ్వమని చెప్పి పోతురాజు వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియని ఖలీల్, సయ్యద్ తమ ప్లాన్ ప్రకారం ఐడీబీఐ బ్యాంక్ వద్దకు వెళ్లారు. రాజును థర్డ్ ఫ్లోర్‌కు తీసుకెళ్లి.. కళ్ళలో కారం పొడి చల్లారు. నోటికి ప్లాస్టర్ వేసి, చేతులు కట్టేసి అతని దగ్గర ఉన్న 23 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు. దొంగలు తనను బంధించి డబ్బు ఎత్తుకెళ్లారంటూ రాజు ప్లాన్ అమలు చేయడం ప్రారంభించాడు. వీడియో కాల్ చేసి పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు. వెటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. దాంతో రాజుపై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొత్తం కథ బయటపడింది. నిజానికి దోపిడీకి పక్కాగా ప్లాన్ చేశారు. అయితే కంగారులో పోతుల రాజు ఒక తప్పు చేశాడు. అదే వీడియో కాల్. కాళ్లు, చేతులు కట్టేస్తే వీడియో కాల్ చేయడం ఎలా సాధ్యం..? ఈ అనుమానంతోనే కూపీ లాగితే మొత్తం వ్యవహారం బయటికొచ్చింది.
పోతుల రాజుతో పాటు ఖలీల్ భాషా, సయ్యద్ జబీవుల్లా, బొల్లం వెంకటరామారావులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 46 లక్షల 55వేల రూపాయల నగదు రికవరీ చేశారు. రెండు బైక్‌లు, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. డబ్బుపై అత్యాశ నలుగురినీ జైలుపాలు చేసింది. ఎంత హైటెక్ ప్లాన్ వేసినా పోలీసులకు దొరికిపోవడం ఖాయం. అలాంటిది ఎప్పుడో రాజనాల కాలం నాటి ప్లాన్ వేసి ముగ్గురూ అడ్డంగా బుక్కయ్యారు. డబ్బును దాచుకున్న నేరానికి వెంకట రామారావు కూడా ఇరుక్కున్నాడు.