Ramoji Rao: ఏపీ హైకోర్టులో రామోజీరావు, శైలజా కిరణ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. మార్గదర్శిలో తన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో శైలజ పేరు మీదకు మార్చారని యూరిరెడ్డి ఆరోపించారు. తనను తుపాకీ బెదిరించి బలవంతంగా వాటా లాక్కున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్లు 420, 467, 120 బి రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్‌లను నిందితులుగా చేర్చింది సీఐడీ.
సీఐడీ ఎఫ్ఐఆర్‌ను సవాలు చేస్తూ రామోజీరావు, శైలజా కిరణ్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం వరకు రామోజీపై తీవ్ర చర్యలు తీసుకోబోమని సీఐడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు బుధవారం వింటామని హైకోర్టు తెలిపింది. రామోజీ, శైలజ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హాజరయ్యారు. ఇప్పటికే స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు తరపున లూథ్రా వాదిస్తున్న విషయం తెలిసిందే. కాగా తన తండ్రి పేరు మీద మార్గదర్శిలో షేర్స్ ఉన్నాయని యూరిరెడ్డి తెలిపారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ పెట్టుబడితో 288 షేర్లు తన తండ్రికి వచ్చాయని వెల్లడించారు. తన తండ్రి 1985లో చనిపోయినట్లు తెలిపారు. 2014లో మార్గదర్శిలో జీజే రెడ్డికి షేర్లు ఉన్నట్లు మీడియా ద్వారా తెలియడంతో 2016 సెప్టెంబర్ 29న తమ తండ్రి షేర్ల గురించి అడగడానికి సోదరుడు మార్టిన్‌రెడ్డి, యూరిరెడ్డి వెళ్లినట్లు చెప్పారు.
సోదరులిద్దరిని గదిలో ఉంచి రామోజీ తన తుపాకీతో బెదిరించి వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి తెలిపారు. అనంతరం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో వాటాదారు అయిన యూరిరెడ్డి తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజకిరణ్ పేరిట బదిలీ చేసినట్లు గుర్తించారు. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేశారన్నది వెల్లడైంది. తన షేర్లను అక్రమంగా శైలజా కిరణ్ పేరిట బదిలీ చేయడంపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ1గా చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజ కిరణ్‌లను పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
జీజే రెడ్డి వారసులకు షేర్స్ ఉన్నాయి: అడ్వొకేట్ శివరాంరెడ్డి
మార్గదర్శి చిట్స్ 1962లో ప్రారంభం అయ్యింది. జీజే రెడ్డి అందులో ఫౌండర్. ప్రమోటర్. రూ.5000తో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. జీజే రెడ్డి 1985లో మరణించారు. మార్గదర్శిలో వీళ్ళ షేర్లపై యూరి రెడ్డికి తెలియదు. మార్గదర్శిలో జీజేరెడ్డికి షేర్స్ ఉన్నట్లు 2014లో వెలుగులోకి వచ్చింది. 2014లో కూడా జీజే రెడ్డికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయి. 288 షేర్లు జీజే రెడ్డికి ఉన్నాయి. ఓఆర్‌సీలో కూడా తనిఖీ చేస్తే షేర్లు ఉన్నాయని తేలింది. 1995 నుంచి 2016 వరకు శైలజ కిరణ్‌కు కేవలం 100 షేర్లు ఉన్నాయి. యూరి రెడ్డికి ఆమె కంటే ఎక్కువగా 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి వారసులతో బలవంతంగా సంతకాలు పెట్టించి షేర్స్ బదిలీ చేయించుకున్నారు. యూరిరెడ్డి ప్రమేయం లేకుండానే ఆయన పేరు మీద ఉన్న షేర్లు మార్గదర్శికి బదిలీ చేశారు. యూరిరెడ్డి షేర్లు శైలజా కిరణ్‌కు బదిలీ చేసినట్లు లెక్కల్లో చూపించారు. యూరిరెడ్డి షేర్లు బదలయించాల్సిన అవసరం లేదు. ఆయన్ను బెదిరించి సంతకాలు పెట్టించి అక్రమంగా షేర్లు బడలయించారు. యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశాక ఆక్టోబర్ 13న కేసు నమోదు చేశారని శివరాంరెడ్డి తెలిపారు.